11 మంది న్యాయాధికారులపై సస్పెన్షన్ ఎత్తివేత
ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజనకు సంబంధించి హైకోర్టు రూపొందించిన న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల జాబితాను ఉపసంహరించుకోవాలంటూ రోడ్డెక్కినందుకు 11 మంది న్యాయాధికారులపై విధించిన సస్పెన్షన్‌ను హైకోర్టు ఎత్తివేసింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు న్యాయశాఖ ఉద్యోగులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తేసేందుకూ ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది. న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల జాబితాలో నిబంధనలకు విరుద్ధంగా ఏపీకి చెందిన న్యాయాధికారులను తెలంగాణకు కేటాయించారంటూ తెలంగాణ న్యాయాధికారుల సంఘం ఆధ్వర్యంలో న్యాయాధికారులు నిరసనకు దిగడం తెలిసిందే.
వారికి తెలంగాణ న్యాయవాదులూ మద్దతు పలికారు. అయితే జూన్ 26న న్యాయాధికారులు గన్‌పార్క్ నుంచి రాజ్‌భవన్ వరకు మౌన ప్రదర్శన చేపట్టి గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించడాన్ని క్రమశిక్షణరాహిత్యంగా పరిగణించిన హైకోర్టు తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.రవీందర్‌రెడ్డి. వి.వరప్రసాద్‌లపై జూన్ 27న సస్పెన్షన్ వేటు వేసింది. ఆ మర్నాడే సంఘం ఉపాధ్యక్షులు పి.చంద్రశేఖరప్రసాద్, డాక్టర్ సున్నం శ్రీనివాసరెడ్డి, సంయుక్త కార్యదర్శులు టి.మురళీధర్, ఎం.రాధాకృష్ణ చాహవాన్, కార్యనిర్వాహక సభ్యులు ఆర్.తిరుపతి, డి.రమాకాంత్, ఎస్.సరిత, పి.రాజు, జి.వేణులను సస్పెండ్ చేసింది.
చివరకు ఈ వ్యవహారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్దకు చేరగా సమస్య పరిష్కారానికి ఆయన హామీ ఇచ్చారు. దీంతో న్యాయాధికారులు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని కలసి విధుల్లో చేరేందుకు తాము సుముఖమని, సస్పెన్షన్లు ఎత్తేయాలని కోరారు. వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.