ఓ మహిళ అప్పుడే నగల షాపు నుంచి కొనుక్కుని వెళ్తున్న బంగారు హారాన్ని తోటి మహిళా ప్రయాణికులు మాయం చేసేశారు.
ఒంగోలు (ప్రకాశం జిల్లా) : ఓ మహిళ అప్పుడే నగల షాపు నుంచి కొనుక్కుని వెళ్తున్న బంగారు హారాన్ని తోటి మహిళా ప్రయాణికులు మాయం చేసేశారు. ఈ ఘటన ఒంగోలు పట్టణంలో చోటుచేసుకుంది. పెళ్లూరు గ్రామానికి చెందిన సునీత అనే మహిళ తన సోదరునితో కలసి సోమవారం మధ్యాహ్నం ఒంగోలులోని ఖజానా జ్యుయెలర్స్‌కు వెళ్లారు. అక్కడ ఆమె రూ.96 వేల విలువ చేసే హారం కొనుగోలు చేశారు. తిరిగి గ్రామానికి వెళ్లేందుకు సమీపంలోనే ఓ ఆటో ఎక్కారు.
ఆమెతోపాటు మరో ముగ్గురు గుర్తుతెలియని మహిళలు కూడా ఆటో ఎక్కారు. కొంతదూరంలో ఉన్న నెల్లూరు బస్టాండ్ వద్ద ఆ మహిళలు దిగిపోగా కొద్దిసేపటి తర్వాత సునీత తన బ్యాగు చూసుకున్నారు. బ్యాగు జిప్ తీసి ఉండడంతోపాటు అందులో హారం ఉన్న పర్సు కనిపించలేదు. దీంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. వారు కేసు నమోదు చేసుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.