- మంత్రి జోగురామన్న ఆదేశం
సాక్షి, హైదరాబాద్: బీసీ కార్పొరేషన్, 11 ఫెడరేషన్ల స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాలలో అన్ని గ్రామాల లబ్ధిదారులకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగురామన్న ఆదేశించారు. ప్రస్తుత ఏడాదికి సంబంధించి (2015-16) స్వయం ఉపాధి పథకాల గ్రౌండింగ్‌ను 15 రోజుల్లో పూర్తిచేసి, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో లబ్ధిదారులకు అందజేయాలని ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలని అన్నారు. ధోబీఘాట్ల నిర్మాణాల్లో జాప్యం పట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
మంగళవారం సచివాలయంలో మంత్రి చాంబర్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ శాఖ ఇన్‌చార్జి ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్, కార్పొరేషన్ ఎండీ మల్లయ్యభట్టు, పది జిల్లాల ఈడీలు పాల్గొన్నారు. వచ్చే ఏడాది (2016-17) రాష్ట్రవ్యాప్తంగా 50 వేలమందికి సబ్సిడీతో కూడిన రుణాల మంజూరుకు కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది బీసీలకు స్వయం ఉపాధిని కల్పించేందుకు ఆర్థికసాయంతో పాటు వృత్తినైపుణ్యం పెంచేందుకు ప్రత్యేకదృష్టిని సారించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో యువతకు స్వయం ఉపాధిలో భాగంగా సెవెన్‌సీటర్ ఆటోలను ఇచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు, చేతివృత్తుల వారికి ప్రత్యేకంగా శిక్షణ శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. మేదర, కుమ్మర వంటి వివిధ చేతివృత్తులవారికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామన్నారు.
‘బీసీ’ పథకాల గ్రౌండింగ్ 15 రోజుల్లో చేయాలి
Published Wed, Feb 10 2016 1:21 AM | Last Updated on Sun, Sep 3 2017 5:17 PM
Advertisement
Advertisement