అపార్టుమెంట్ల సొసైటీలకు సహకార రిజిస్ట్రేషన్
- తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం.. త్వరలో మార్గదర్శకాలు
- పర్యవేక్షణ, నిర్వహణ బాధ్యత తీసుకోనున్న సహకార శాఖ
- ఏడాదికోసారి ఆడిటింగ్.. వివాదాలు వస్తే పరిష్కారం
- దాదాపు రూ. 15 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం
సాక్షి, హైదరాబాద్: అపార్టుమెంట్ల సొసైటీలు ఇక నుంచి సహకార శాఖలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి. ఆయా సొసైటీల పర్యవేక్షణ, ఏడాదికోసారి ఆడిటింగ్ బాధ్యతను సహకార శాఖ తీసుకోనుంది. దాంతోపాటు వివాదాలు వస్తే పరిష్కారం చూపనుంది. ఈ మేరకు అపార్ట్‌మెంట్ల సొసైటీలు సహకారశాఖలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తద్వారా సుమారు రూ. 15 కోట్ల ఆదాయాన్ని పొందనుంది. ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించే పనిలో సహకార శాఖ ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. ఆ మార్గదర్శకాలకు సర్కారు ఆమోదం తీసుకొని.. అన్ని అపార్టుమెంట్లకు సర్క్యులర్ జారీ చేస్తారు. పాత అపార్టుమెంట్లతోపాటు కొత్తగా నిర్మించబోయే వాటి సొసైటీలు కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే నేరంగా పరిగణిస్తారు.
పర్యవేక్షణ, నిర్వహణే ప్రధాన ఉద్దేశం
రాష్ట్రంలో దాదాపు 30 వేలకు పైగా అపార్టుమెంట్లు ఉంటాయని... అందులో 20 వేల వరకు హైదరాబాద్‌లో ఉంటాయని సహకార శాఖ అంచనా వేస్తోంది. ఈ సంఖ్యపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే అపార్టుమెంట్లలో ఏర్పాటు చేసుకునే సొసైటీలపై ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో... వాటి నిర్వహణ దారుణంగా ఉంటోందన్న ఆరోపణలున్నాయి. వాటిలో నివసించేవారు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. నెలకోసారి నిర్వహణ రుసుము వసూలు చేస్తున్నా... నిర్వహణ లోపం, నీటి వసతి లేకపోవడం, లిఫ్టు వంటివి చెడిపోయినా మరమ్మతులు చేయించకపోవడం వంటివి జరుగుతున్నాయి. పలుచోట్ల వాచ్‌మన్ లేకపోవడమూ ఉంటోంది. సీసీ కెమెరాలు లేకపోవడంతో కొన్నిచోట్ల నేరాలు జరుగుతున్నాయి. సొసైటీలు సరిగా పనిచేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని.. నిర్వహణ రుసుము వసూలు చేస్తూ కూడా సరిగా ఖర్చు పెట్టే పరిస్థితి లేకుండా పోయిందని విమర్శలు వస్తున్నాయి.
కొందరు బిల్డర్లు అపార్టుమెంట్లు నిర్మించాక.. కొన్ని ఫ్లాట్లు ఖాళీగా ఉన్నా, వాటి నిర్వహణ రుసుమును కూడా మిగతావారి నుంచి వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు నెక్లెస్‌రోడ్డుకు సమీపంలో ఒక ప్రజాప్రతినిధికి చెందిన అపార్టుమెంటులో దాదాపు 20 వరకు ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. కానీ వాటి నిర్వహణ రుసుమును కూడా అందులో నివసించే మిగతా వారి నుంచి వసూలు చేస్తున్నారని తెలిసింది. దీంతో ఒక్కో ఫ్లాటులో నివసించే వారు రూ. 7 వేల వరకు కట్టాల్సి వస్తోందని సహకార శాఖ అధికారుల దృష్టికి వచ్చింది. వాస్తవానికి కొనుగోలు కాకుండా ఖాళీగా ఉన్న ఫ్లాట్ల నిర్వహణ రుసుమును బిల్డరే చెల్లించాలన్న నిబంధన ఉంది.
కొన్ని అపార్టుమెంట్ల సొసైటీలు ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. అదే సహకారశాఖ పరిధిలోకి వస్తే ప్రతీ ఏడాది తప్పనిసరిగా ఆడిటింగ్ చేస్తారు. నిర్వహణ లోపాలు తలెత్తినా, వివాదాలు వచ్చినా సహకార శాఖే పరిష్కరిస్తుంది. పెద్ద అపార్టుమెంట్లయితే అవసరాన్ని బట్టి ఎన్నికలూ నిర్వహించే అవకాశాలు లేకపోలేదని సహకార అధికారి ఒకరు చెప్పారు. మొత్తంగా త్వరలోనే అపార్టుమెంట్ల నిర్వహణ, రిజిస్ట్రేషన్లపై మార్గదర్శకాలు ఖరారు చేస్తామని ఆయన పేర్కొన్నారు.