తెలంగాణకు ఛత్తీస్‌గఢ్‌ ‘మావో’లు! | Chhattisgarh Maoists to Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణకు ఛత్తీస్‌గఢ్‌ ‘మావో’లు!

Published Wed, Jun 19 2019 3:10 AM | Last Updated on Wed, Jun 19 2019 3:10 AM

Chhattisgarh Maoists to Telangana - Sakshi

పెద్దపల్లి: ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు ఛత్తీస్‌గఢ్‌ మావోయిస్టులు వస్తున్నారా..? పోలీసులు మాత్రం వచ్చారనే అంటున్నారు. ఈ మేరకు పలుచోట్ల ఛత్తీస్‌గఢ్‌ మావోయిస్టులను పట్టుకుంటే రూ.5 లక్షల చొప్పున రివార్డులు ఇస్తామని పోస్టర్లు వేస్తున్నారు. మావోయిస్టు పార్టీ ఏర్పాటు చేసిన యాక్షన్‌ టీంలో ఉన్న భద్రు, లింగు, గంగాబీ, పాండు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందినవారే. వారి కదలికలపై పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఆదివాసీ ప్రాంతానికి చెందిన యువకులకు ధైర్యసాహసాలు ఎక్కువ ఉంటాయి. అలాంటివారే మావోయిస్టులో చేరుతుంటారు. ప్రస్తుతం ఆదివాసీ తెగకు చెందినవారే మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ ఉత్తర తెలంగాణ కార్యకలాపాల విస్తరణ కోసం వచ్చినట్లు భావిస్తున్నారు. వారిని పట్టుకునేందుకు పోస్టర్ల ప్రచారం ప్రారంభించారు.  

గతంలో ఇటు నుంచి అటు 
గతంలో ఉమ్మడి జిల్లాకు చెందిన అనేక మంది నక్సలైట్లు, మావోయిస్టులపై వివిధ రాష్ట్రాల్లో నగదు రివార్డులు ఉన్నాయి. మన వాళ్లను ఆయ రాష్ట్రాల్లో పట్టుకుంటే రూ.లక్ష నుంచి పాతిక లక్షల మేరకు ఖరీదులు ఉన్నాయి. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మావోయిస్టుపార్టీ యాక్షన్‌ టీం దళం ఒకటి ఖమ్మం, వరంగల్, భూపాలపల్లి మీదుగా రాష్ట్రంలో ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు. దీని కోసం ఆరుగురు సభ్యులతో కూడిన యాక్షన్‌ టీంను పట్టుకున్న సమాచారం అందించిన ఒక్కొక్కరిపై రూ.5 లక్షల మేర రివార్డును అందిస్తామని పోలీస్‌ యంత్రాంగం రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌ ప్రధాన కూడళ్ల వద్ద పోస్టర్లను అంటించారు. పోలీసులు ప్రకటించిన ఆరుగురు యాక్షన్‌ టీం సభ్యుల్లో ఐదుగురు మాడవీకాయ అలియాస్‌ రవి మినహాయిస్తే ఐదుగురు సభ్యులు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన వారే.  

కోయ, గొత్తికోయల జాతి వారు.. 
అటవీ ప్రాంతాల్లో ఉండే కోయ, గొత్తికోయ, కొండజాతికి చెందినవారు పెద్దఎత్తున మావోయిస్టుపార్టీలో చేరారు. ఒకనాడు తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్లినవారే అక్కడంతా నక్సలైట్ల దళాలలో సభ్యుల నుంచి కీలక నాయకుల వరకు పనిచేశారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో చాలా దళాలకు ఆదివాసీలే నాయకులుగా కొనసాగుతున్నారు. ఆదివాసీ జాతుల్లో సాహసమైన జాతీయులు గొత్తికోయలు. దాడుల్లో ధైర్యాన్ని ప్రదర్శించే గొత్తి కోయలు ప్రస్తుతం ఈ ప్రాంతానికి వచ్చినట్లు అనుమానిస్తున్న ఐదుగురు యాక్షన్‌ టీం సభ్యుల్లో ముగ్గురు ఉన్నట్లు తెలిసింది. వారిలో కురుసం మంగు అలియాస్‌ భద్రు బీజాపూర్‌ జిల్లా, లింగ్‌ అలియాస్‌ రాజేశ్, మడకంగూడ కుంట తాలూకా. కోవాసి గంగాధి సుకుమ జిల్లా మంగతూది ఛత్తీస్‌గఢ్, పాండు మంగులుది బీజాపూర్‌ జిల్లా.. ప్రస్తుతం సుకుమ బీజాపూర్, కాంకేర్, నారాయణపూర్‌ జిల్లాల్లో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ రిక్రూట్‌మెంట్‌ అయిన వారిని తెలంగాణ ప్రాంతానికి పంపించేందుకు ముందుగా కురుసం మంగు నాయకత్వంలో వ్యూహాత్మకంగా ఓ దళాన్ని మావోయిస్టు పార్టీ ఈ ప్రాంతానికి నియమించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమై అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతూనే నాయకులకు అదనపు భద్రత కల్పిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement