మావోల కదలికలపై పోలీస్ శాఖ అలర్ట్!
ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో సభలపై పోలీస్‌బాస్ ఆరా!
హైదరాబాద్: తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు పోలీస్ యంత్రాంగాన్ని కలవర పెడుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సరిహద్దుల్లో ఖమ్మం జిల్లాను ఆనుకొని ఉన్న దండకారుణ్యంలో గత బుధవారం నుంచి శుక్రవారం వరకు 3 రోజుల పాటు మావోలు సభలు నిర్వహించడం, కేంద్ర పోలీసు బలగాలు ఆవైపు కూడా రాకపోవడం పోలీస్ యంత్రాంగానికి సవాల్‌గా మారింది.
దీనిపై పూర్తి సమాచారం తెప్పించుకొన్న డీజీపీ అనురాగ్‌శర్మ భవిష్యత్ కార్యాచరణ రూపొందించినట్లు తెలిసింది. ఖమ్మం జిల్లా సరిహద్దులకు కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న బూరగులంక ద్వారా తెలంగాణ రాష్ట్రానికి విస్తరించాలనే ఆలోచనతో మావోలు ఉన్నట్లు పోలీస్‌శాఖకు పక్కా సమాచారం ఉంది.
ఎరుకని గూడెం, బూరుగులంక, పాలాచలం, గచ్చెనపల్లిలలో బేస్ క్యాంపులు ఏర్పాటు చేసే ప్రతిపాదన కేంద్రం వద్ద ఉంది. అప్పటి వరకు ఖమ్మం జిల్లాలోని రాష్ట్ర సరిహద్దులకు భారీగా పోలీస్ బలగాలను దింపాలని డీజీపీ నిర్ణయించినట్లు సమాచారం. అలాగే ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకొని ఉన్న వరంగల్, కరీంనగర్ సరిహద్దుల్లో సైతం భారీగా పోలీసు బలగాలను మోహరించాలని నిర్ణయించినట్లు సమాచారం. మహారాష్ట్రలోని గడ్చిరోలి రిజర్వ్ ఫారెస్ట్ ద్వారా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోకి మావోలు ప్రవేశిస్తున్నారన్న భావనతో ఈ జిల్లాల్లో గ్రేహౌండ్స్ దళాలను విస్తృతం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.