రైతు సర్వే 83 శాతం పూర్తి
- 46.17 లక్షల మంది రైతుల వివరాల సేకరణ
- సర్వే పూర్తి కాకపోవడంపై సీఎం అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా నిర్వహించిన రైతు సమగ్ర సర్వేలో 46.17 లక్షల మంది సమాచారాన్ని సేకరించారు. మొత్తం 55.63 లక్షల మంది రైతులుండగా, సర్వే ముగిసిన ఈ నెల 15 నాటికి 83శాతం మంది నుంచి వివ రాలు సేకరించినట్లు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో పేర్కొంది. ఇంకా 9.45 లక్షల మంది(17 శాతం) రైతుల వివరాలను సేక రించలేకపోయామంది. గడువు ఐదు రోజులు పెం చినా సర్వే పూర్తి కాకపోవడంపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై శుక్ర వారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ రైతు సమాచారాన్ని సేకరించాలని కోరారు. అయితే ప్రతీ రైతు వివరాలు నమోదు చేసే వరకు కొనసాగించాలని ఆదేశించినట్లు తెలిసింది.
నిర్మల్‌లో 100 శాతం...
వచ్చే ఏడాది వానాకాలం, యాసంగి ల్లో రైతులకు ఎకరాకు రూ.8 వేల చొప్పున ప్రోత్సాహకం ఇచ్చేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. అందు కోసం రైతుల సమగ్ర వివరాలు సేక రించాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. గత నెల 17న ప్రారంభమైన సర్వేను జూన్ 10 నాటికి పూర్తిచేయాలని సూచించారు. అప్పటికీ పూర్తికాక పోవడంతో ఈ నెల 15 వరకు గడువు పెంచారు. మొత్తం30 జిల్లాల్లోని 558 మండలాలు, వాటిల్లోని 10,576 రెవెన్యూ గ్రామాల్లో సర్వే నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో నూటికి నూరు శాతం సర్వే జరిగింది. అతి తక్కువగా వికారాబాద్ జిల్లాలో 64.4శాతమే జరిగింది. కాగా, రైతుల సమాచారం సేకరించి, దాన్ని ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసేందుకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని సీఎం సూచించారు. కానీ ల్యాప్‌టాప్‌ల బదులు 1,780 ట్యాబ్‌లు ఇవ్వాలని నిర్ణయించిన వ్యవసాయ శాఖ.. కేవలం 1,100 మందికి మాత్రమే వాటిని అందించింది. అందరికీ ట్యాబ్‌లు ఇవ్వకపోవడంవల్లే సర్వే ఆలస్యం జరిగిందన్న విమర్శలున్నాయి.