‘ నీలిరంగు పులుముకున్న సముద్రం మధ్య నుంచి పడమర వైపు 14 నాట్స్ వేగంతో నౌకాయానం.. సినిమాల్లో తప్ప చూడని నౌకలో సుమారు 900 కిలోమీటర్ల దూర ప్రయాణం.. ప్రపంచపటంలో చుక్కల్లా కనిపించే ద్వీపాల్లో విహారం..
సముద్రజలాల్లో స్నోర్కలింగ్, కాయాకింగ్, స్కూబా డైవింగ్.. సాగర లోతుల్లో
వెలుగులు వెదజల్లే కోరల్ ప్లాంట్స్, రంగురంగుల చేపలు, ఇతర జీవరాశుల సమీప వీక్షణం.. రాత్రి వేళ నడిసంద్రంలోని నౌకలోనే నిద్ర... ఊహిస్తేనే విహరించాలని మనసు ఉరకలేస్తుంది కదూ... అదే వెళ్లొస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి..!
గత నెల 27న కేరళ రాజధాని కొచ్చి నుంచి అరేబియా సముద్రంలోని కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌కు 50 మంది నగర వాసులు వెళ్లి... ఉరకలెత్తించిన ఉత్సాహంతో తిరిగొచ్చారు. వారితో పాటే ‘సాక్షి’ కూడా సాగరయానం చేసి... లక్షద్వీప్‌లోని రెండు ద్వీపాల్లోని అందాలు నగర వాసులను ఎంతగా అబ్బురపరిచాయో పరిశీలించింది. నాలుగు రాత్రులు... ఐదు రోజుల పాటు సాగిన ఈ పర్యటనపై ప్రత్యేక కథనం...
టూర్ ప్రత్యేకత ఏమిటంటే..
కేంద్ర ప్రభుత్వ పాలన(యూటీ)లో ఉన్న లక్షద్వీప్ గురించి తెలియని వారుండరు. అరేబియా సముద్రంలో దేశ సరిహద్దు లోపల ఇప్పటి వరకు గుర్తించిన 36 ద్వీపాలు కలిపి లక్షద్వీప్(1973కు ముందు పేరు లక్కదివ్వాస్) జిల్లా. అయితే ఇందులో కేవలం పది ద్వీపాల్లోనే జన జీవనం. ఈ ద్వీపాల్లోని రెండో అతిపెద్ద ద్వీపం ‘మినీకాయ్’(మొదటిది అంద్రోథ్).
మినీకాయ్ ద్వీపంలోని జనాభా 12 వేల లోపే. లక్షద్వీప్ పర్యాటక శాఖ ఈ ద్వీపంలో ‘2వ మినీకాయ్ ఫెస్ట్- 2013’ పేరుతో డిసెంబర్ 28,29 తేదీల్లో ఉత్సవాలను నిర్వహించింది. ప్రత్యేక ఆఫర్ల ద్వారా దేశ వ్యాప్తంగా పర్యాటకులను ఆహ్వానించింది. ఈ మేరకు వివిధ రాష్ట్రాల్లోని టూర్ ఆపరేటర్ల ద్వారా 250 మంది పర్యాటకులతో ఈ యాత్ర మొదలైంది.
నగరం నుంచి తొలిసారి ఓ ప్రయివేట్ ట్రావెల్స్ సంస్థ ద్వారా అత్యధికంగా 50 మంది నగరవాసులు తరలివెళ్లారు. నౌకలోని మిగతా యాత్రికుల్లో 50 శాతం కేరళవాసులే. హైదరాబాద్ నుంచి డిసెంబర్ 27 ఉదయానికి కొచ్చి చేరిన తరువాత అక్కడి నుంచి టూర్ మొదలైంది.
సముద్రయానం సాగిందిలా..
ఉదయం 11 గంటల నుంచి కొచ్చిలోని విల్లింగ్టన్ ఐలాండ్‌లో ఉన్న లక్షద్వీప్ రిపోర్టింగ్ సెంటర్‌కు ప్రయాణికులంతా చేరుకున్నారు. బోర్డింగ్ పాస్‌లు తీసుకొని సెక్యూరిటీ చెక్ తర్వాత సమీపంలోని కొచ్చి డాక్‌యార్డ్‌కు వెళ్లారు. అక్కడ సిద్ధంగా ఉన్న నాలుగంతస్తుల ‘లక్షద్వీప్ సీ’ నౌక ద్వారా మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రయాణం మొదలైంది.
250 మంది కెపాసిటీ గల ఈ నౌక 14 నాట్స్ వేగంతో 215 నాటికల్ మైళ్లు(398 కి.మీ) ప్రయాణించి మరుసటి రోజు (28న) ఉదయం 9 గంటలకు మినీకాయ్ ద్వీపం సమీపానికి చేరుకుంది. అక్కడ్నుంచి మోటార్ బోట్ల ద్వారా మరో 5 కిలోమీటర్లు సముద్రంలోనే ప్రయాణించి మినీకాయ్ చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సాగరతీరంలో ఉత్సవాలు మొదలయ్యాయి.
స్థానికులు పాల్గొన్న బోట్ రేసింగ్, స్విమ్మింగ్ క్రీడలు పర్యాటకుల్ని ఆకర్షించాయి. సాయంత్రం స్థానిక స్టేడియంలో ఎగ్జిబిషన్‌తో పాటు 6 ద్వీపాలకు చెందిన జట్లతో టగ్ ఆఫ్ వార్ పోటీలు, స్థానిక కళాకారుల ప్రదర్శనలు ఔరా అనిపించాయి.
అరేబియా సముద్రం.. అద్భుత ద్వీపం
Published Sun, Jan 19 2014 6:19 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM
Advertisement
Advertisement