
ఇంధన కల్తీ
విజయనగర్ కాలనీకి చెందిన సంతోష్, సలీమ్ అనే ఇద్దరు మిత్రులు రాత్రిపూట చంపాపేటలో ఒక వివాహానికి హాజరై తమ ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు.
=బంకుల్లో యథేచ్ఛగా సాగుతున్న వ్యవహారం
=పెట్రోల్‌లో నాఫ్తలిన్ కలుపుతున్న వైనం
=మీటర్ పంపింగ్‌లో చేతివాటం
=మోసపోతున్న వినియోగదారులు
=పట్టని అధికారులు
విజయనగర్ కాలనీకి చెందిన సంతోష్, సలీమ్ అనే ఇద్దరు మిత్రులు రాత్రిపూట చంపాపేటలో ఒక వివాహానికి హాజరై తమ ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. సంతోషనగర్ వద ్దబండిలో ఇంధనం ఆయిపోయింది. అక్కడే ఉన్న ఒక బంక్‌లో రెండు లీటర్ల పెట్రోల్ పోయించి బయలుదేరారు. అబిడ్స్‌కు చేరుకునేసరికి బండి మొరాయించింది. పెట్రోల్ ఉన్నా.. బండి స్టార్ట్ కాలేదు. దీంతో పెట్రోల్‌లో కల్తీ ఉందని భావించి మరో బండిపై బంక్‌కు చేరుకొని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మాటామాట పెరిగి ఘర్షణకు దారితీయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి సంఘటనలు గ్రేటర్ హైదరాబాద్‌లో సర్వసాధారణమే. అయినా.. చర్యలు మాత్రం కానరావు.
సాక్షి, సిటీబ్యూరో : రాష్ట్రం మొత్తం మీద పెట్రోల్ వినియోగంలో గ్రేటర్ హైదరాబాద్ వాటా సగానికి పైగా ఉంటుందని అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇంధన డిమాండ్‌ను సాకుగా తీసుకున్న పెట్రోల్‌బంకుల యాజమాన్యాలు యథేచ్ఛగా కల్తీకి తెరలేపి తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగిస్తున్నాయి. ఇంధనంలో కల్తీతోపాటు, మీటర్ పంపింగ్‌లో చేతివాటం వినియోగదారుడిని నిలువునా మోసానికి గురిచేస్తోంది. పెట్రోలులో డీజిల్, నాఫ్తలిన్.. డీజిల్‌లో కిరోసిన్ కలపడంతోపాటు ప్రతి లీటర్‌కు కనీసం 99 ఎం.ఎల్. తక్కువగా రావడం సర్వసాధారణమైంది. వినియోగదారులు అప్పుడప్పుడు కల్తీని గుర్తించి నిలదీస్తున్నా.. సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా.. ఫలితం లేకుండా పోతోంది. ముఖ్యంగా బంకులు పలుకుబడి గల యాజమాన్యాల నిర్వహణలో కొనసాగుతుండటంతో తనిఖీ చేసేందుకు అధికారులు సైతం ధైర్యం చేయని పరిస్థితి నెలకొంది.
కల్తీతో వాహనాలకు ముప్పు
కల్తీ పెట్రోల్ వినియోగంతో వాహనాలు చీటికి మాటికి మెకానిక్ షెడ్లకు పరుగులు తీస్తున్నాయి. పొగ అధికంగా వదలడం, స్టార్ట్ కాకపోవడం లాంటి సమస్యలు తప్పడం లేదు. ఫలితంగా ఇంజన్‌పై ప్రభావం పడుతోంది. వాహనంలోని బోరు పిస్టన్ పనికిరాకుండా పోయి త్వరగా మార్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. మరో వైపు నాలుగుచక్రాల వాహనాలకు మరింత ట్రబుల్స్ తప్పడం లేదు. మహానగరం పరిధిలో సుమారు 330కి పైగా పెట్రోల్, డీజిల్ బంక్‌లు ఉండగా.. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 40 లక్షల వరకు వివిధ రకాల వాహనాలున్నాయి. అందులో పెట్రోల్‌తో నడిచే వాహనాలు 29 లక్షలు, డీజిల్‌తో నడిచే వాహనాలు సుమారు 11 లక్షల వాహనాల వరకు ఉంటాయన్నది అంచనా. ప్రతిరోజు సగటున 30 లక్షల లీటర్ల పెట్రోల్, 33 లక్షల డీజిల్ వినియోగమవుతోంది.
