రాష్ట్రంలో 80 శాతం మావోయిస్టు ప్రభావితమే! | 80 per cent of the Maoist Affect in the state! | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో 80 శాతం మావోయిస్టు ప్రభావితమే!

Published Sat, Jan 14 2017 3:31 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

రాష్ట్రంలో 80 శాతం మావోయిస్టు ప్రభావితమే! - Sakshi

రాష్ట్రంలో 80 శాతం మావోయిస్టు ప్రభావితమే!

బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ నివేదికలో వెల్లడి

  • 8 పాత జిల్లాల్లో మావోయిస్టు/ఉగ్రవాద కార్యకలాపాలు
  • ‘ఫోరెన్సిక్‌’ వినియోగంలో రాష్ట్ర పోలీసులు విఫలం
  • రాష్ట్ర ఏర్పాటు తర్వాతా వివిధ ఆందోళనలు
  • వీటిలో దేశంలోనే ఐదో స్థానంలో రాష్ట్రం
  • పోలీసు అధికారులపై ఆరోపణల కేసుల్లో నాలుగో స్థానం
  • దేశంలోనే అతి తక్కువగా మహిళా సిబ్బంది
  • సంచలనాత్మక అంశాలు వెలువరించిన బీపీఆర్‌అండ్‌డీ  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పెద్దగా మావో యిస్టుల ప్రాబల్యం లేదని పోలీసు అధికారులు తరచూ చెబుతుంటారు. రెండు మూడు జిల్లాలు మాత్రమే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయని పోలీసుశాఖ లెక్క లు పేర్కొంటున్నాయి. కానీ కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేసే బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (బీపీఆర్‌అండ్‌డీ) విభా గం మాత్రం తెలంగాణలో 80 శాతం మావో యిస్టు/ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలే నని తమ నివేదికలో పేర్కొంది. 2015–16 ఏడా దికి సంబంధించి రెండు రోజుల కింద ఈ నివేదికను విడుదల చేసింది. 2016 జనవరి 1వ తేదీ నాటికి తెలంగాణలోని 10 పాత జిల్లాల్లో 8 జిల్లాలు మావోయిస్టు/ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలేనని అందులో స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 172 పోలీస్‌ జిల్లాలు మావోయిస్టు ప్రభావితాలుగా ఉన్నాయని.. అందులో 8 జిల్లాలు తెలంగాణవేనని పేర్కొంది. ఈ జాబితాలో అత్యధికంగా అస్సాంలోని 36 జిల్లాలు, జమ్మూకశ్మీర్‌లో 25 జిల్లాలు, నాగాలాండ్‌లో 11, మణిపూర్‌లో 11, జార్ఖండ్‌లో 21 జిల్లాలు ఉన్నాయి.

‘ఫోరెన్సిక్‌’ వినియోగంలో విఫలం!
దక్షిణ భారతదేశంలోనే హైదరాబాద్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. అయితే రాష్ట్రంలోని పోలీస్‌ శాఖ మాత్రం సాంకేతిక ఆధారాల సేకరణ, వాటి నిరూపణలో పూర్తి స్థాయిలో విఫలమవుతున్నట్టు బీపీఆర్‌అండ్‌డీ పేర్కొంది. 2016 జనవరి 1వ తేదీ వరకు ఎఫ్‌ఎస్‌ఎల్‌లో 1.46 లక్షల కేసులు పెండింగ్‌లోనే ఉండిపోయాయని తెలిపింది. కారణం ఆయా సాంకేతిక ఆధారాల సేకరణ, వాటి నిరూపణకు సరైన నమూనాలు సేకరించకపోవడం, పని ఒత్తిడి పెరగడం, దర్యాప్తు అధికారుల నిర్లక్ష్యమేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్ని కేసుల్లో ఒక్క ఎఫ్‌ఎస్‌ఎల్‌ ఎప్పటికి నివేదికలిస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.

పెరిగిన ఆందోళనలు
రాష్ట్రం ఏర్పడకముందు ఎన్నో ఉద్యమాలు, ఆందోళనలు జరిగాయి. కానీ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014, 2015 లోనూ ఆందోళనలు ఉధృతంగానే జరిగినట్లు బీపీఆర్‌అండ్‌డీ నివేదిక వెల్లడించింది. 2014లో రాష్ట్రంలో అన్ని రకాల ఆందోళనలు కలిపి 7,202 కేసులు నమోదుకాగా.. 2015లో 8,926 ఆందోళనలు జరిగినట్టు నివేదికలో తెలిపింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు భారీగా జరిగిన రాష్ట్రాల్లో తెలంగాణ 5వ స్థానంలో ఉన్నట్టు పేర్కొంది. 2014లో జరిగిన ఆందోళనల్లో అధికంగా విద్యార్థి ఆందోళనలు ఉన్నాయి, ఇతరత్రా పార్టీలు, సంఘాలు, తదితరాలవి కలిపి 2,844 ఆందోళనలు, కార్మిక ఆందోళనలు 738, ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలు 575గా నమోదయ్యాయి. ఇక 2015లో చూస్తే మత పరమైన ఆందోళనలు 164, విద్యార్థి ఆందోళనలు 1,440, కార్మిక ఆందోళనలు 3,363, ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలు 1,240, రాజకీయ పార్టీలవి 22, ఇతరత్రా 3 ఆందోళనలుగా బీపీఆర్‌అండ్‌డీ పేర్కొంది. మొత్తంగా ఆందోళనల్లో మొదటి స్థానం తమిళనాడుకాగా.. తర్వాతి స్థానాల్లో వరుసగా పంజాబ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, తెలంగాణ ఉన్నాయి.

మన అధికారులపై ఆరోపణలూ ఎక్కువే!
రాష్ట్రంలో పోలీసు అధికారులు, సిబ్బందిపై ఆరోపణ కేసులు సైతం అధికంగానే ఉన్నాయని బీపీఆర్‌అండ్‌డీ పేర్కొంది. 2015 జనవరి ఒకటి నాటికి 1,586 మంది అధికారులపై ఆరోపణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. ఆ ఏడాది మరో 2,125 కొత్త కేసులు జతకలిశాయని తెలిపింది. మొత్తం 3,711 కేసుల్లో విచారణ జరిగిందని పేర్కొంది. 2016 జనవరి ఒకటి నాటికి 1,838 కేసులు పెండింగ్‌లోనే ఉన్నట్లు తెలిపింది. 2016 ఏడాది కేసులు కలిపితే అవి 2,500కు పైగా ఉండి ఉంటాయని తెలుస్తోంది.

అత్యల్పంగా మహిళా సిబ్బంది
దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణలో అత్యల్పంగా మహిళా పోలీసు సిబ్బంది ఉన్నట్టు బీపీఆర్‌అండ్‌డీ ఆందోళన వ్యక్తం చేసింది. మిగతా రాష్ట్రాల్లో 4.2 శాతం నుంచి 15 శాతం వరకు మహిళా సిబ్బంది ఉంటే... తెలంగాణలో కేవలం 3.13 శాతం మాత్రమే మహిళా సిబ్బంది ఉన్నట్టు పేర్కొంది. అస్సాం, జమ్మూకశ్మీర్‌లలోనూ మహిళల శాతం తక్కువగా ఉన్నట్లు తెలిపింది. అయితే తెలంగాణలో 2014, 15 సంవత్సరాల్లో పెద్దగా పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ జరగలేదు. 2016లో నోటిఫికేషన్‌ ఇచ్చిన పోలీస్‌ శాఖ.. మహిళా సిబ్బంది పెంపు కోసం 33శాతం రిజర్వేషన్‌ అమల్లోకి తీసుకువచ్చింది. కానీ పోస్టుల కేటాయింపు పెద్దగా లేకపోవడంతో మహిళా సిబ్బంది శాతం 4.5% వరకు మాత్రమే ఉండే అవకాశం ఉందని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement