ఏటా వెయ్యి గుర్తు తెలియని శవాలు | 1000 unknown bodies in hyderabad city | Sakshi
Sakshi News home page

ఏటా వెయ్యి గుర్తుతెలియని శవాలు

Published Thu, Nov 5 2015 9:07 AM | Last Updated on Fri, Sep 28 2018 8:12 PM

ఏటా వెయ్యి గుర్తు తెలియని శవాలు - Sakshi

ఏటా వెయ్యి గుర్తు తెలియని శవాలు

నగరంలో గుర్తుతెలియని శవాల కేసులు పోలీసులకు సవాల్‌గా మారాయి. నేరగాళ్లు పకడ్బందీగా, ఆనవాళ్లు దొరకకుండా ఒక  ప్రాంతంలో హత్య చేసి శవాలను వేరే ప్రాంతాల్లో పడవేస్తున్నారు. దీంతో వివరాలు లభించక పోలీసులు గుర్తు తెలియని శవాలుగా పరిగణించి కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా ఏటా వేలాది గుర్తు తెలియని కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయి.

దీనిపై ఇటీవల ఓ కేసులో సుప్రీం కోర్టు సీరియస్‌గా స్పందించడంతో...ప్రభుత్వం గుర్తు తెలియని శవాల కేసులను శోధించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ముఖ్యనగరాల్లో డీఎన్‌ఏ సమాచార నిధి ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. తద్వారా గుర్తుతెలియని శవాల కేసులు,  మిస్సింగ్ కేసుల పరిష్కారం ఈజీ అవుతుందని పోలీసులు అంటున్నారు. ఈ నేపథ్యంలో డీఎన్‌ఏ సమాచార నిధిపై సాక్షి ప్రత్యేక కథనం.
 
ఏటా వెయ్యి గుర్తుతెలియని శవాలు
ఆచూకీ తెలియక పోలీసుల అవస్థలు
ఇప్పటి వరకు సరైన దిశ, దశ లేని దర్యాప్తులు
ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు
డీఎన్‌ఏ సమాచార నిధి ఏర్పాటు
సుప్రీం ఆదేశాల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం
ఎంతో ఉపయుక్తం అంటున్న నగర పోలీసులు

 
ఉత్తరాదిలో అదృశ్యమైన ఓ వ్యక్తి నగరంలో శవంగా కనిపిస్తాడు...
ఆ రాష్ట్రంలో మిస్సింగ్‌గా ఉన్న ఈ కేసు ఇక్కడ ఆన్‌నోన్ డెడ్‌బాడీగా ఉంటుంది...
అనేక కారణాల నేపథ్యంలో ప్రత్యర్థుల్ని హత్య చేస్తున్న నేరగాళ్ళు వారి శవాలను వేరే ప్రాంతానికి తరలించి రోడ్లపై పడేస్తున్నారు...
ఇది అక్కడ మిస్సింగ్ కేసుగా నమోదైనా ఇక్కడ వారికి ఆ విషయం తెలీక గుర్తు తెలియని శవంగానే ఉండిపోతోంది....

 
రాజధానిలో ఏటా లభిస్తున్న గుర్తుతెలియని మృతదేహాల వెనుక ఇలాంటి కథలు, కారణాలెన్నో. ఇప్పటి వరకు సరైన వేదిక లేకపోవడంతో ఈ కేసుల దర్యాప్తు దశ, దిశ లేకుండా సాగి క్లోజ్ అవుతోంది. కేవలం ఇక్కడే కాదు... దేశ వ్యాప్తంగా ఉన్న ఈ సమస్యను పరిష్కారం లభించనుంది. మిస్సింగ్ కేసులు, గుర్తుతెలియని శవాల డీఎన్‌ఏ సమాచార నిధిని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. సిటీలో వెలుగుచూస్తున్న ‘బహిరంగ నేరాలు’ తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.

ముఖ్యంగా గుర్తుతెలియని మృతదేహాలు పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. వ్యాపార, ఆర్థిక లావాదేవీలతో పాటు సెక్సువల్ జెలసీ కారణంగా అత్యంత దారుణంగా హత్యలు చేస్తున్న ప్రత్యర్థులు మృతదేహాలను బహిరంగ ప్రదేశాలకు తీసుకువచ్చి పడేస్తున్నారు. ఈ తరహా కేసులను కొలిక్కి తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నా ఫలితం దక్కట్లేదు. ఇదే మరికొందరు నేరగాళ్లు ఇదే బాటపట్టడానికి ‘ప్రోత్సాహం’ ఇస్తోంది.
 
