దాడులతో దడ..!
డ్రైవింగ్ లెసైన్సులకు భలే గిరాకీ
ఆర్టీఏ కార్యాలయాల్లో పెరిగిన రద్దీ
పోలీసు,రవాణా తనిఖీలతోబారులు తీరుతున్న వాహనదారులు
20 శాతం పెరిగిన రద్దీ
సిటీబ్యూరో:డ్రైవింగ్ లెసైన్సుల కోసం ఆర్టీఏ కార్యాలయాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. గత రెండు రోజులుగా రవాణా, పోలీసు విభాగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న తనిఖీలతో లెసైన్సులు లేకుండా బండి నడుపుతున్న వాహనదారులు ఆర్టీఏ బాటపట్టారు. ఈ రెండు రోజుల్లో గ్రేటర్ పరిధిలో సాధారణ రోజుల్లో కంటే 20 శాతానికిపైగా లెర్నింగ్ లెసైన్సులు, డ్రైవింగ్ లెసైన్సులకు డిమాండ్ పెరిగి నట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ తెలిపారు.
360 లెర్నింగ్ లెసైన్స్ స్లాట్ లు అందుబాటులో ఉన్న ఖైరతాబాద్ కేంద్ర కార్యాలయంలో బుధవారం 288 మంది ఎల్‌ఎల్‌ఆర్‌లు తీసుకున్నారు. సాధారణ రోజుల్లో 150 నుంచి 200 వరకు మాత్రమే స్లాట్‌లు నమోదవుతాయి. అలాగే సాధారణ రోజుల్లో 100 నుంచి 150 వరకు డిమాండ్ ఉండే సికింద్రాబాద్ ఆర్టీఏలో 200మంది ఎల్‌ఎల్‌ఆర్‌లు తీసుకున్నారు. నాగోల్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లో పర్మినెంట్ డ్రైవింగ్ లెసైన్స్ పరీక్షల కోసం ఏకంగా 435 మంది హాజరయ్యారు. మరోవైపు నగర శివార్లలోని ఆర్టీఏ కార్యాలయాల్లోనూ డ్రైవింగ్ లెసైన్సుల కోసం వచ్చే వాహనదారుల రద్దీ కనిపించింది. లెర్నింగ్‌లెసైన్సులు, డ్రైవింగ్ లెసైన్సుల కోసం బుధవారం 991 మంది హాజరయ్యారు.
ఏజెంట్‌లను ఆశ్రయించవద్దు : జేటీసీ
నగరంలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో డిమాండ్‌కు అనుగుణంగా స్లాట్‌లు అందుబాటులో ఉన్నాయని, ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో స్లాట్ నమోదు చేసుకొని పరీక్షలకు హాజరు కావాలని జేటీసీ సూచించారు. ఈ సేవా కేంద్రాల్లోనూ స్లాట్ నమోదు చేసుకొనే సదుపాయం ఉందన్నారు. వినియోగదారులు బ్రోకర్లు, ఏజెంట్‌లను ఆశ్రయించకుండా నేరుగా ఆర్టీఏ అధికారులను సంప్రదించాలని కోరారు. రోడ్డు భద్రతా నిబంధనలు, ట్రాఫిక్స్ రూల్స్ పట్ల స్పష్టమైన అవగాహన కలిగిన వాహనదారులు లెర్నింగ్, డ్రైవింగ్ పరీక్ష ల్లోనూ ఉత్తీర్ణులవుతారని, ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు.
ఎల్‌ఎల్‌ఆర్ ఇలా పొందవచ్చు....
రవాణాశాఖ వెబ్‌సైట్‌లో మొదట స్లాట్ నమో దు చేసుకోవాలి. 24 గంటల్లో ఈ సేవ, నెట్‌బ్యాంకింగ్ ద్వారా నిర్ణీత రుసుం చెల్లించాలి.
నిర్ణీత తేదీ, సమయం ప్రకారం పుట్టిన తేదీ, ని వాస ధృవీకరణ పత్రాలతో ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాలి.
ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన 20 ప్రశ్న ల్లో 12 ప్రశ్నలకు 10 నిమిషాల్లో సరైన జవాబులు గుర్తిస్తే ఉత్తీర్ణులుగా పరిగణించి వెంటనే ఎల్‌ఎల్‌ఆర్ ఇస్తారు.
డ్రైవింగ్ లెసైన్స్ ఇలా...
ఎల్‌ఎల్‌ఆర్ (లెర్నింగ్) తీసుకున్న 30 రోజుల నుంచి 6 నెలల వరకు ఎప్పుడైనా డ్రైవింగ్ టెస్ట్ కు హాజరు కావచ్చు. ఇందుకోసం మరోసారి ఆన్‌లైన్‌లో స్లాట్ నమోదు చేసుకోవాలి. ఈసేవ, నెట్‌బ్యాంకింగ్ ద్వారా 24 గంటల్లో ఫీజు చెల్లించాలి.నిర్ణీత తేదీ, సమయం ప్రకారం అందుబాటులోని డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌కు పరీక్షకు వెళ్లి, అధికారుల పర్యవేక్షణలో వాహనాలు నడపాలి, నిబంధనలకు అనుగుణంగా నడిపిన వారిని ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. వారం రోజుల్లో డ్రైవింగ్ లెసైన్స్ స్పీడ్ పోస్టు ద్వారా ఇంటికి చేరుతుంది. లెర్నింగ్ పరీక్షల్లోనూ,. డ్రైవింగ్ పరీక్షల్లోనూ ఫెయిల్ అయిన వారు తిరిగి మరోసారి పరీక్షలకు హాజరు కావలసిందే.