ఇంకా షాక్ లోనే ఆ బస్తీ..
రాయదుర్గం: నానక్‌రాంగూడలోని లోధిబస్తీ భవనం కుప్పకూలడంతో ఇక్కడివారు గురు, శుక్రవారాలు నిద్రలేని రాత్రులు గడిపారు. స్థానికంగానే మంత్రులు, ఎమ్మెల్యే, మేయర్, డిప్యూటీ మేయర్, స్థానిక కార్పొరేటర్, జీహెచ్‌ఎంసీ, వివిధ విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది అక్కడే మకాం వేసి సహాయక చర్యలు చేపట్టారు. అక్కడ ఏం జరిగిందో.. ఎలా జరిగిందో ఊహించుకుటూ షాక్‌లో ఉండిపోయారు. తమతో కలిసున్న 11 మంది మృత్యువాత పడడం వారిని బాధిస్తోంది. అంత భవనం నేలమట్టం కావడంతో అందులో చిక్కుకున్నవారిని కాపాడాలనుకున్నా నిస్సహాయులమే అయ్యామని కన్నీటి పర్యంతమయ్యారు.
కుడివైపు కూలి పడింటే ఘోరం జరిగేది..
భవనం ఒకేచోట కుప్పకూలింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఆ ఏడంతస్తుల భవనం కుడివైపు కూలిపోయింటే మాత్రం అక్కడ ఉన్న బీరేందర్‌సింగ్ ఇల్లు, ఆ పక్కనే చిన్నచిన్న ఇళ్లపై పడేది అప్పుడు మృతులు సంఖ్య ఇంకే పెరిగేదని ఇక్కడివారు చెబుతున్నారు. ఇక్కడివారు కాకపోయినా 11 మంది చనిపోవడం కలచివేస్తోందని, తమ బంధువులు కాకపోయినా స్నేహంగా ఉండేవారని, ఏడాదిగా తమతోనే మసలారని ఇక్కడివారు తెలిపారు.
భోజనం చేసిన 10 నిమిషాలకే..
తాను కుప్పకూలిన భవనంలో ఉంటున్నవారి వద్దే భోజనం చేసేవాడినని పక్కనే ఉన్న సత్యనారాయణసింగ్ మరో భవనం వాచ్‌మెన్ టి.వెంకటేశ్వరరావు తెలిపాడు. గురువారం రాత్రి 8 గంటలకు వారింటిలో అందరితో కలిసి టీవీ చేస్తూ భోజనం తిన్నామన్నాడు. అన్నం తిని పది నిమిషాలు అక్కడే వారితో మాట్లాడి తన గదికి వెళ్లానని, పదినిమిషాల్లో పెద్ద శబ్దం వచ్చిందని సంఘటనను గుర్తు చేసుకున్నాడు.
బయటకు వచ్చి చూడగా ఏడంతస్తుల భవనం కుప్పకూలి కనిపించిందన్నాడు. పశ్చిమ గోదావరిజిల్లా ఆచంట వేమవరం గ్రామం నుంచి వచ్చిన తాను.. ఇక్కడ వాచ్‌మెన్ గా పనిచేసే తమ బంధువు కోటేశ్వరరావు సొంతూరు వెళుతూ తనను అక్కడ వాచ్‌మెన్ గా ఉండమన్నాడని, భోజనం సాంబయ్య ఇంట్లో చేయాలని చెప్పి వెళ్లాడన్నాడు. గురువారం, శుక్రవారం అసలు నిద్రనే లేదని కన్నీట పర్యంతమయ్యాడు.
– వెంకటేశ్వరరావు