
అశోక్ లేలాండ్ పెట్టుబడులు
► రూ. 500 కోట్లతో బాడీ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటుకు సిద్ధం
► వెయ్యి మందికిపైగా ఉపాధి
► సీఎం సమక్షంలో కుదిరిన ఎంవోయూ
► ఉత్పాదక రంగానికి ప్రభుత్వ సంపూర్ణ సహకారం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: భారీ వాహనాల ఉత్పత్తిలో ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్న అశోక్ లేలాండ్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. రూ. 500 కోట్ల పెట్టుబడితో బాడీ బిల్డింగ్ యూనిట్ నెలకొల్పేలా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ యూనిట్‌తో వెయ్యి మందికి ప్రత్యక్షంగా, వందలాది మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు, పరిశ్రమల మంత్రి కె.తారక రామారావు, విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఎంవోయూపై సంతకాలు జరిగాయి. సీఎంవో అదనపు ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, అశోక్ లేలాండ్ ఎండీ వినోద్ కె దాసరి అవగాహనా ఒప్పందాలను మార్చుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉత్పాదక రంగాలకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. పరిశ్రమలకు భూమి, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించడంతోపాటు అన్ని రకాల అనుమతులను 15 రోజుల్లో మంజూరు చేసేందుకే టీఎస్ ఐపాస్ విధానాన్ని తీసుకొచ్చినట్లు వివరించారు. తెలంగాణ ఆర్టీసీకి, ఇతర ప్రభుత్వరంగ సంస్థలకు అవసరమైన వాహనాలను ఇక్కడ నెలకొల్పిన పరిశ్రమల నుంచే కొనుగోలు చేయడానికి ప్రాధాన్యమిస్తున్నట్లు సీఎం తెలిపారు. జీహెచ్‌ఎంసీకి అవసరమైన వాహనాలను తెలంగాణలో నెలకొల్పిన పరిశ్రమల నుంచే కొనుగోలు చేస్తామన్నారు. తెలంగాణలో మాస్ ట్రాన్స్ పోర్ట్ సిస్టంను మెరుగుపరచడానికి అశోక్ లేలాండ్ సలహాలు తీసుకోవాలని రవాణా, ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పట్టణ జనాభా 45 శాతం ఉందని...వారికి సౌకర్యంగా ఉండేలా రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి తాము కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని సీఎం వివరించారు. తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు లక్షల్లో ఉన్నారని, భవిష్యత్తులో రవాణా వ్యవస్థ ఇంకా మెరుగుపడే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల కమిషనర్ మాణిక్ రాజ్, ఆర్థికశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, టీఎస్‌ఐఐసీ ఎండీ ఇ.వి. నర్సింహారెడ్డి, అశోక్ లేలాండ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్ పి. వెంకట్రామన్, ఇ. హరిహర్, హిందూజా ఫౌండేషన్ సీఈవో డి.ఎం. రెడ్డి, ఇ.డి. రాజీవ్ సింఘ్వీ తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక సహకారానికి ముందుకొచ్చిన ఇండియన్ బ్యాంక్
దేశ విదేశాల పెట్టుబడిదారులను రాష్ట్రం ఆకర్షిస్తున్న నేపథ్యంలో బ్యాంకింగ్ రంగంలో దిగ్గజమైన ఇండియన్ బ్యాంక్ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు రుణాలిచ్చేందుకు ముందుకొచ్చింది. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఎం.కె.జైన్ తన బృందంతో కలసి సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిశారు. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు రుణం అందజేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్‌తోపాటు వివిధ పట్టణాల్లో పెట్టుబడులకు సంసిద్ధతను వ్యక్తపరిచారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు ఇండియన్ బ్యాంక్ ముందుకు రావడం శుభ పరిణామమని, వారిని ఆహ్వానిస్తున్నాని సీఎం తెలిపారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు ఇతర అభివృద్ధి, సేవా రంగంలో వ్యవస్థల బలోపేతానికి బ్యాంక్ అందించే ఆర్థిక సహకారం దోహదపడుతుందని సీఎం ఆకాంక్షించారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, అదనపు ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, టీఎస్ ఐపాస్ ఎండీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.