
‘ఆధార్’.. 99 శాతం పూర్తి..!
- అంగన్‌వాడీ పిల్లల కోసం స్పెషల్ డ్రైవ్
- మీ సేవ కేంద్రాల్లో ఆధార్ నమోదు
- ‘సాక్షి’తో యూఐడీఏఐ ప్రాంతీయ ప్రధాన ఉపసంచాలకులు ఎంవీఎస్ రామిరెడ్డి
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ‘ఆధార్’ నమోదు ప్రక్రియ 99 శాతం పూర్తి చేసినట్లు భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ప్రాంతీయ ప్రధాన సంచాలకులు ఎంవీఎస్ రామిరెడ్డి తెలిపారు. గురువారం ‘సాక్షి‘తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో తాజా జనాభా లెక్కల ప్రకారం 3.72 కోట్ల మందికి గాను 3.70 కోట్ల మందికి, ఆంధ్రప్రదేశ్‌లో 5.22 కోట్ల జనాభాకు గాను 4.90 కోట్ల మందికి ఆధార్ నంబర్లు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాలతోపాటు 0 - 5 సంవత్సరాలలోపు చిన్నారుల ఆధార్ నమోదు కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల చిన్నారులకు గాను 22 లక్షల చిన్నారుల వరకు, ఆంధ్రప్రదేశ్‌లో 35 లక్షల చిన్నారులకు గాను 11 లక్షల వరకు ఆధార్ నమోదు ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి ఆఖరు వరకు నిర్వహించే స్పెషల్ డ్రైవ్ కోసం 400 చొప్పున కిట్స్‌ను గ్రామాలకు పంపించినట్లు వివరించారు.
శాశ్వత కేంద్రాల ఏర్పాటుతో పాటు మీ-సేవా కేంద్రాలకు కూడా ఆధార్ నమోదు కోసం అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. నవంబర్ 30 వరకు ఆధార్ నమోదు చేసుకున్నవారికి ఆధార్ నంబర్‌తో సహా కార్డులు జారీచేశామని, డిసెంబర్ 1 నుంచి నమోదు చేసుకున్న వారికి ఈ నెల 14 నుంచి జారీ చేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆధార్ కార్డులో మార్పులు చేర్పులను పోర్టల్ ద్వారా నేరుగా జనరేట్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. పేరులో తప్పులు, చిరునామా మారిన ఆన్‌లైన్‌లోనే ఆప్ డెట్ చేసుకునే అవకాశం ఉందన్నారు. చివరకు ఆధార్‌కార్డులు పోయినా యూఐడీ, ఈఐడీ ద్వారా ఈ-ఆధార్‌ను జనరేట్ చేసుకునే సౌలభ్యం ఉందన్నారు.
బోగస్ ఏరివేత
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం చేయడంతో బోగస్ లబ్ధిదారులకు అడ్డుకట్ట పడుతుందని ఎంవీఎస్ రాంరెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్ధలో రేషన్ కార్డులకు అధార్ లింక్ చేయడంతో 11.75 లక్షల కార్డులు, 74.91 లక్షల యూనిట్లు బోగస్‌గా గుర్తించి ఏరివేసినట్లు చెప్పారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో 3.7 లక్షల మంది బోగస్‌గా బయటపడ్డారని గుర్తు చేశారు.