ఇదే ఆ దుండగుల ధైర్యం..
ప్రత్యక్ష సాక్షులు ఉన్నప్పుడు మినహా హత్య, హత్యాయత్నం వంటివి జరిగినప్పుడు పోలీసుల దృష్టి తొలుత హతుల్ని గుర్తించడంపై ఉంటుంది. వీరెవరో తెలిస్తే గత చరిత్ర, వ్యాపార/వ్యక్తిగత లావాదేవీలు, ప్రవర్తన తెలుసుకోవడం సాధ్యంకాదు. హత్యకు వీటిలో ఏదో ఒకటి కారణమై ఉంటుంది. ఘటనాస్థలి, హతుడు లేదా హంతకుడికి సంబంధించి స్థలంలో శవాన్ని వదిలేస్తే అది దర్యాప్తునకు ఆధారంగా మారుతుంది. ఈ కారణంగానే హంతకులు హత్య తర్వాత హతుల్ని గుర్తుపట్టే అవకాశం లేకుండా బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారు. ఒకవేళ పోలీసులు గుర్తించినా... దానికి కొంత సమయం పడుతుంది. ఈలోపు నిందితులు ‘జాగ్రత్తలు’ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
 
 
‘రెడ్‌హ్యాండెడ్’ కాకపోవడానికి కారణాలనేకం....

హత్యలు చేసి మృతదేహాలను పార్శిల్స్ రూపంలో తరలిస్తున్నా రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు దొరక్కపోవడానికి అనేక కారణాలనేకం. ఇలాంటివి తీసుకువెళ్లే దుండగులు కార్లు, జీపులనే వాడతారు. పైగా అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు  ఇలాంటి పనులు చేస్తుంటారు. నగరంలో అవసరమైన స్థాయిలో సీసీ కెమెరాలు, వాటి పర్యవేక్షణ లేదు. ఇలా అనేక కారణాలతో శవాలను తరలిస్తున్న వారు రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడం అరుదుగా మారింది.
 
‘లుక్‌ఔట్’తో సరిపెట్టాల్సిందే...

ఇలా బహిరంగ ప్రదేశాల్లో శవాలుగా దొరుకుతున్న వారంతా ఎక్కడో ఒకచోట మిస్ అవుతున్న వారే. ప్రస్తుతం మిస్సింగ్ కేసులు, అన్‌నోన్ డెడ్‌బాడీ కేసుల దర్యాప్తు మొక్కుబడిగానే సాగుతోంది. వీరి ఫొటోలతో లుక్‌ఔట్ నోటీసులు జారీ చేస్తున్న పోలీసులు వాటిని అన్ని పోలీసుస్టేషన్లకు పంపిస్తున్నారు.

గుర్తుతెలియని మృతదేహాల్లో అనేక చెడిపోయిన స్థితిలో లభిస్తుండటంతో వీటిని మిస్సింగ్ కేసు నమోదు చేసిన మరో ఠాణా అధికారులు ఫొటోలను చూసినా గుర్తించే స్థితిలో ఉండట్లేదు. వీటన్నింటికీ తొడు సమన్వయ లోపం ఉండనే ఉంటోంది. ఫలితంగా అనేక మిస్సింగ్ కేసులు మిస్సింగ్స్ గానే, గుర్తు తెలియని మృతదేహాల కేసులు అలానే ఉండిపోతున్నాయి.
 
‘సుప్రీం’ ఆదేశాలతో కదిలిన కేంద్రం...
గుర్తుతెలియని శవాలకు సంబంధించి ఓ కేసును విచారించిన సుప్రీం కోర్టు జనవరిలో వీటిని కొలిక్కి తెచ్చేందుకు సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో కదిలిన కేంద్ర ప్రభుత్వం డీఎన్‌ఏ సమాచార నిధి ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించింది. దీనికోసం తయారు చేసిన ముసాయిదా బిల్లు ప్రకారం దేశంలోని అన్ని జిల్లాల్లో డీఎన్‌ఏ నమూనా సేకరణ, పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

ఈ కేంద్రాల్లో పని చేయడానికి అవసరమైన సంఖ్యలో నిపుణుల్ని ఎంపిక చేస్తారు. వీరికి నగరంలో ఉన్న సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ)లో శిక్షణ ఇప్పిస్తారు. వీరు గుర్తుతెలియని మృతదేహాలు, ‘మిస్సింగ్ కేసుల’ డీఎన్‌ఏను సేకరించి విశ్లేషించడంతో పాటు భద్రపరుస్తారు.
 
అవీ ఇవీ అన్నీ తేలతాయి...
ఈ సెంటర్ ఏర్పాటుతో ఓపక్క మిస్సింగ్ కేసులతో పాటు మరోపక్క అన్‌నోన్ డెడ్‌బాడీస్ గుట్టు రట్టవుతుందని అధికారులు చెప్తున్నారు. ఎవరైనా తమ వారు తప్పిపోయారని ఫిర్యాదు చేస్తే సంబంధీకులు డీఎన్‌ఏను సేకరిస్తారు. అలాగే దొరుకుతున్న గుర్తుతెలియని శవాల డీఎన్‌ఏను భద్రపరుస్తారు. ఈ వివరాలతో దేశ వ్యాప్తంగా సెంట్రలైజ్డ్ డేటాబేస్ సిద్ధమవుతుంది.

ఫలితంగా ఓ రాష్ట్రంలో తప్పిపోయి, మరో రాష్ట్రంలో శవంగా మారిన వారి వివరాలను తక్షణం గుర్తించే వీలు కలుగుతుంది. దీంతో పాటు మతిస్థిమితం లేని కారణంగా ఓ ప్రాంతంలో తప్పిపోయి మరో చోట పోలీసుల చెంతకు చేరుతున్న వారి వివరాలూ తెలుసుకుని సంబంధీకులకు అప్పగించే అవకాశం ఏర్పడుతుంది. దారుణహత్యలకు ఒడిగడుతున్న నేరగాళ్ళను కచ్చితంగా జైలుకు పంపేందుకు ఆస్కారం ఉందని నగర అధికారులు అంటున్నారు.
 
 సిటీలో దొరికిన గుర్తుతెలియని శవాల గణాంకాలు
 
 ఏడాది            సంఖ్య
 2011            937
 2012            1068
 2013            1061
 2014            1108
 2015 (అక్టోబర్)1070
 
03.08.2010
మెహిదీపట్నం ప్రధాన బస్టాప్‌లో పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నెం.12 ఎదురుగా ఉన్న బస్‌షెల్టర్ నెం.3 వద్దకు సూట్‌కేస్‌లో దారుణ హత్యకు గురైన మహిళ శవం లభించింది. దుండగులు కారులో తెచ్చి ఈ సూట్‌కేసు వదిలి వెళ్ళారు.
 
20.12.2010
సుల్తాన్‌బజార్ ఠాణా పరిధిలోని రామ్‌కోఠిలో ఫుట్‌పాత్‌పై కాళ్లు, తల లేని ఓ బాలుడి మొండెం దొరికింది. ఇది జరిగిన రెండో రోజున నారాయణగూడ ఠాణా పరిధిలో కాళ్లు లభించాయి. కేసు నారాయణగూడ ఠాణాకు బదిలీ అయింది. ఈ భాగాలు ఆ ప్రాంతంలో వాచ్‌మన్‌గా పని చేస్తున్న అరుణ్‌సింగ్ కుమారుడు రాకేష్‌దిగా భావించారు. అయితే బాధిత కుటుంబం కాదనడంతో దర్యాప్తు ముందుకు కదలలేదు.
 
28.6.2012
వనస్థలిపురం పోలీసుస్టేషన్ పరిధిలోని ఎఫ్‌సీఐ కాలనీలో ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో నిలబెట్టి ఉన్న ప్లాస్టిక్ డ్రమ్‌లో ప్లాస్టిక్ గన్నీ బ్యాగ్‌లతో పార్సిల్ చేసి టేప్ వేసి వదిలిన శవం లభించింది. ఈ కేసూ దర్యాప్తులో ఒక్క అడుగూ ముందుకు వెళ్ళలేదు.
 
 
 21.07.2013
అబిడ్స్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ గుర్తుతెలియని వ్యక్తిని హత్య చేసిన దుండగులు మృతదేహాన్ని పాలథీన్ సంచిలో పార్శిల్ చేసి తెచ్చారు. ఎంజే మార్కెట్ ప్రాంతంలోని చెత్తకుప్పలో పడేశారు. ఈ కేసు ఇప్పటికీ కొలిక్కిరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement