రేషన్ కట్
31 వేల రేషన్ కార్డులు రద్దు
1.58 లక్షల లబ్ధిదారులకు రేషన్ సరుకులు బంద్
ఎన్‌ఐసీతో ఆధార్ అనుసంధానం ఫలితం
సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో అక్షరాల లక్షా 58 వేల మంది ఆహార భద్రత లబ్ధిదారులకు రేషన్ కోటా రద్దయింది. తాజాగా సుమారు 31 వేల 715 ఆహార భద్రత కార్డులను తొలగించి మార్చి కోటాను నిలిపివేస్తూ పౌరసరఫరాల శాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఆహార భద్రత లబ్ధిదారులు ఆధార్ నంబర్‌లను నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ)తో అనుసంధానం చేయడంతో బోగస్, డబుల్, అనర్హుల చిట్టా బయటపడింది. దీంతో అధికారులు వారిని గుర్తించి వేటు వేశారు. ఫలితంగా 96 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం కోటా తగ్గినట్లయింది. గతేడాది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాత రేషన్ కార్డులను రద్దుచేసి ఆహార భద్రత పథకం కింద దరఖాస్తులు స్వీకరించడంతో పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి. నగరవాసులతో పాటు వలస వచ్చిన ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం దరఖాస్తు చేసుకున్నారు. పౌరసరఫరాల శాఖ వద్ద సిబ్బంది కొరత కారణంగా కేవలం ఆధార్ కార్డులను పరిగణనలోకి తీసుకోని ఆహార భద్రత కార్డులు మంజూరు చేశారు. దీంతో బోగస్, డబుల్, ఇతర రాష్ట్రాల్లోని లబ్ధిదారులకు సైతం మంజూరు కావడంతో కార్డుల సంఖ్య ఒకేసారి ఎగబాకింది. తాజాగా ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆధార్ నంబర్లను ఎన్‌ఐసీ తో అనుసంధానం చేయడంతో అసలు విషయం బహిర్గతమైంది. మొత్తం మీద బోగస్, డబుల్, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర రాష్ట్రాల్లో కార్డులు ఉన్నవారిని గుర్తించి తొలగించారు.
ఇదీ పరిస్థితి
గ్రేటర్ ప్రజా పంపిణీ వ్యవస్థలో మొత్తం 12 సివిల్ సప్లయిస్ సర్కిల్స్ ఉండగా అందులో హైదరాబాద్ పరిధిలో తొమ్మిది, రంగారెడ్డి అర్బన్ పరిధిలో మూడు సర్కిల్స్ ఉన్నాయి. మొత్తంమీద ప్రస్తుతం ఆహార భద్రత కార్డులు 13.91 లక్షలు ఉండగా, అందులో 47,42 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. కాగా తాజాగా లబ్ధిదారుల ఆధార్‌ను ఎన్‌ఐసీతో అనుసంధానం చేయడంతో ఆహార భద్రత కార్డుల సంఖ్య 13.60 లక్షలకు, లబ్ధిదారుల సంఖ్య 45.84 లక్షలకు చేరింది. దీంతో పీఎడీఎస్ బియ్యం కోటా కూడా 2964 మెట్రిక్ టన్నుల నుంచి 2868 మెట్రిక్ టన్నులకు తగ్గిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.