‘ప్రైవేటు’లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్
► బకాయిలు చెల్లించనందుకే ఈ నిర్ణయం: ప్రైవేటు ఆస్పత్రుల సంఘం
► నిరసనకు మేం దూరం: సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు
సాక్షి, హైదరాబాద్: ఐదు నెలలుగా ప్రభుత్వం బకాయిలు చెల్లించనందుకు నిరసనగా గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినట్టు ‘తెలంగాణ ప్రైవేటు హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్’ ప్రకటించింది. విధిలేని పరిస్థితుల్లోనే తామీ నిర్ణయం తీసుకున్నామని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం ప్రతినిధులు వెల్లడించారు. బకాయిలు చెల్లించాల్సిందిగా ఎన్నోసార్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో పాటు, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓకు విన్నవించామని, అయినా వారి నుంచి స్పందన లేనందునే సేవలు నిలిపివేయాల్సి వచ్చిందని చెప్పారు.
‘తెలంగాణ వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ పరిధిలో 190 ఆస్పత్రులు ఉండగా, వీటిలో ప్రభుత్వ ఆస్పత్రులు 60. మిగిలిన 130 ఆస్పత్రులు కార్పొరేట్, ప్రెవేటు నర్సింగ్‌హోమ్‌లు. వీటిలో ఇప్పటి వరకు లక్షకు పైగా శస్త్రచికిత్సలు చేయగా, ఇందుకు సుమారు రూ.450 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. బకాయిలు రాకపోవడంతో నర్సింగ్‌హోమ్‌లు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి. సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నాం. విద్యుత్, నీరు తదితర బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది’ అని సంఘం అధ్యక్షుడు డాక్టర్ సురేశ్‌గౌడ్ చెప్పారు.
పెరిగిన ధరలు, పన్నులకు అనుగుణంగా ఆరోగ్యశ్రీ బిల్లులు పెంచాలని, ఇందుకోసం ఎంఓయూలో చేర్చిన నిబంధనలను కూడా సడలించాలని డిమాండ్ చేశారు. కార్పొరేటు ఆస్పత్రులు కూడా తమకు మద్దతు తెలుపుతున్నాయన్నారు. కాగా, ఈ నిరసనకు కార్పొరేట్ ఆస్పత్రులు దూరంగా ఉన్నాయి. తమ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగుతాయని ‘తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్’ చైర్మన్ డాక్టర్ భాస్కర్‌రావు తెలిపారు.
రోగుల ఆందోళన...
ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని వచ్చిన వారికి వైద్యం అందించడానికి కూడా సదరు ఆస్పత్రుల్లో నిరాకరిస్తున్నారు. సొమ్ము చెల్లిస్తేనే వైద్యం చేస్తామంటూ తేల్చి చెబుతున్నారు.