
కల్తీ కల్లుపై ‘ఆబ్కారీ’ కన్ను
గ్రేటర్ పరిధిలో కల్లు డిపోల్లో కల్తీ కల్లు సరఫరా కాకుండా గ్రేటర్ ఆబ్కారీ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది.
{yగ్స్ కంట్రోల్‌శాఖ
హెచ్చరికలతో అప్రమత్తం
‘గ్రేటర్’లోని అన్ని కల్లు దుకాణాలపై దాడులు
కల్లు శాంపిళ్లు సేకరించి ల్యాబ్‌కు తరలింపు
సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో కల్లు డిపోల్లో కల్తీ కల్లు సరఫరా కాకుండా గ్రేటర్ ఆబ్కారీ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. ఇందులో భాగంగా మహానగరం పరిధిలోని సుమారు 75 కల్లు కంపౌండ్‌లతో పాటు రంగారెడ్డి జిల్లా పరిధిలోని మరో 400 కల్లు దుకాణాల్లో విక్రయిస్తున్న కల్లు నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించాలని నిర్ణయించింది. ఈ విషయంలో డ్రగ్స్ కంట్రోల్ శాఖ సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. డైజోఫామ్, ఆల్ఫాజోమ్, క్లోరల్ హైడ్రేట్ వంటి మత్తు పదార్థాలతో పాటు కెటామిన్, ఎసిటిక్ ఎన్ హైడ్రేడ్‌వంటి డ్రగ్స్‌ను కల్లు దుకాణాలకు సరఫరా చేయనీకుండా డ్రగ్స్ మాఫియాను ఎక్కడికక్కడే కట్టడి చేయాలని నిర్ణయించింది. పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి ముఠాలను కట్టడి చేయని పక్షంలో మన రాష్ట్రంలోనూ మహారాష్ట్ర తరహాలో కల్తీ కల్లు కాటుకు నిరుపేదలు బలయ్యే దుస్థితి తలెత్తుతుందన్న ఆందోళనలతో ఆబ్కారీ శాఖ అప్రమత్తమైంది.
కల్తీకి తావులేకుండా..
మహానగరం పరిధిలోని ఒక్కో కల్లు డిపోలో నిత్యం సుమారు 300 నుంచి వెయ్యి లీటర్ల వరకు కల్లును విక్రయిస్తుంటారు. గ్రేటర్ నగరానికి వరంగల్, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల నుంచి రోజువారీగా కల్లు సరఫరా అవుతోంది. జిల్లాల నుంచి నగరానికి వచ్చే లోగా మార్గంమధ్యంలో ఎక్కడైనా క ల్తీకి పాల్పడుతున్నారా అన్న కోణంలోనూ ఆబ్కారీశాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. నగరంలో కల్లు డిపోల్లో విస్తృతంగా తనిఖీలు చేయాలని నిర్ణయించింది.
కల్లు డిపోలపైకర్ణాటక ముఠాల కన్ను..?
నగరంతో పాటు నగర శివార్లలోని కొన్ని కల్లు దుకాణాల్లో విక్రయించే కల్లును కల్తీ చేసేందుకు కర్ణాటకకు చెందిన మాఫియా ముఠాలు కన్నేశాయి. ఆయా కల్లుదుకాణాలకు కల్తీ కల్లు తయారీకి వినియోగించే డైజోఫామ్, ఆల్ఫాజోమ్, క్లోరల్ హైడ్రేట్ వంటి మత్తుపదార్థాలను పెద్ద ఎత్తున సరఫరా చేసేందుకు పథకం వేశాయి. ఈ మత్తు పదార్థాలను కిలో రూ.3 నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. నగరానికి నేరుగా వస్తే పట్టుబడతామన్న అనుమానంతో మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి, కొడంగల్ ప్రాంతాల వరకు వచ్చి. అక్కడ కొన్ని కల్లు దుకాణాలకు చెందిన వారికి కల్తీకి ఉపయోగించే మత్తు పదార్థాలను గుట్టుగా సరఫరా చే సేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ప్రత్యేక తనిఖీలు చేపడతాం..
డ్రగ్స్ కంట్రోల్ శాఖ హెచ్చరికలతో నగరంలోని అన్ని కల్లుదుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాం. కల్లు నమూనాలను సేకరించి ఎప్పటికప్పుడు పరీక్షలు జరిపిస్తాం. ఇప్పటి వరకు మాకు కల్తీకి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. నెలవారీగా ప్రతి కల్లు దుకాణంలో శాంపిళ్లు సేకరించి పరీక్షిస్తున్నాం. ఎక్సైజ్ విభాగం అధికారులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ విభాగాల ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం.
-ఫారూఖీ, గ్రేటర్ హైదరాబాద్ ఎక్సైజ్ విభాగం డిప్యూటీ కమిషనర్