ఏం సభ్యత? ఏం సంస్కారం?
లోకేశ్ లేఖాయణంపై వైఎస్సార్సీపీ ఎద్దేవా
మీ అమెరికా ఫొటోలకు ఏం చెబుతారు?
సత్యం ‘చదివింపు’లతో మేం చదవలేదు..
నల్లధనంపై దేవినేని దిగజారుడు వ్యాఖ్యలు
లక్షన్నర కోట్ల నల్లధనం వెనకేసింది మీరు..
ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికింది మీరు..
ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొన్న రూ.600 కోట్లు ఎక్కడివి?
దమ్ముంటే నల్లధనంపై విచారణకు సిద్ధపడండి
సాక్షి, హైదరాబాద్: ‘విలువల వ్యవస్థ, మీ తల్లిదండ్రులు మీకు నేర్పిన గొప్ప లక్షణాల గురించి అనర్గళంగా లెక్చర్లు దంచటం ఆపండి! తమరి ప్రవర్తన తాలూకు మచ్చుకు కొన్ని ఫోటోలు విడుదల చేస్తున్నాం... వాటికి సమాధానం ఇవ్వండి’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. ‘మీరు వీటికి సమాధానమిస్తే మీ విలువలు, సంస్కారం, సంసృ్కతుల గురించి ప్రజలే అర్థం చేసుకుంటారు’ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు.
‘సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సాక్షి ఓ వార్త ప్రచురిస్తే దానికి మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డిని నిందిస్తూ, ఆయనకు సభ్యత, సంస్కారం లేవంటూ లేఖ రాస్తారా?’ అంటూ నారా లోకేశ్ తీరును అంబటి తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. ‘లక్షల కోట్ల నల్లధనాన్ని మీరు వెనకేసుకుని దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, ప్రజల దృష్టిని మళ్లించడం కోసం మాపై నిందలేస్తారా?’ అని మంత్రి దేవినేని తీరునూ అంబటి తిప్పి కొట్టారు. ‘కేంద్రంలో, రాష్ర్టంలో మీ ప్రభుత్వాలే ఉన్నాయి. వాటి కనుసన్నల్లో పనిచేసే విచారణా సంస్థలున్నాయి. దమ్ముంటే నల్లధనంపై విచారణ జరిపించి నిజానిజాలు బైటపెట్టండి’ అని అంబటి డిమాండ్ చేశారు... వివరాలివీ..
ఆ ‘నేర్పు’ మాకు లేదు...
‘‘సత్యం రామలింగరాజు మీకు స్టాన్ ఫర్డ్ సీటు కొని ఇచ్చారు. లేదంటే ఇంటర్ అత్తెసరు మార్కులతో గట్టెక్కిన మీకు ఆ యూనివర్సిటీలో సీటు వస్తుందా? ఆ మార్గంలో సీటు కొనుక్కునే ‘నేర్పు’ మాకెక్కడిది? అలాంటి ‘విలువలు’ మాకు నిజంగానే లేవు. పార్టీ పదవి అడ్డుపెట్టుకుని మంత్రులపై పెత్తనం చేసే ‘సంస్కారం’ గానీ, ఏ పదవీ లేకపోయినా ఏకంగా కేబినెట్ మీటింగులలో కూర్చోగలిగిన ‘సామర్థ్యం’ గానీ మాకు లేవు. మంత్రుల పేషీల్లో మీడియా లైజనింగ్ ఆఫీసర్లను నియమించి ప్రతిపనికి కమీషన్లు వసూలు చేసే ‘తెలివితేటలు’ మాకెక్కడివి? ఏమైనా మీ అంతటి గొప్ప ‘లక్షణాలు’ మా నాయకుడికి లేవని చెప్పడానికి చింతిస్తున్నాం.
నల్లధనం మీరు వెనకేసి మాపై ఆరోపణలా?
ఇక దేవినేని దిగజారుడు వ్యాఖ్యలు చూస్తే అసహ్యమేస్తుంది. అవినీతి - చంద్రబాబు కవలపిల్లలని ఎప్పుడో రుజువైంది. ఇసుక నుంచి ఇరిగేషన్ దాకా, బొగ్గు నుంచి సోలార్ టెండర్ల దాకా అన్ని వ్యవస్థలలోనూ అవినీతిని వ్యవస్థీకృతం చేసిన ఘనత మీది. రెండేళ్లలో రూ.1.5 లక్షల కోట్లు మింగిన ఘనులు మీరు. నల్లధనం మీరు వెనకేసి మాపై ఆరోపణల బురద వేయాలని చూస్తే జనం నమ్ముతారనుకుంటున్నారా దేవినేనీ? వెల్లడించిన నల్లధనం మీదేనన్న విషయం బైటపడుతుందన్న భయంతో మీ నాయకుడు నిన్న మీ అనుకూల మీడియాలో వేరేవాళ్లపై నెపం వేసే ప్రయత్నం చేయగా.. ఇవాళ మీరు ఆ నల్లధనం జగన్‌దేనని దిగజారుడు వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అసలు దోషులెవరో తెలుస్తూనే ఉంది.
మీరు భాగస్వామిగా ఉన్న కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోనే విచారణా సంస్థలు నడుస్తున్నాయి. ఆ నల్లడబ్బు ఫలానావారిదని బైటపెట్టే దమ్ము మీకు గానీ, మీ ముఖ్యమంత్రికిగానీ ఎందుకు లేకుండా పోయాయి? ఎందుకంటే అసలు దోషులు మీరే కనుక. విచారణల నుంచి పారిపోవడం, స్టే తెచ్చుకోవడం చంద్రబాబు ‘దైన్యం’. రాజకీయ కక్షసాధింపుతో కేసులు వేసినా, అన్యాయంగా జైలులో నిర్బంధించినా... విచారణకు నిలబడిన ‘ధైర్యం’ మా నాయకుడిది. మీలా కాళ్లు పట్టుకునే హీనమైన చరిత్ర మా నాయకుడికి లేదు. ఏ తప్పూ చేయలేదు కాబట్టే మీ ప్రభుత్వ కనుసన్నల్లో నడిచే సీబీఐ, ఈడీల విచారణను మా నాయకుడు నిర్భయంగా ఎదుర్కొంటున్నారు.
ఆ కోట్లన్నీ నల్లధనమేగా?
ప్రజాదరణ పాతాళానికి దిగజారడంతో అక్రమంగా సంపాదించిన అవినీతి డబ్బు వెచ్చించి ఒక్కొక్క ఎమ్మెల్యేకి రూ.30 కోట్లు చొప్పున వెదజల్లి, రకరకాల ప్రలోభాలకు గురిచేసి 20 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ఆ రూ.600 కోట్లు ఎక్కడివి? నల్లధనం కాదా? తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేకి డబ్బు ఇస్తూ ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా అడ్డంగా దొరికిపోయారు. ఆ డబ్బు ఎక్కడ దోపిడీ చేస్తే వచ్చింది? మీరు మేతలు కాదు, నేతలు అని అనుకుంటే రాజధాని భూములు, స్విస్ ఛాలెంజ్ విధానం, పట్టిసీమ ఇలా ఏ విషయాన్ని తీసుకున్నా కోర్టుల్లో నానా హడావుడి ఎందుకు పడుతున్నారు? అసలు విచారణ అన్న పదం వింటేనే ఎందుకు వణికిపోతున్నారు? మీకు ధైర్యం ఉంటే మీ అవినీతి మీద విచారణకు సిద్ధమని ప్రకటించండి. అది వదిలేసి చానెళ్ల ముందు, విలేకరుల సమావేశాల్లో అడ్డదిడ్డంగా నోరు పారేసుకున్నంత మాత్రాన ప్రజల కళ్లు కప్పలేరు.’’ అని అంబటి పేర్కొన్నారు.