=హైదరాబాద్ జిల్లాలో చట్టం అమలు అంతంతే..
=సాకులు చెబుతూ తప్పించుకుంటున్న అధికారులు
=వందలాది దరఖాస్తులు పెండింగ్‌లోనే..
సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వ వ్యవస్థలో అవినీతిని రూపుమాపేందుకు..ప్రజలు అడిగిన సమాచారాన్ని సమగ్రంగా ఇచ్చేందుకు కేంద్రం తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టానికి అధికారులు తూట్లు పొడుస్తున్నారు. వీరి నిర్లక్ష్యం వల్ల ఎంతో శక్తివంతమైన చట్టం ఆయా ప్రభుత్వ కార్యాలయాల గోడలకు అలంకారప్రాయంగా మారింది. పేరుకు చట్టం చేసినా నానాసాకులు చెబుతూ సమాచారం ఇచ్చేందుకు వెనుకాడుతున్నారు.
దీంతో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకునేందుకు హైదరాబాద్ జిల్లాలో ముందుకు రావడం లేదు. ఒకప్పుడు పార్లమెంట్, శాసనసభసభ్యులకు మాత్రమే ఉండే సమాచారం కోరే హక్కును, ప్రజలందరికి కల్పిస్తూ భారత ప్రభుత్వం 2005 అక్టోబరు నుంచి ఆర్టీఐ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని భారత పౌరులెవరైనా కేవలం వినతిపత్రం ద్వారా పొందవచ్చు.
అడగకున్నా అందుబాట్లో..: ప్రజలెవరూ సమాచారం అడగకపోయినప్పటికీ ఉన్నతాధికారులు తమ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, శాఖకు సంబంధించిన విధివిధానాలు, ఉద్యోగుల, అధికారుల బాధ్యతలు..తదితర 16 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని (నోటీసుబోర్డులో గానీ, అధికారిక వెబ్‌సైట్లోగానీ)అందుబాట్లో ఉంచాలి. అయితే...చట్టం అమల్లోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఉద్యోగుల సమాచారాన్ని ఇచ్చే నాథుడే లేడు. ఇంకొం దరు అధికారులైతే అర్థం లేని సాకులు చూపుతూ సమాచారం ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని పలువురు దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. ఎలాగంటే ఆయా సంస్థల్లో వందల కొద్దీ ఆర్టీఐ దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడమే ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
ఇలా సాకులు చెబుతున్నారు..
దరఖాస్తు రుసుం నగదురూపంలో చెల్లించేందుకు చట్టం అవకాశం కల్పిస్తున్నా..డీడీలు, పోస్టల్ ఆర్డర్లు జత చేయాలంటూ దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు.
తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు తాము ఇవ్వదలచుకున్న సమాచారాన్ని మాత్రమే ఇస్తున్నారేగానీ, దరఖాస్తుదారుడు స్పష్టంగా అడిగినా..అతను కోరిన సమాచారాన్ని ఇవ్వడంలేదు.
అడిగిన సమాచారంతోపాటు ఆ సమాచారం సకాలంలో పొందే హక్కు చట్టం కల్పిస్తున్నా..దరఖాస్తు చేయడంలో లోపాలున్నాయంటూ నెలల తరబడి సమాచారం ఇవ్వకుండా తిప్పుకుటున్నారు.
సుపరిపాలన కేంద్రం సహకారంతో చేసే ప్రయత్నాలు వెబ్‌సైట్‌కే పరిమితమయ్యాయి. పూర్తిస్థాయిలో దరఖాస్తు నింపలేదని, కోరిన సమాచారం స్పష్టంగా లేదని 65శాతం దరఖాస్తులను తిరిస్కరిస్తున్నారు.
సమాచారమివ్వడం ఇష్టం లేని అధికారులు కమిషన్ ముందు డొంక తిరుగుడు సమాధానాలతో దరఖాస్తుదారుల సహనానికి పరీక్ష పెడుతున్నారు.
అప్పీలు చేస్తే షోకాజ్ నోటీసులిచ్చి రెండోమారు దరఖాస్తు చేసుకోవాలని చేతులు దులుపుకుంటున్నారు.
సమాచార కమిషన్ విశ్రాంత అధికారులకు, రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రాలుగా మారాయన్న ఆరోపణలు లేకపోలేదు.
అగ్ర స్థానమే ఇస్తున్నాం..
హైదరాబాద్ రెవెన్యూ విభాగంలో సమాచార హక్కు చట్టం అమలుకు అగ్ర ప్రాధాన్యం ఇస్తున్నాం. కలెక్టరేట్‌తోపాటు జిల్లావ్యాప్తంగా ఉన్న రెవెన్యూ కార్యాలయాల్లో కూడా దరఖాస్తుల పెండింగ్‌పై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. తహశీల్దారు కార్యాలయాలు, ఆర్డీవో ఆఫీసుల నుంచి సమాచారం రాగానే వీటిని కూడా క్లియర్ చేస్తాం.
- అశోక్‌కుమార్, హైదరాబాద్ డీఆర్వో