ఆధార్‌ ఉంటేనే ఎరువులు! | Aadhaar to the fertilizer | Sakshi
Sakshi News home page

ఆధార్‌ ఉంటేనే ఎరువులు!

Published Mon, Jan 1 2018 3:45 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Aadhaar to the fertilizer - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతులు ఎరువులు కొనాలంటే ఇకపై ఆధార్‌ కార్డు వెంట తీసుకెళ్లాల్సిందే. ఇందుకోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఎరువుల దుకాణాలకు 6,641 పాయింట్‌ ఆపరేటింగ్‌ సేల్‌ (పీవోఎస్‌) యంత్రాలను సరఫరా చేసింది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు. దీనిపై కలెక్టర్లకు లేఖలు రాసినట్లు వెల్లడించారు. రైతులు తమ వెంట ఆధార్‌ కార్డు తీసుకురాకుంటే ఎరువులు విక్రయించకూడదని ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని ఎరువుల దుకాణాలకు ఆదేశాలు అందాయి. అమలు ప్రక్రియపై ఇప్పటికే ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. సాంకేతికంగా ఇబ్బందులు ఉన్న చోట చక్కదిద్దారు. కొన్నిచోట్ల పీవోఎస్‌ యంత్రాలు పని చేయకపోతే కొత్త వాటిని అందజేశారు.

సబ్సిడీ పక్కదారి పట్టకూడదనే
యూరియా, డీఏపీ తదితర ఎరువులను కంపెనీలు సబ్సిడీ ధరలకే రైతులకు అందుబాటులోకి తెస్తుంటాయి. తాజా నిర్ణయంతో సబ్సిడీ ఎరువులు రైతులకు కాకుండా మిక్సింగ్‌ ప్లాంట్లు, ఇతర అవసరాలకు వెళ్లకుండా అడ్డుకోవ చ్చు. పీవోఎస్‌ పద్ధతి ద్వారా నేరుగా లబ్ది చేకూర్చే బదిలీ (డీబీటీ) విధానాన్ని అమలు చేయాలనేది కేంద్రం లక్ష్యం. పీవోఎస్‌ యంత్రాలను తీసు కోకున్నా, ఈ పద్ధతిని అమలు చేయకున్నా సంబంధిత ఎరువుల దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలని కూడా సర్కారు స్పష్టం చేసింది. ఈ విధానం ఇప్పటికే అమలు కావాల్సి ఉండగా సరిపడా పీవోఎస్‌ యంత్రాలు అందుబాటు లో లేకపోవడంతో వాయిదా వేశారు. ఎట్టకేలకు నూతన సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు.

డబ్బులే చెల్లించాలి..
డీబీటీ విధానంలో ఎరువులు కొనుగోలు చేయాలంటే రైతు ఆధార్‌ కార్డు తీసుకురావాలి. అయితే ప్రస్తుతానికి డెబిట్‌ కార్డును ఉపయోగించే పద్ధతిని ప్రవేశపెట్టలేదు. కాబట్టి రైతులు డబ్బులు చెల్లించే ఎరువులు కొనుగోలు చేస్తారు. మున్ముందు డెబిట్‌ కార్డు ద్వారానే లావాదేవీలు జరిపేలా పీవోఎస్‌ యంత్రాలను తీర్చిదిద్దుతారు. వాటిలో డెబిట్‌ కార్డును ఉపయోగించేలా సాఫ్ట్‌వేర్‌ను ప్రస్తుతం ప్రవేశపెట్టడం లేదు. రైతులు పూర్తిస్థాయి లో డెబిట్‌ కార్డు లేదా రూపె కార్డు కలిగి ఉన్నట్లు నిర్ధారించుకున్నాక పీవోఎస్‌ యంత్రాల్లో సాఫ్ట్‌వేర్‌ను ఆధునీకరిస్తామని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. అలాగే రైతులకు ఒక గుర్తింపు నంబర్‌ కూడా ఇస్తారు. ఈ వివరాలు పీవోఎస్‌ యంత్రాల్లో నిక్షిప్తమై ఎరువుల కొనుగోలు లావాదేవీలు నమోదవుతాయి. లావాదేవీల సమాచారాన్ని కేంద్రా నికి సమర్పిస్తే సదరు సబ్సిడీని కంపెనీలకు చెల్లిస్తారు. ఈ విధానంలో సబ్సిడీ చెల్లింపు వ్యవహారం ప్రభుత్వం, కంపెనీల మధ్యనే ఉన్నందున రైతుకు అదనపు ఆర్థిక భారం ఉండబోదని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement