అకౌంట్‌లో డబ్బులు ఎన్నున్నాయో తెలుసుకోవాలని వెళ్లిన వ్యక్తిని బ్యాంకు అధీకృత సర్వీస్ సెంటర్ నిర్వాహకుడు బోల్తా కొట్టించి డబ్బులు కాజేశాడు.
సంతోష్‌నగర్(హైదరాబాద్): అకౌంట్‌లో డబ్బులు ఎన్నున్నాయో తెలుసుకోవాలని వెళ్లిన వ్యక్తిని బ్యాంకు అధీకృత సర్వీస్ సెంటర్ నిర్వాహకుడు బోల్తా కొట్టించి డబ్బులు కాజేశాడు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. ఈదిబజార్ కుమ్మర్‌వాడి ప్రాంతానికి చెందిన గులాం మహ్మద్ అఖిల్ (31) సంతోష్‌నగర్‌లో బ్యాంకు అధీకృత కస్టమర్ సర్వీసు సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. కాగా, మలక్‌పేట్ ప్రాంతానికి చెందిన మహ్మద్ మజ్హారుద్దీన్ ఈ నెల 5వ తేదీన గ్యాస్ సబ్సిడీ డబ్బులు తన అకౌంట్‌లో పడ్డాయో, లేదో తెలుసుకునేందుకు గులాం మహ్మద్ అఖిల్ సెంటర్‌కు వెళ్లాడు. కాగా గులాం మహ్మద్ అకౌంట్ వివరాలు తెలుసుకుని, గుట్టు చప్పుడు కాకుండా అందులోని రూ.33వేలను తన అకౌంట్‌లోకి మార్చుకున్నాడు.
ఆ అకౌంట్‌లో కేవలం రూ.1200 ఉన్నాయని మజ్హారుద్దీన్‌కు నమ్మ బలికాడు. దీంతో అనుమానం వచ్చిన మజ్హారుద్దీన్ సంతోష్‌నగర్‌లోని ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్ వి.వి. రమణమూర్తి వద్దకు వెళ్లి తన అకౌంట్‌లో నిల్వ చూడమని కోరాడు. ఆ అకౌంట్‌లోని 33 వేలను గులాం మహ్మద్ అఖిల్ తన అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న విషయాన్ని మజ్హారుద్దీన్‌కి మేనేజర్ తెలిపారు. అనంతరం జరిగిన సంఘటనపై బ్యాంక్ మేనేజర్ వి.వి. రమణమూర్తి సంతోష్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కస్టమర్ సర్వీసు సెంటర్ నిర్వాహకుడు గులాం మహ్మద్‌ను అరెస్ట్ చేసి, శనివారం రిమాండ్‌కు తరలించారు.