
అన్ని కోట్లు ఖర్చు... ఏం ఉపయోగం?
► గోదావరి పుష్కరాల్లో రూ.2వేల కోట్లు వ్యయం చేస్తే ఏమీ కన్పించలేదు
► కృష్ణా పుష్కరాలకు ఇష్టానుసారం ప్రతిపాదించొద్దు: సీఎస్ టక్కర్
హైదరాబాద్: ‘గతేడాది గోదావరి పుష్కరాల సందర్భంగా ఏకంగా రూ.2వేల కోట్లు వ్యయం చేశారు. తీరా అక్కడ చూస్తే ఏమీ కనిపించలేదు. ఇప్పుడు కృష్ణా పుష్కరాల పేరుతో ఇష్టానుసారం పనులను ప్రతిపాదించవద్దు. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్పీ టక్కర్ అధికారులను హెచ్చరించారు.
సోమవారం సచివాలయంలో అన్ని శాఖల ఉన్నతాధి కారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. గతేడాది గోదావరి పుష్కరాల మాదిరి ఈసారి జరగకూడదని చెప్పారు. ఇప్పటికే కృష్ణా పుష్కరాల పేరుతో రూ.1000 కోట్లకు ప్రతిపాదనలు వచ్చినట్లు తెలిసిందన్నారు. అన్ని పనులకు అనుమతులు ఇవ్వరాదని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. అసెంబ్లీ, శాసన మండలిలో సభ్యులడిగిన ప్రశ్నలకు వందల సంఖ్యలో సమాధానాలు పెండింగ్‌లో ఉన్నాయని, జీరో అవర్‌లో లేవనెత్తిన అంశాలకు జవాబులు పెండింగ్‌లో ఉన్నాయని సీఎస్ పేర్కొన్నారు. అన్ని శాఖలూ వెంటనే సమాధానాలను పంపించాలన్నారు.