సాక్షి, న్యూఢిల్లీ: పోలీసు బలగాల్లో 33 శాతం మహిళలను నియమించాలని కేంద్రం పునరుద్ఘాటించింది. ఈ మేరకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఇటీవల కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ‘మహిళలు, చిన్నారులపై దాడులు’కు సంబంధించి హోంశాఖ పార్లమెంటరీ స్టాయీ సంఘం నివేదికలో సూచించిన సిఫార్సుల మేరకు పోలీసు బలగాల్లో మహిళల సంఖ్యను పెంచాలని పేర్కొంది. ప్రస్తుతం పోలీసు బలగాల్లో మహిళలు 10.30% మాత్రమే ఉండటంపై స్థాయీ సంఘం అసంతృప్తి వ్యక్తం చేసిందని తెలిపింది. పోలీసుల బలగాల్లో మహిళల ప్రాతినిథ్యం పెంచడం ఎందుకు ఆలస్యం అవుతోందో అర్థం కావడంలేదని నివేదికలో పేర్కొందని తెలిపింది.
పోలీసు బలగాల్లో మహిళల ప్రాతినిథ్యం 33% ఉండటం తప్పనిసరి అని ఎప్పటికప్పుడు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు హోంశాఖ సూచనలు చేయాలని స్పష్టం చేసినట్లు లేఖలో పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటికే పలుమార్లు లేఖలు రాసినట్లు గుర్తుచేసింది. పోలీసు బలగాల్లో అన్ని స్థాయిల్లోనూ మహిళల ప్రాతినిథ్యం పెంచడానికి ప్రత్యేక రిక్రూట్‌మెంట్ నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు చేపట్టిన చర్యలను తమ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment