డ్రగ్స్ కేసు విచారణకు హాజరైన నటుడు సుబ్బరాజు
హైదరాబాద్: సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసు విచారణలో భాగంగా నటుడు సుబ్బరాజు శుక్రవారం ఉదయం సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. సిట్ అధికారులు సుబ్బరాజును విచారిస్తున్నారు. డ్రగ్ డీలర్, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కెల్విన్‌తో సంబంధాలపై నటుడిని శ్రీనివాస్ రావు బృందం ప్రశ్నించనుంది. 21న విచారణకు హాజరు కావాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సుబ్బరాజు ఇటీవలే నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. విచారణకు హాజరైన సుబ్బరాజును కెల్విన్‌తో ఆయనకు పరిచయాలు, చాటింగ్ విషయాలపైనే కీలకంగా ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇదివరకే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడులను సిట్ అధికారులు విచారించారు.
జూలై 19న పూరీ జగన్నాథ్‌ను విచారించిన సిట్ బృందం, జూలై 20న శ్యామ్ కే నాయుడును డ్రగ్స్ కేసులో విచారించారు. ఉస్మానియా వైద్యులు వచ్చి పూరీ జగన్నాథ్ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న విషయం తెలిసిందే. శ్యామ్ కే నాయుడు మాత్రం.. తనకు సిగరెట్ అలవాటు కూడా లేదని, డ్రగ్స్ తీసుకోవడం తెలియదని విచారణలో చెప్పినట్లు సమాచారం. తనకు పార్శిల్‌లో వచ్చినవన్ని డ్రగ్స్ అనుకుంటే దానికి తానేం చేయలేనని శ్యామ్ విచారణలో చెప్పారు.