సాంద్రత ఇలా..
కంపెనీ సరఫరా చేసే సమయంలోనే పెట్రోల్, డీజిల్ సాంద్రత ఎంత ఉండాలనే విషయాన్ని ద్రవీకరిస్తారు. వేసవిలో పెట్రోల్ డెన్సిటీ క్యూబిక్ సెంటీమీటర్‌కు సుమారు 830 నుంచి 835 ఉండాలి. ఇతర సీజన్లలో 820 నుంచి 825 వరకు ఉంటుంది. ఇలా పెట్రోల్‌లో డెన్సిటీ నిర్ధారించే హైడ్రోమీటర్లు, థర్మామీటర్‌తో కూడిన కిట్లను బంక్ యజమానులు అందుబాటులో ఉంచాలి. కానీ వాస్తవంగా పెట్రో, డీజిల్‌లో కల్తీ నిర్ధారించే హైడ్రోమీటర్, థర్మామీటర్, జార్లతో కూడిన కిట్లు మెజార్టీ బంకుల్లో కనిపించవు. వినియోగదారుల్లో ఎవరికైన అనుమానం వస్తే పరీక్షలు నిర్వహించి ఇంధన డెన్సిటీ చూపాలన్న నిబంధన వుంది. కానీ, ప్రశ్నించిన వారికి నిరాకరణ, చివాట్లు తప్పడం లేదు.
తనిఖీలేవీ?
గ్రేటర్ హైదరాబాద్‌లో యథేచ్చగా కల్తీ, మీటర్ పంపింగ్‌లో మోసం కొనసాగతున్నా.. సంబంధిత అధికారుల తనిఖీలు మాత్రం కనిపించవు. ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రం ఉన్నతాధికారుల అదేశాల మేరకు మొక్కుబడి తనిఖీలు, శాంపిల్స్ సేకరణ, నామమాత్రపు కేసులతో సరిపెట్టడం నిత్యకృత్యంగా మారింది. పెట్రోల్, డీజిల్ బంకుల్లో కల్తీ, తూకం మోసం అరికట్టేందుకు పౌరసరఫరాలు, కల్తీ నియంత్రణ, తూనికలు కొలతల శాఖల ఆధ్వర్యంలో పర్యవేక్షణ కొనసాగాలి. కల్తీపై ఎప్పటికప్పుడు శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌లో పరీక్షించాలి. అధికారుల వద్ద కూడా పరీక్షలు నిర్వహించేందుకు పరికరాలు అందుబాటులో ఉండాలి.
అవి అందుబాటులో ఉన్నా ఉపయోగించిన పాపాన పోవడం లేదు. పౌరసరఫరాల శాఖలో గత మూడేళ్లలో 10 కేసులకు మించి నమోదు కాలేదు. ల్యాబ్ పరీక్షల అనంతరం ఏ ఒక్కటి కూడా నిలబడలేదు. అదేవిధంగా తూనికలు కొలతల శాఖ కూడా 312 బంకులను తనిఖీ చేసి మీటర్ పంపింగ్‌లో హెచ్చుతగ్గులు ఉండటంతో కొన్నింటిలో కేసులు నమోదు చేసి జరిమానా విధించి చేతులు దులుపుకొంది. వాస్తవంగా జరిమానాతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయవచ్చు. మరోవైపు బంకుల్లోని మీటర్ పంపింగ్ యూనిట్లను తనిఖీ చేస్తూ సీల్ వేయాల్సి వున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి.
తేడాలుంటే కేసులు
పెట్రోలు, డీజిల్ మీటర్ పంపింగ్‌లో హెచ్చు తగ్గులుంటే కేసులు నమోదు చేస్తాం. బంకులను తనిఖీ చేసి అన్నింటినీ పరిశీలిస్తున్నాం. ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం.
- రామానందతీర్థ స్వామి, తూనికలు కొలతల శాఖ డిప్యూటీ కంట్రోలర్, హైదరాబాద్ రీజియన్