పట్టాలిస్తిరి.. భూములేవీ సారూ..!
- దళితుల భూ పంపిణీ పథకం కింద 3,668 మందికి పట్టాలు
- 9,659.95 ఎకరాలు పంపిణీ చేసినట్లు రికార్డుల్లో నమోదు
- మెజారిటీ లబ్ధిదారులకు భూమి అప్పగించని యంత్రాంగం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ పంపిణీ పథకం లక్ష్యం గాడితప్పుతోంది. ఈ పథకం కింద అర్హులైన వారికి మూడు ఎకరాల చొప్పున సాగుకు యోగ్యమైన భూమిని అందించినట్లు పట్టాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారుల ఉదాసీన వైఖరితో లబ్ధిదారులకు మాత్రం భూములను అప్పగించలేదు. దీంతో ఈ పథకం కింద ఎంపికైనా లబ్ధిదారుల కుటుంబాల ఆర్థిక స్థితిలో మాత్రం ఏ మార్పు కలగలేదు. పేద దళిత కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధిలోకి తెచ్చే క్రమంలో భాగంగా 2014–15 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం భూ పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది.
ఈ పథకం కింద విడతల వారీగా అర్హులను ఎంపిక చేస్తూ.. మూడు ఎకరాల వరకు వ్యవసాయ భూమిని ఉచితంగా ఇస్తోంది. ఈ క్రమంలో అర్హుల ఎంపిక, భూ పంపిణీ కార్యక్రమాన్ని చకచకా చేస్తున్న అధికారులు.. రైతులకు భూమిని అప్పగించడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలా పలు జిల్లాల్లో మెజారిటీ రైతులు భూ పంపిణీ కింద సర్టిఫికెట్లు పొందినా.. తమ పొలం ఎక్కడుందో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల పట్టాల పంపిణీతోపాటు భూమి వివరాలు స్పష్టం చేసినప్పటికీ.. ఆ భూమి వివాదాలపాలు కావడంతో లబ్ధిదారుల పరిస్థితి గందరగోళంగా మరింది.
పంపిణీ 9,659.95 ఎకరాలు..
2014–15 సంవత్సరం నుంచి అమల్లోకి తెచ్చిన భూ పంపిణీ పథకం ద్వారా ఇప్పటివరకు 3,668 దళిత కుటుంబాలకు 9,659.95 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున పంపిణీ చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ.. కొన్ని చోట్ల భూ లభ్యత, లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా ఒక ఎకరా నుంచి మూడు ఎకరాల మధ్య విస్తీర్ణంతో పంపిణీ చేశారు. ఈ మేరకు లబ్ధిదారులకు సర్టిఫికెట్లు ఇచ్చారు. కానీ భూమి పొజిషన్ చూపి అప్పగించలేదు. దీంతో పంపిణీ చేసిన భూమి పడావుగా ఉండగా.. లబ్ధి దారులు వ్యవసాయ కూలీలుగా ఇతరుల పొలాల్లో పని చేస్తున్నారు.
406.21 కోట్ల ఖర్చుతో..
భూ పంపిణీ పథకం కింద పంపిణీ చేసే భూమి సాగుకు యోగ్యమైనదిగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ భూమిలో భూగర్భ జలాలు అందుబాటులో ఉంటే వర్షాలు లేని సందర్భంలోనూ రైతు సాగు చేసుకునే వీలుంటుందని భావించింది. దీంతో ప్రభుత్వ భూమి లేని చోట ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి కొనుగోలు చేసి ఇవ్వాలని యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో ఇప్పటివరకు పంపిణీ చేసిన భూమి అంతా దాదాపు ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిందే. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.406.21 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కో ఎకరానికి సగటు రూ.4.28 లక్షలు ఖర్చు చేసింది. ఇంతపెద్ద మొత్తంలో ఖర్చు చేసినా అర్హులైన రైతులు ఇప్పటికీ సాగు చేయకపోవడం గమనార్హం. తాజాగా మరో 10 వేల ఎకరాల భూమిని పంపిణీ చేసేలా ఎస్సీ కార్పొరేషన్ రూపొందించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదించి రూ.447.35 కోట్ల మేర నిధులకు పచ్చజెండా ఊపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 4,007 కుటుంబాలకు భూ పంపిణీ చేయాలని ఆ శాఖ భావిస్తోంది.
భూమి ఎప్పుడు చూపుతారు..
వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో పగిడ్యాల, నాగసముందర్, అగ్గనూరు గ్రామాల్లో దాదాపు 40 మంది రైతులకు భూ పంపిణీ చేసినప్పటికీ ఒక్కరికీ పొజిషన్ ఇవ్వలేదు. దీంతో ఆ రైతులంతా ఉపాధి కూలీ పనులకు వలస కడుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలం కిష్టాపూర్ గ్రామ పరిధిలో 50 మంది లబ్ధిదారులకు మూడు ఎకరాల చొప్పున 150 ఎకరాలు పంపిణీ చేసినప్పటికీ పొజిషన్ మాత్రం ఇవ్వలేదు. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లిలో అధికారులు కొనుగోలు చేసిన భూమి వివాదాస్పదమైంది. దీంతో ఆ రైతులకు కొత్తగా వేరేచోట భూమి కొనుగోలు చేసి ఇస్తామని అధికారులు హామీ ఇచ్చినా.. ఇప్పటికీ అది నెరవేరలేదు.