
అభిమానులూ.. మొక్కలు నాటండి
హరితహారంలో పాల్గొన్న సినీ నటుల పిలుపు
- విజయానర్సరీ ఆవరణలో మొక్కలు నాటుతున్న చిరంజీవి
- జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మొక్కలు నాటుతున్న హీరో అల్లు అర్జున్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాలుపంచుకున్నారు. సోమవారం వేర్వేరుచోట్ల తారలు మొక్కలు నాటి సమాజంలో తమ వంతు బాధ్యతను గుర్తు చేశారు. మానవ మనుగడకు మొక్కలు ప్రాణాధారమని తెలుపుతూ తమ అభిమానులు సైతం మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నం. 10లోని ఎమ్మెల్యే, ఎంపీల కాలనీలో ఉన్న విజయా నర్సరీలో హీరో చిరంజీవి మొక్కలు నాటారు. బంజారాహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో ఆవరణలో హీరో నాగార్జున మొక్కలు నాటారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో హీరో అల్లు అర్జున్, తన మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, తండ్రి అల్లు అరవింద్, కుమారుడితో కలసి మొక్కలు నాటారు. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో సినీ నటి రెజీనా, హీరోలు శ్రీకాంత్, రాజ్‌తరుణ్, మా అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, తనికెళ్ల భరణి, శివాజీరాజా తదితరులు మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని విశేషంగా ప్రశంసించారు.
కేబీఆర్ పార్కులో మొక్కలు నాటుతున్న తనికెళ్ల భరణి, శివాజీరాజా, నటి రెజీనా, మేయర్ బొంతు రామ్మోహన్, రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, ఎన్.శంకర్, రాజ్‌తరుణ్ తదితరులు