
నారా లోకేశ్ కారు డ్రైవర్ కు నోటీసులు
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ కారు డ్రైవర్ కొండల్ రెడ్డికి ఏసీబీ బుధవారం నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరుకావాలని 160 సీఆర్ పీసీ కింద నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఏసీబీ ఇప్పటికే పలువురిని ప్రశ్నించింది. ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ సింహ, సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి, ఆయన కుమారుడు కృష్ణ కీర్తన్, జిమ్మిబాబు, తదితరులను ఏసీబీ విచారించింది.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.ఐదు కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని, అడ్వాన్స్‌గా రూ. 50 లక్షలిస్తూ రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో రేవంత్‌తో పాటు తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు హ్యారీ సెబాస్టియన్, ఉదయ సింహ, మత్తయ్య (ప్రస్తుతం పరారీలో ఉన్నారు)లను నిందితులుగా పేర్కొంటూ ఏసీబీ చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి విదితమే.