రాజధానిలో విషాదం
రాజధానిలో విషాదం
Published Sat, Dec 10 2016 3:52 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
బతుకు మెరుగుపరుచుకుందామని, వెన్నాడుతున్న సమస్యలను విరగడ చేసుకుం దామని ఆశించి ఉన్న ఊరును వదిలి పొట్ట చేతబట్టుకుని వచ్చిన నిర్మాణ రంగ కూలీలను మృత్యువు కాటేసింది. హైదరాబాద్ నగరంలోని నానక్‌రాంగుడాలో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఉదంతంలో 16మంది అభాగ్యులు మరణించారని వార్తలొచ్చినా 24 గంటలు గడిచాక కూడా మృతులెం దరో నిర్ధారణ కాలేదు. శుక్రవారం రాత్రికి ఆరు మృతదేహాలను వెలికితీశారు. ఇద్దరు సజీవంగా బయటపడ్డారు.
ఎక్కడో ఆంధ్రప్రదేశ్‌లో మూలకు విసిరేసిన ట్టుండే విజయనగరం జిల్లా నుంచి ఇంత దూరం వచ్చిన కూలీలకు ఏ విధమైన బతుకు భద్రతా లేదని ఈ ఉదంతం నిరూపించింది. కేవలం 170 గజాల స్థలంలో ఎలాంటి అనుమతీ లేకుండా ఏడంతస్తుల భవనం నిర్మాణమవుతుంటే ప్రభుత్వ శాఖలు, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్‌కు సంబంధించిన విభాగాలు కళ్లు మూసు కున్నాయి. పన్నులు వసూలు చేయడానికి, అధికారాలు చలాయించడానికి ఎక్కడ లేని ఉత్సాహమూ ప్రదర్శించే అధికారులు ఏడాది నుంచి ఈ తంతు నడుస్తున్నా ఏమీ పట్టనట్టు ఉండిపోయారు. వాస్తవానికి అనుమతులు తీసుకున్న నిర్మాణాల విషయంలో సైతం పర్యవేక్షణ ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగానే అన్నీ సాగుతున్నాయా అన్న ఆరా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనిఖీలుంటాయి. కానీ నగరంలో గత కొంతకాలంగా చోటుచేసుకున్న ఉదంతాలను గమనిస్తే అవేమీ సక్రమంగా సాగటం లేదని అర్ధమవుతుంది.
నిరుడు షేక్‌పేటలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం ఒరిగింది. ఫిలింనగర్ సాంస్కృతిక కేంద్రం ఎదుట నిర్మిస్తున్న పోర్టికో కుప్పకూలి ఇద్దరు కూలీలు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఆ మరు సటి నెలలో జూబ్లీహిల్స్‌లో మరో మూడంతస్తుల భవనం కూలింది. ఆ నిర్మాణం నాణ్యత సరిగా లేదని అప్పట్లో అధికారులు చెప్పారు. మాదాపూర్‌లో మరో నిర్మాణం కూలడంతో పలువురు గాయపడ్డారు. కూకట్‌పల్లి కాలనీలో సైతం ఒక నిర్మాణం కూలి ముగ్గురు కార్మికులు చనిపోయారు. ఈ ఉదంతాలన్నిటా ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియదుగానీ... కఠినంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉండేది కాదని తేటతెల్లమవుతుంది. ఎక్కడో మారుమూల పల్లె టూరులో అయితే వేరు... కానీ రాజధాని నగరం నడిబొడ్డున ఎలాంటి అనుమ తులూ లేకుండా సుదీర్ఘకాలంగా పనులు సాగుతుంటే అధికారులెవరి దృష్టికీ రాలే దని నమ్మగలమా? ఆ నిర్మాణానికి చేర్చి ఆవాసాలున్నాయి. కానీ ఫలితం ఉంటుం దన్న విశ్వాసం లేకపోవడంవల్లే కావొచ్చు... ఎవరూ ఫిర్యాదు చేయడానికి సాహ సించలేదు. ఇలాంటి ఉదంతాలు సామాన్య పౌరులకు ప్రభుత్వ యంత్రాంగంపై ఉండే అపనమ్మకాన్ని చాటిచెబుతాయి. ఏ నిర్మాణమైనా ఉన్నట్టుండి కుప్పకూలి నట్టు కనిపిస్తుందిగానీ అందుకు సంబంధించిన జాడలు పగుళ్లు, బీటల రూపంలో జాగ్రత్తగా గమనిస్తే ముందే కనిపిస్తాయి. ఎప్పటికప్పుడు జరిగే తనిఖీల్లో ఇలాం టివి వెల్లడవుతాయి.
నిర్మాణ రంగానికి సంబంధించి నిరంతరం జరిగే పరిశోధనలు ఎన్నో కొత్త అంశాలను వెలుగులోకి తెస్తున్నాయి. ముఖ్యంగా అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్, అమెరికన్ కాంక్రీట్ ఇనిస్టిట్యూట్ వంటివి ఈ పరిశోధనలకు అను గుణంగా తమ తమ బిల్డింగ్ కోడ్‌లను మార్చుకున్నాయి. బాంబు పేలుళ్ల వంటివి సంభవించినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు ఒక్కసారిగా భవనాలు కుప్ప కూలి పోకుండా చూడటానికి నిర్మాణానికి ఉపయోగించే స్టీల్‌కు సాగే గుణం ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కాంక్రీట్ నాణ్యతకు సంబంధించి సైతం కొత్త ప్రమా ణాలు వచ్చాయి. కాంక్రీట్‌లో సూదివంటి స్టీల్ మైక్రో ఫైబర్లను కలిపే పద్ధ తిని ప్రవేశపెట్టారు. బాంబు పేలుళ్ల వంటి ఉదంతాల్లో వెనువెంటనే భవనాలకు ఏం కాకుండా ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. పౌరుల ప్రాణాలకు విలువ నిచ్చి, నష్టాన్ని కనిష్ట స్థాయిలో ఉంచడం కోసం ఈ మాదిరి పరిశోధనలు నిరంతరం సాగుతున్నాయి.
మనదగ్గర కూడా పదిహేనేళ్లక్రితం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భవనాలు కుంగిన ఉదంతాలు చోటుచేసుకున్నప్పుడు ప్రభుత్వానికి హైకోర్టు విలువైన సూచనలు చేసింది. భవన నిర్మాణానికి సంబంధించిన నాణ్యతపై బిల్డర్ నుంచి మాత్రమే కాక ఆర్కిటెక్ట్, స్ట్రక్చరల్ డిజైనర్ తదితరుల నుంచి సైతం గట్టి హామీ తీసు కోవాలని తెలిపింది. అవి ఏమేరకు అమలవుతున్నాయో తెలియదు. ఇప్పుడిప్పుడు భూకంపాలను తట్టుకునే స్థాయిలో నిర్మాణాలు ఉండాలన్న నిబంధనలొస్తున్నాయి. అలాగే అనుకోని ఇబ్బందులు తలెత్తినప్పుడు అగ్నిమాపక సిబ్బంది చర్యలకు వీలుగా భవన నిర్మాణానికి చుట్టూ నిర్దిష్టమైన జాగా వదలాలని, అందులో నివాసం ఉండే వారు అక్కడినుంచి సులభంగా బయటపడటానికి వీలైన మార్గాలుండాలని నిర్దే శిస్తున్నారు. వీటన్నిటి సంగతలా ఉంచి... అసలు ఏ అనుమతులూ లేకుండానే అతి తక్కువ స్థలంలో భారీ భవనం నిర్మించడం అత్యంత దుర్మార్గం.
ఇదంటే సొంతానికి నిర్మించుకుంటున్న భవనం కావొచ్చు. కానీ బిల్డర్ ఎవరైనా బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్నానని చెప్పి అందరివద్దా భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి నాణ్యతా ప్రమాణాలను గాలికొదిలేస్తే లక్షలు పోసి సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకున్నవారి గతేమిటి? ఒకచోట డబ్బుకు కక్కుర్తిపడి చూసీ చూడనట్టు ఊరుకున్న అధికారి మరోచోట చిత్తశుద్ధితో వ్యవహరిస్తాడన్న గ్యారెంటీ ఏం లేదు. ఎన్నో నిబంధనలు అమల్లోకొచ్చిన వర్తమానంలో సైతం బిల్డర్ తమను మోసం చేశాడంటూ వస్తున్న ఫిర్యాదులు తక్కువేమీ కాదు. అక్రమ నిర్మా ణాల విషయంలో ఉపేక్ష, అధికారుల చేతివాటం, అడ్డగోలుగా అనుమతులీయడం దేశ మంతటా వ్యాధిలా పెరిగింది. ఏదైనా నిబంధన వచ్చిందంటే అది అమలు చేయ డానికి కాక... పైసలు దండుకోవడానికే ఉపయోగపడుతోంది. తాజా ఉదంతం ప్రభు త్వానికి గుణపాఠం కావాలి. బాధ్యులపై కఠిన చర్యలకు ఉపక్రమించాలి. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించడంతోపాటు బాధ్యులుగా తేలినవారి నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేయాలి.
Advertisement
Advertisement