అమరావతి ఎస్టేట్స్..! | Amaravathi Estates | Sakshi
Sakshi News home page

అమరావతి ఎస్టేట్స్..!

Published Thu, Jun 16 2016 2:11 AM | Last Updated on Wed, May 29 2019 3:19 PM

అమరావతి ఎస్టేట్స్..! - Sakshi

అమరావతి ఎస్టేట్స్..!

 సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ వెంచర్.. ఇది ఒక శాంపిల్ ‘స్టార్టప్’ కథ
 సీడ్ కేపిటల్‌లో సింగపూర్ కంపెనీలకు 1,691 ఎకరాలు అప్పనంగా ధారాదత్తం
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నిర్మాణం పేరిట ప్రభుత్వ పెద్దలు ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీస్తున్నారు అనడానికి మరో గట్టి ఆధారం దొరికింది. రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి బలవంతంగా సేకరించిన భూములను తమకు నచ్చిన విదేశీ సంస్థలకు కట్టబెట్టి రూ.వేల కోట్లు దండుకోవడమే వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియంతో కలిసి రాజధానిలో భారీ దోపిడీకి రంగం సిద్ధం చేస్తున్నారు. సీడ్ కేపిటల్‌లో అత్యంత విలువైన 1,691 ఎకరాలను అప్పనంగా చేజిక్కించుకొని కాసుల పంట పండించుకునేందుకు పన్నాగాలు పన్నుతున్నారు.

సీడ్ కేపిటల్‌లో స్టార్టప్ ఏరియా పేరిట సాగిస్తున్న ఈ నయా దందాలో సింగపూర్ కంపెనీలకు స్వల్ప వ్యవధిలోనే రూ.15 వేల కోట్లకుపైగా లబ్ధి కలగనుంది. రూ.వందల కోట్లలో పెట్టుబడి పెట్టి రూ.వేల కోట్లు కొల్లగొట్టనున్నాయి. ఈ కంపెనీల వెనుక ఉన్న ముఖ్య నేత ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదు. సీడ్ కేపిటల్ ఏరియాలో 6.84 చదరపు కిలో మీటర్లు (1,691 ఎకరాలను) స్టార్టప్ ప్రాంతంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సింగపూర్ కంపెనీల కన్సార్టియం, ప్రభుత్వం మధ్య అవగాహన కుదిరింది. ఇక రాయితీ, అభివృద్ధి, వ్యాపార ప్రణాళిక ఒప్పందాలు చేసుకోవడమే తరువాయి. ఈ కుంభకోణం ఎలా సాగుతుందంటే...

► సింగపూర్ ప్రైవేట్ కంపెనీలైన అసెండాస్, సెమ్బ్‌కార్ప్, సెమ్‌బ్రిడ్జిలతో కూడిన కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కేపిటల్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (సీసీడీఎంసీఎల్) కలిసి ఉమ్మడిగా అమరావతి డెవలప్‌మెంట్ పార్ట్‌నర్(ఏడీపీ)ను ఏర్పాటు చేస్తాయి.
► సింగపూర్ కంపెనీల కన్సార్టియం రూపొందించిన రాయితీ, డెవలప్‌మెంట్ అగ్రిమెంట్, బిజినెస్ ప్రణాళిక ఉద్దేశాలకు లోబడి ఏడీపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రూపొందుతుంది.
► ఏడీపీలో సీసీడీఎంసీఎల్ పెట్టుబడి రూ.221.9 కోట్లు. సింగపూర్ కంపెనీల కన్సార్టియం పెట్టుబడి రూ.306.4 కోట్లు.
► ఏడీపీపై పూర్తిస్థాయి పెత్తనం సింగపూర్ కంపెనీలదే.
► ఏడీపీలో సింగపూర్ సంస్థల కన్సార్టియం వాటా 58 శాతం, సీసీడీఎంసీఎల్ వాటా 42 శాతం.
► ఏడీపీకి స్టార్టప్ ఏరియా(1,691 ఎకరాలు)ను కట్టబెడతారు. ఈ సంస్థ స్టార్టప్ ఏరియాలో ప్లాట్లు వేసి, వాటిని అభివృద్ధి చేయడానికి మూడో పార్టీకి విక్రయిస్తుంది.
► విజయవాడలోని బందరు రోడ్డులో గజం భూమి విలువ రూ.2 లక్షలకు పైగానే పలుకుతోంది. ఇక రాజధానిలో అత్యంత కీలకమైన సీడ్ కేపిటల్‌లో గజం విలువ హీనపక్షం రూ.లక్ష అనుకున్నా 1,691 ఎకరాల విలువ రూ.50 వేల కోట్లకు పైగానే ఉంటుంది.
► ఒప్పందం అమల్లోకి వచ్చిన ఐదేళ్ల తర్వాత సింగపూర్ కంపెనీల కన్సార్టియం కనీసం 26 శాతం వాటాను కలిగి ఉండాలి. మిగతా 32 శాతం విక్రయించుకోవచ్చు.
►1,691 ఎకరాల్లో 32 శాతం వాటాను సింగపూర్ కంపెనీలు అమ్ముకోవచ్చు. దీని విలువ రూ.15 వేల కోట్లకుపైగానే..

 20 ఏళ్లలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి
 మొత్తం భూముల విక్రయం, లీజుల లావాదేవీలతో వచ్చిన ఆదాయంలో ఏడీపీ వాటా పొందుతుంది. మొత్తం ప్లాట్లను తొలి దశలో నిర్ణయించిన కనీస రిజర్వ్ ధరలకు విక్రయిస్తారు. ప్రతీ దశకు రిజర్వ్ ధరలను సవరిస్తారు. సింగపూర్ కంపెనీలకు స్టార్టప్ ఏరియాలో 50 ఎకరాలను నామమాత్రపు ధరకు ఇవ్వాలి. ఈ భూమిని ఏడీపీకి బదిలీ చేయడంతో పాటు పూర్తి హక్కులు కల్పించాలి. ఈ భూమిలో 8 లక్షల చదరపు అడుగుల్లో ఏడీపీ ఉత్ప్రేరక (కేటలిటిక్) అభివృద్ధిని చేపడుతుంది. ఈ అభివృద్ధి పనులను ఏడీపీ నామినేషన్‌పై ఎవరికైనా అప్పగించవచ్చు. వసతుల కల్పనకు అయిన వ్యయంతోపాటు నిర్వహణ చార్జీలను వసూలు చేసేందుకు ఏడీపీకి హక్కు ఉంది. స్టార్టప్ ఏరియాలోనే మరో 200 ఎకరాలను సింగపూర్ కంపెనీల కన్సార్టియంకు రెండు దశల్లో ఫ్రీ హోల్డ్ విధానంలో ఇవ్వాలి. ఈ భూములను ఏడీపీ భవిష్యత్ అభివృద్ధికి వినియోగిస్తుంది. మొత్తం 1,691 ఎకరాల స్టార్టప్ ఏరియాను మూడు దశల్లో అంటే 20 సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తారు. ప్లాట్లు అమ్ముడు కాకుండా మిగిలిపోతే గడువును మరో ఐదేళ్లు పొడిగిస్తారు.
 
 చైర్మన్‌ను నియమించే అధికారం సింగపూర్ కంపెనీలదే..
 ఆరుగురు సభ్యులతో ఏడీపీ పాలక మండలిని ఏర్పాటు చేస్తారు. ఇందులో నలుగురు సభ్యులు సింగపూర్ కంపెనీల కన్సార్టియం నుంచే ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు సభ్యులే ఉంటారు. పాలక మండలి చైర్మన్‌ను నియమించే అధికారం సింగపూర్ కంపెనీల కన్సార్టియంకే ఉంటుంది. పాలక మండలిలో కొత్తగా ఎవరినైనా సభ్యుడిగా చేర్చుకోవాలంటే కనీసం 15 శాతం వాటా పెట్టుబడి పెట్టాలి.
 
 వివాదాలొస్తే లండన్ కోర్టుకు...
 స్టార్టప్ ఏరియాలో ప్లాట్లు కొనుగోలు చేసేవారు, ప్రాజెక్టులను అభివృద్ధి చేసే వారు ఏవైనా వివాదాలు తలెత్తితే లండన్ కోర్డును ఆశ్రయించాల్సిందే. ఏడీపీలో సింగపూర్ కంపెనీలు పెట్టిన పెట్టుబడికి రాష్ట్ర సర్కారు నేతృత్వంలోని సీసీడీఎంసీఎల్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. సింగపూర్ కంపెనీలకు ఏదైనా నష్టం వాటిల్లితే పరిహారం కోసం లండన్ కోర్టునే ఆశ్రయిస్తాయి.
 
 ఏడీపీకి సర్వాధికారాలు
 స్టార్టప్ ఏరియాలో అభివృద్ధి చేసిన భూములను లీజుకు ఇవ్వడం లేదా విక్రయించడం, తనఖా పెట్టడం, కొనుగోలుదారుల నుంచి తగిన ఆదాయం రాబట్టే అధికారాలను పూర్తిగా ఏడీపీకి ఇస్తారు. ఇందుకోసం ఏడీపీకి ఏపీ సీఆర్‌డీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) ఇస్తుంది. ఇందుకయ్యే వ్యయాన్ని సీఆర్‌డీఏ భరించాలి. స్టార్టప్ ప్రాంతంలో ఏడీపీకి మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత సీసీడీఎంసీఎల్‌దే. 6 నుంచి 12 నెలల్లోగా కల్పించకపోతే ఆ ప్రాజెక్టు జాప్యానికి సీసీఎండీసీఎల్‌దే బాధ్యత. ఒప్పందం మేరకు ఏడీపీకి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement