ఆశలు సమాధి!
- భవన శిథిలాల కింద మొత్తం 11 మంది మృతి
- ప్రాణాలతో బయటపడింది ఇద్దరే
- నానక్‌రాంగూడలో 30 గంటలపాటు కొనసాగిన శిథిలాల తొలగింపు
- మృతుల్లో 9 మంది విజయనగరం జిల్లా వాసులు
- ఉస్మానియాలో పూర్తయిన పోస్టుమార్టం
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలోని నానక్‌రాంగూడలో కుప్పకూలిన భవనం కింద ఎవరైనా బతికి ఉన్నారేమోనన్న ఆశలు శిథిలాల కిందే సమాధి అయ్యాయి! ప్రభుత్వం, ఎన్‌డీఆర్‌ఎఫ్‌తో సహా వివిధ ప్రభుత్వ విభాగాలు నిర్విరామంగా 30 గంటలపాటు శ్రమించి శిథిలాలు తొలగించేసరికి మొత్తం పదకొండు మంది మృతి చెందినట్టు తేలింది. శిథిలాల్లో ఇరుక్కుపోయిన వారిలో ఒక్కరు కొన ఊపిరితో ఉన్నా వారిని బతికించాలనే లక్ష్యంతో అత్యంత జాగ్రత్తగా శిథిలాల తొలగింపు పనులు చేశారు. అయినా శుక్రవారం ప్రాణాలతో బయట పడిన ఇద్దరు తప్ప ఇంకెవరూ మిగల్లేదు. అంతా విగతజీవులయ్యారు.
శిథిలాలను తొలగించాక మొత్తం పదకొండు మంది మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. గురువారం రాత్రి 10 గంటలకు మొదలైన సహాయక చర్యలు శనివారం తెల్లవారు జామున 4 గంటల వరకు కొనసాగాయి. శుక్రవారం ఉదయం 5 గంటలకు దీపక్, అతని తల్లి రేఖను సురక్షితంగా వెలికి తీశారు. శనివారం తెల్లవారు జామున 3.15 గంటలకు చివరగా నెల్లి శంకర్‌రావు మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహాలకు ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.
మృతులు ఎక్కడివారు?
మృతుల్లోని 11 మందిలో తొమ్మిది మంది విజయనగరం జిల్లా బలిజపేట మండలం చిలకలపల్లి గ్రామానికి చెందిన వారు. మరో ముగ్గురు అదే జిల్లా సుభద్రకు చెందిన వారు. మరొకరిని శ్రీకాకుళం జిల్లా హిర మండలం గొట్టా బ్యారేజీకి చెందిన కొత్తపల్లి దుర్గారావుగా గుర్తించారు. మరో వ్యక్తి శివను ఛత్తీస్‌గఢ్‌కు చెందినవాడిగా గుర్తించారు. ఈయన భార్య రేఖ, కొడుకు దీపక్ గాయాలతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మృతులు వీరే..
కోమటిపల్లి వెంకటలక్ష్మీ(24), నేతేటిæ పైడమ్మ(46), నేతేటి నేటి సాంబయ్య(48), తేటి గౌరీశ్వరీ(14), కొత్తపల్లి దుర్గారావు(25), శివ, పిరిడి పొలినాయుడు(25), ఆయన భార్య పిరిడి నారాయణమ్మ(23), పిరిడి
మోహన్(4), కోమటిపల్లి పోలినాయుడు(32), నెల్లి శంకర్ రావు(20).
మంత్రుల పర్యవేక్షణ: శిథిలాల తొలగింపు, మృతదేహాల వెలికితీత ప్రక్రియను పర్యవేక్షించేందుకు మంత్రులు గంటల తరబడి ఘటనా స్థలంలోనే ఉండిపోయారు. మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం 10 గంటలకు ఘటనా స్థలానికి చేరుకొని శనివారం తెల్లవారు జామున 2.45 గంటలకు తిరిగి వెళ్లిపోయారు. దాదాపు 16 గంటలకు పైగా సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆయనతో పాటు మంత్రి మహేందర్‌రెడ్డి, మేయర్ బొంతు రాంమోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్ధీన్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఉన్నారు. గురువారం రాత్రి డిప్యూటీ సీఎం మహుమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహ్మ రెడ్డి, మంత్రి పద్మారావులు దాదాపు 8 గంటల పాటు సహయక చర్యలను పర్యవేక్షించారు.
మరో ఇద్దరి సస్పెన్షన్..
భవనం కూలిన ఘటనలో మరో ఇద్దరిని సస్పెండ్ చేశారు. సర్కిల్–11 టౌన్ ప్లానింగ్ విభాగంలో పని చేస్తున్న సెక్షన్ ఆఫీసర్ పి.మధుతోపాటు ఇదివరకు ఇక్కడ పనిచేసి, ప్రస్తుతం సర్కిల్‌లో 7లో పనిచేస్తున్న సెక్షన్ ఆఫీసర్ ఆర్.రాజేందర్‌ను జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి సస్పెండ్ చేశారు.
మృతుల కుటుంబాలకు ఏపీ సర్కార్ నష్టపరిహారం
సాక్షి, అమరావతి: హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ఘటనలో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం శనివారం నష్టపరిహారం ప్రకటించింది. ఘటనలో మృతి చెందిన పెద్దలకు రూ.5 లక్షలు, పిల్లలకు రూ.2.5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ఏపీ సీఎం బాబు తెలిపారు.
కొచ్చిలో సత్తూసింగ్ అరెస్టు!
హైదరాబాద్: నానక్‌రాంగూడలో కుప్పకూలిన భవనం యాజమాని సత్యనారాయణసింగ్ అలియాస్ సత్తూసింగ్‌ను సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు కొచ్చిలో అరెస్టు చేసినట్లు సమాచారం. అయ్యప్ప మాలధారణ వేసిన సత్తూసింగ్ కొద్దిరోజుల క్రితం శబరిమలై వెళ్లి తిరిగి వస్తున్నట్లు తెలుస్తోంది. భవనం కూలి 11 మంది మృతి చెందడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే సైబరాబాద్ క్రైమ్స్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డిని విచారణ అధికారిగా నియమించింది. ఫోన్ కాల్స్ ఆ«ధారంగా సత్తూసింగ్ ఆచూకీ కనుగొన్న ఎస్‌వోటీ పోలీసులు.. శుక్రవారం అర్ధరాత్రి అతనిని కొచ్చిలో అరెస్టు చేసి విమానంలో నగరానికి తీసుకొచ్చినట్లు తెలిసింది. అతనిపై ఐపీసీ 304 పార్ట్–2, 304ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
బాధ్యులైన వారందరిపై కేసులు
భవనం కూలిన ఘటనలో బాధ్యులైన వారందరిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. సత్తూసింగ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు, ఇంజనీర్, మేస్త్రీ, జీహెచ్‌ఎంసీ అధికారులపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే శనివారం జీహెచ్‌ఎంసీ సిబ్బంది, అధికారులను విచారించినట్లు విశ్వసనీయ సమాచారం.
‘సుమధుర’పై తర్జన భర్జన : కాగా, భవనం కూలడానికి సుమధుర కనస్ట్రక్షన్ కంపెనీ లోతైన సెల్లార్ తీయడం కూడా కారణం కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సుమధుర కనస్ట్రక్షన్‌పై కేసు నమోదు చేయాలా? వద్దా? అనే విషయంపై పోలీసులు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. అయినప్పటికీ కేసు నమోదు చేయడంపై వారు తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.