
దేశమంతా బీజేపీ జెండా: వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారిదాకా, రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ దాకా బీజేపీ జెండా కనబడుతోందని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన మహాసమ్మేళన్‌లో ఆయన ప్రసంగించారు. దేశం మెచ్చిన, ప్రపంచం నచ్చిన ప్రధాని మోదీ నాయకత్వంలో అన్ని రంగాల్లో ముందుకుపోతున్నామని చెప్పారు. దేశంలో ఏ చిన్న సంఘటన జరిగినా దానికి కులం, మతం, ప్రాంతమంటూ విడదీసి రాజకీయ ప్రయోజనం పొందే కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. వేషం, భాష, ప్రాంతం, రాష్ట్రం ఏదైనా మనమంతా భారతీయులమేనని పేర్కొన్నారు.
ఐక్యంగా ఉంటూ ఇప్పటిదాకా జరిగిన లోపాలను సరిదిద్దుకోవాలన్నారు. గతంలో పతాక శీర్షికల్లో కనిపించే అవినీతి, కుంభకోణాల వంటివి మోదీ అధికారంలోకి వచ్చాక వెతికినా కనిపించడం లేదని చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల కోసం వివిధ పథకాలను కేంద్రం ప్రవేశపెడుతోందని తెలిపారు. ప్రపంచంలోనే ఏ పార్టీకి లేనంత కార్యకర్తల బలం బీజేపీకి ఉందన్నారు. కేంద్రం అమలుచేస్తున్న పథకాలు, అట్టడుగువర్గాలకు అందుతున్న ఫలాలను ఇంటింటికీ తలుపుతట్టి చెప్పాలని బీజేపీ కార్యకర్తలకు వెంకయ్యనాయుడు సూచించారు.