మృత్యుఘోష | 11 dead bodys cought after building collapses in Nanakramguda | Sakshi
Sakshi News home page

మృత్యుఘోష

Published Sat, Dec 10 2016 6:12 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

మృత్యుఘోష - Sakshi

మృత్యుఘోష

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో పేకమేడలా కూలిపోయిన భవన శిథిలాల తొలగింపు ప్రక్రియ ముగిసింది. మొత్తం 11 మృతదేహాలను బయటకు తీశారు. అదృష్టవశాత్తూ ఓ తల్లీ, ఆమె మూడేళ్ల కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. మంత్రులు, ఉన్నతాధికారులు అక్కడే ఉండి పర్యవేక్షించినా.. ఇరుకు రోడ్డు, విద్యుత్‌ తీగల కారణంగా సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం జరిగింది. శనివారం తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు కొనసాగాయి. ఈ ఘటన బాధితుల్లో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందినవారే. కొందరు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు, మరికొందరు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు ఉన్నారు.

నానక్‌రామ్‌గూడలో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం గురువారం రాత్రి 9.10 గంటల సమయంలో కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, జీహెచ్‌ఎంసీ, పోలీసు సిబ్బంది గురువారం రాత్రి 10 గంటల నుంచే సహాయక చర్యలు చేపట్టారు. మూడు ప్రొక్లెయినర్లు, పదుల సంఖ్యలో సిబ్బందితో శిథిలాల తొలగింపు చేపట్టారు. శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రేఖ అనే మహిళ, ఆమె కుమారుడు దీపక్‌ (3)లను ప్రాణాలతో బయటికి తీశారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ వెంటనే కాంటి నెంటల్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం శనివారం తెల్లవారుజాము వరకు మిగతా మృత దేహాలను వెలికితీశారు.
(‘మృత్యుఘోష’కు సంబంధించిన ఫొటోల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

అంతా ఏపీకి చెందినవారే..
వెలికి తీసిన మృతదేహాలను కోమటిపల్లి వెంకటలక్ష్మి (28), తేనేటి గౌరిశ్రీ (14), తేనేటి పైడమ్మ (35), తేనేటి సాంబయ్య (38), కోమటి పల్లి పోలినాయుడు (30), ఎన్‌.శంకర్‌ (18), శ్రీకాకుళం జిల్లా హీరా మండలానికి చెందిన దుర్గారావు (22), ఛత్తీస్‌గఢ్‌కు చెందిన శివ (30)గా గుర్తించారు. వీరిలో దుర్గారావు, శివ మినహా మిగతా వారు ఏపీలోని విజయ నగరం జిల్లా చిలకలపల్లి వారే. ఇదే జిల్లా సుభద్ర ప్రాంతానికి చెందిన పిరిడి పోలినాయడు (30), పిరిడి నారాయణమ్మ (23), పిరిడి మోహన్‌ (3) ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన తల్లీ కొడుకులు రేఖ (25), దీపక్‌ (3) ప్రాణాలతో బయటపడ్డారు. చిలకలపల్లికి చెందిన వారిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందినవారుకాగా.. సుభద్ర గ్రామానికి చెందిన ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు.

అది అక్రమ నిర్మాణమే
నానక్‌రామ్‌గూడ గ్రామ కంఠంలో ఎలాంటి అనుమతులూ లేకుండానే జీ ప్లస్‌ ఆరు అంతస్తుల ఈ భవనం నిర్మించినట్లు తేలిం ది. భవన యజమాని తుల్జారాం సత్య నారాయణసింగ్‌ అలియాస్‌ సత్తూసింగ్‌ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో కొనసాగుతుండడం వల్లే ఈ అక్రమ నిర్మాణం వైపు శేరిలింగంపల్లి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కన్నెత్తి కూడా చూడలేదని సమా చారం. కింది స్థాయి సిబ్బంది అక్కడికి వెళ్లినా సత్తూసింగ్‌ భయపెట్టేవాడని స్థానికులు చెబు తున్నారు. కాగా భవనం కుప్పకూలిన అనంతరం సత్తూ సింగ్‌ పరారీలో ఉన్నట్లు తెలు స్తోంది. కొంత మంది స్థానికులు అతను శబ రిమల వెళ్లాడని చెబుతుండగా.. మరికొందరు హైదరాబాద్‌లోనే ఉండవచ్చని చెబుతున్నారు.

