దివాలా సొసైటీలకే ఇవ్వాలా..?
- వాటికి ఎరువులు, విత్తనాల పంపిణీ బాధ్యతపై విమర్శలు
- 906 సహకార సొసైటీలకుగాను 400 నష్టాల అంచుల్లోనే
- వ్యవసాయశాఖ నిర్ణయంతో రైతులకు తప్పని కష్టాలు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ప్రాథమిక సహకార సొసైటీ(ప్యాక్స్)ల ద్వారా విత్తనాలు, ఎరువులను రైతులకు సరఫరా చేయాలని రాష్ట్రవ్యవసాయ శాఖ నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనేక సహకార సొసైటీలు దివాలా అంచున ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం వల్ల రైతులకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 906 సొసైటీలుండగా వాటిల్లో 400 సొసైటీలు నష్టాల్లో ఉన్నాయని, సరైన నిర్వహణ లేక కొన్ని కునారిల్లుతున్నాయని, ఇలాంటి స్థితిలో వాటికి విత్తనాలు, ఎరువులను విక్రయించే బాధ్యత ఇస్తే సమస్యలు తప్పవంటున్నారు. గతంలో అనేక సొసైటీలు ఇలా మార్క్‌ఫెడ్ నుంచి ఎరువులు తీసుకొని డబ్బులు చెల్లించలేదని చెబుతున్నారు.
50 శాతం సబ్సిడీపై...: మండల కేంద్రాల నుంచి కాకుండా గ్రామాల్లో ఉండే సహకార సొసైటీల ద్వారానే విత్తనాలు, ఎరువులను సరఫరా చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. సహకార సొసైటీల ద్వారానైతే రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో చేరతాయనేది వ్యవసాయ, సహకార శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉద్దేశం. ఈ ఏడాది మొత్తం 7.5 లక్షల విత్తనాలను 50 శాతం సబ్సిడీపై అందజేయాలని సర్కారు నిర్ణయించింది. వాటి విలువ రూ.412 కోట్లు. రైతులకు సబ్సిడీ పోను సర్కారు స్వయం గా రూ. 206 కోట్లు భరించనుంది. 2.5 లక్షల క్వింటాళ్ల వరి, 3.75 లక్షల క్వింటాళ్ల సోయాబీన్, 77 వేల క్వింటాళ్ల వేరుశనగ, 70 వేల మొక్కజొన్న, 80 వేల క్వింటాళ్ల శనగ విత్తనాలను సరఫరా చేస్తాయి. అలాగే 17.47 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేంద్రం రాష్ట్రానికి కేటాయించింది.
బ్యాంకు గ్యారంటీ ఉన్నా...
సొసైటీలకు ప్రభుత్వం కేటాయించే విత్తనాలు, ఎరువుల విలువ మేరకు సహకార బ్యాంకులు ప్రభుత్వానికి గ్యారంటీ ఇస్తాయి. బ్యాంకు గ్యారంటీ ఉన్నా నష్టాల బాటలో ఉన్న 400 సొసైటీలు విత్తనాలు, ఎరువులు తీసుకొని ఏ మేరకు వెన క్కు తిరిగి చెల్లిస్తాయన్న ప్రశ్న అధికారుల ను వేధిస్తోంది. అవి చేతులెత్తేస్తే సహకార బ్యాంకులు కుప్పకూలిపోతాయంటున్నారు. గతేడాది మార్క్‌ఫెడ్‌కు కొన్ని సొసైటీలు రూ. 3 కోట్లు బకాయిలు చెల్లించకపోవడంతో న్యాయ పోరాటానికి దిగాల్సి వచ్చిందని ఒక అధికారి వ్యాఖ్యానించారు.