శిథిలాల తొలగింపులో జాప్యం
కూలిన భవనం శిథిలాలు తొలగింపులో తీవ్ర జాప్యం జరిగింది. ఇరుకైన రోడ్లు, విద్యుత్‌ తీగలు ఉండటంతో శిథిలాలను వేగంగా తొలగించడం, టిప్పర్లలో తరలించడం వంటివి ఆలస్యమయ్యాయి. దాంతో గంటల తరబడి సహాయక చర్యలు కొనసాగాయి.

మృత్యుంజయులు ఆ తల్లీబిడ్డ
సాక్షి, హైదరాబాద్‌: నానక్‌రామ్‌గూడలో ఏడంతస్తుల భవనం పేక మేడలా కుప్పకూలినా ఓ తల్లీకొడుకు మాత్రం మృత్యుంజయులుగా బయటపడ్డారు. అయితే కూలిన భవనానికి ఉత్తరం వైపున మరో భవనం ఉంది. ఆ భవనాన్ని ఆనుకొని శాంతాబాయికి చెందిన భవనం ఉంది. అక్కడ శిథిలాల్లో కొందరు ఉండే అవకాశముందని స్థానికులు అధికారులకు సూచించారు. దీంతో పక్కనున్న భవనాన్ని కొద్ది మేర కూల్చి, సమాంతరంగా గొయ్యి తవ్వారు. డాగ్‌స్క్వాడ్‌ కూడా అక్కడ ఎవరో ఉన్నట్లుగా సూచించింది. గురువారం అర్ధరాత్రి అనంతరం 2 గంటల సమయంలో మహిళ, చిన్నారి ఏడుపులు వినిపించడంతో.. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం అప్రమత్తమైంది.

 

చిన్నపాటి రంధ్రం చేయగా రేఖ (25) కనిపించింది. అక్కడే ముగ్గురం ఉన్నామని, తమను త్వరగా కాపాడాలని అర్థించింది. అధికారులు మరో మూడు గంటల పాటు శ్రమించి, మెల్లమెల్లగా శిథిలాలను తొలగించి ఆమెతోపాటు కుమారుడు దీపక్‌ (3)ను ప్రాణాలతో బయటకు తీశారు. అయితే రేఖ భర్త శివ (30) మాత్రం మృతిచెందాడు. అయితే రేఖ వెన్నెముక, కాలు, మోకాలికి తీవ్రగాయాలుకాగా.. దీపక్‌ ఎడమ కాలు విరగింది, తలకు గాయాలయ్యాయి. వారిని కాంటినెంటల్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఓవైపు భర్త మరణించడం, కుమారుడు తీవ్రగాయాలపాలై తనతోపాటు ఆస్పత్రిలో ఉండడంతో రేఖ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.

మంత్రి కేటీఆర్‌తో బాధితుల వాగ్వాదం

వెలికితీసిన మృతదేహాలను వెంటనే తరలిస్తున్నారని, చనిపోయిన వారు ఎవరో కూడా చూడనివ్వడం లేదని బాధిత కుటుంబాలకు చెందినవారు మంత్రి కె.తారకరామారావుతో వాగ్వాదానికి దిగారు. అయితే మృతదేహాలను తాత్కాలికంగా కాంటినెంటల్‌ ఆస్పత్రికి తరలిస్తున్నామని, అక్కడ బంధువులకు చూపించాకే పోస్టుమార్టంకు తరలిస్తామని చెప్పడంతో శాంతించారు.

రాత్రంతా పర్యవేక్షించిన మంత్రులు: పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు అక్కడే ఉండి భవనం శిథిలాల తొలగింపును పర్యవేక్షించారు. గురువారం రాత్రే ఘటనా స్థలికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని, పద్మారావు, గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, సైబరాబాద్‌ సీపీ సందీప్‌ శాండిల్య తదితరులు... తీవ్రమైన చలిలో రాత్రంతా అక్కడే ఉన్నారు. శుక్రవారం ఉదయం తల్లి, కొడుకు సురక్షితంగా బయటపడ్డ తరువాత మంత్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు శుక్రవారం ఉదయమే మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహేందర్‌రెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకుని... రాత్రి వరకూ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు.

తరలివచ్చిన వివిధ పార్టీల నేతలు
ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని, బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావులు పలువురు టీడీపీ నాయకులతో కలసి వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ, ఆ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ అధ్యక్షుడు సాయినాథ్‌రెడ్డి తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నేతలు షబ్బీర్‌అలీ, భిక్షపతియాదవ్, రవికుమార్‌యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తదితరులు కూడా బాధితులను పరామర్శించినవారిలో ఉన్నారు.

బతికుంటే బాగుండు దేవుడా..
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం చిల కలపల్లి గ్రామానికి చెందిన వారంతా కొన్నేళ్ల కింద ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. గచ్చిబౌలి, కూకట్‌పల్లి, బోరబండ, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణ పనుల్లో వారు కూలీలుగా పనిచేస్తున్నారు. నానక్‌రామ్‌గూడలో భవనం కూలి తమ గ్రామస్తులు చనిపోయారని తెలుసుకున్న వారంతా శుక్రవారం పెద్ద సంఖ్యలో ప్రమాద స్థలికి వచ్చారు. తమ వారు బతికుంటే బాగుండు దేవుడా అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు.

రూ.10 లక్షల పరిహారం  
మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: కేటీఆర్‌
హైదరాబాద్‌: నానక్‌రామ్‌గూడలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.లక్ష నష్ట పరిహారం చెల్లిస్తామని మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం ఘటనా స్థలిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. డిప్యూటీ కమిషనర్‌ వి.వి.మనోహర్, టౌన్‌ ప్లానింగ్‌ ఏసీపీ కృష్ణమోహన్‌లను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాధ్యులను పట్టుకుంటామన్నారు. ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని, పద్మారావు, హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారని తెలిపారు. కూలిపోయిన భవనం పక్కనే ఉన్న రెండు భవనాలు కూడా కొంత వరకు దెబ్బతిన్నాయని.. వాటిని నిపుణులతో పరిశీలన చేయించి, ప్రమాదకరమని తేలితే కూల్చివేస్తామని కేటీఆర్‌ తెలిపారు.

కూలిన ఘటనపై నివేదిక ఇవ్వండి: దత్తాత్రేయ
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌ గూడలో భవనం కూలిన ఘటనపై నివేదిక ఇవ్వాలని కేంద్ర కార్మిక శాఖ ప్రధాన కమిషనర్‌ అనీల్‌కుమార్‌ నాయక్‌ను కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆదేశించారు. ఘటనకు సంబంధించి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సుందర్‌ అబ్నార్‌లతో ఫోన్లో మాట్లాడి అక్కడి పరిస్థితిని సమీ క్షించారు. ప్రమాదంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కార్మికులు మరణించడంతో ఆ రాష్ట్ర కార్మిక మంత్రి లాల్‌ రాజ్‌వాడే తో మాట్లాడి మృతుల బంధువులకు విషయం తెలియజేయాలని చెప్పారు.

కూలిన ఘటనపై విచారణ జరపండి: సీపీఐ, సీపీఎం డిమాండ్‌
హైదరాబాద్‌ లోని నానక్‌రామ్‌గూడలో నిర్మా ణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కూలిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ, సీపీఎం వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్‌ చేశాయి. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరాయి.

బాధ్యులపై కఠిన చర్యలు
‘‘నానక్‌రామ్‌గూడ ఘటనలో బాధ్యులెం తటి వారైనా కఠిన చర్య లు తప్పవు. కూలీలు చనిపోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. భవన యజమాని సత్తూసిం గ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు..’’  - రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement