కేంద్రానికీ బాబు టోకరా | Babu cheating also to the central government | Sakshi
Sakshi News home page

కేంద్రానికీ బాబు టోకరా

Published Sun, Jul 17 2016 1:37 AM | Last Updated on Wed, May 29 2019 3:19 PM

కేంద్రానికీ బాబు టోకరా - Sakshi

కేంద్రానికీ బాబు టోకరా

రాజధాని స్కామ్‌లో లెక్కలేనన్ని మోసాలు
- సింగపూర్‌తో జీటూజీకి మాత్రమే కేంద్రం అనుమతి
- కానీ ప్రయివేటు కంపెనీలతో బాబు ఒప్పందాలు
- స్విస్‌ఛాలెంజ్‌లో పారదర్శకత లేదన్న సుప్రీం తీర్పు
- అయినా పట్టించుకోని చంద్రబాబు
- స్విస్‌ఛాలెంజ్ నిబంధనలకు కూడా తూట్లు..
- నేరుగా సింగపూర్ కంపెనీలతో మంతనాలు
- విస్తుపోతున్న అధికారవర్గాలు..
 
 సాక్షి, హైదరాబాద్:  ఆయన ఏ నిబంధననైనా ఉల్లంఘించగలరు.. ఆయన ఏ నియమాన్నైనా తప్పగలరు..ఆయన ఏ పద్ధతినైనా మీరగలరు... ఆయన ఎవరిరైనా మోసగించగలరు...
 ‘అధికారిక రహస్యాల ప్రమాణా’న్ని తుంగలో తొక్కి అమరావతి ప్రకటనకు ముందే బినామీలతో కలసి కోట్లు కొట్టేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం పేరుతో ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్నే మోసగించిన విషయం బైటపడింది. అమరావతిని అభివృద్ధి చేసేందుకు గాను సింగపూర్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య (జీటుజీ.. గవర్నమెంట్ టు గవర్నమెంట్) ఒప్పందాలకే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉంది. చంద్రబాబు నాయుడు కూడా అటు కేంద్రప్రభుత్వానికి ఇటు ప్రజలకు అదే చెబుతూ వచ్చారు. కానీ అకస్మాత్తుగా సింగపూర్‌కు చెందిన ప్రైవేటు కంపెనీలను ముందుకు తెచ్చారు. రైతులిచ్చిన భూములతో రియల్‌ఎస్టేట్ ‘జాయింట్‌వెంచర్’ వ్యాపారానికి తెరలేపారు.

సింగపూర్ ప్రయివేట్ కంపెనీలకు లాభసాటి వ్యాపారం చేసిపెట్టి తద్వారా లబ్ధిపొందడం కోసం ఆయన అటు కేంద్రప్రభుత్వాన్ని, ఇటు రాష్ర్టప్రజలను.. ముఖ్యంగా భూములిచ్చిన రైతులను నిట్టనిలువునా మోసం చేశారు. ఆయన మోసాలు ఇక్కడితో ఆగలేదు. అత్యున్నత న్యాయస్ధానమైన సుప్రీంకోర్టు తీర్పునకు, మార్గదర్శకాలకు విరుద్ధంగా ‘స్విస్‌ఛాలెంజ్’ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. కనీసం అక్కడితోనైనా ఆగారా అంటే అదీ లేదు... అక్రమ విధానమైన స్విస్‌ఛాలెంజ్‌కి మంత్రిమండలి ఆమోదముద్ర వేయించిన చంద్రబాబు ఇపుడు ఆ విధానాన్ని కూడా ఇష్టమొచ్చినరీతిలో అతిక్రమిస్తున్నారు. ప్రాజెక్టులను నోటిఫై చేయకుండా, ఆంధ్రప్రదేశ్ మౌలికసదుపాయాల కార్పొరేషన్‌కు ఎలాంటి ప్రమేయమూ లేకుండా సింగపూర్ కంపెనీలతో తానే నేరుగా ఫోన్‌లో మాట్లాడుతున్నారు. సింగపూర్ ప్రయివేట్ కంపెనీలతో ఒక రాష్ర్ట ముఖ్యమంత్రి ఇలా నేరుగా మాట్లాడాల్సిన అవసరమేమిటి? ఇందులో ఏదో గూడుపుఠాణీ ఉందనడానికి ఇవన్నీ నిదర్శనాలుగా కనిపించడం లేదూ...

 కేంద్రాన్ని ఎలా మోసం చేశారంటే....
 ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతి అభివృద్ధికి గాను సింగపూర్ ప్రభుత్వం - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య (జీటూజీ)  2014 నవంబర్ 12-14 తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్‌పర్యటన సందర్భంగా ఓ అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈ అవగాహన ఒప్పందానికి కేంద్రప్రభుత్వం 2014 డిసెంబర్ 5న ఆమోదం తెలిపింది. దీని ప్రకారం రాజధాని అభివృద్ధిలో సింగపూర్ ప్రభుత్వరంగ సంస్థ ‘ఇంటర్‌నేషనల్ ఎంటర్‌ప్రైజ్ సింగపూర్’ (ఐఈ సింగపూర్) భాగస్వామ్యానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆ మేరకు డిసెంబర్ 8న ఐఈ సింగపూర్ - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మౌలిక సదుపాయాల కార్పొరేషన్ (ఇన్‌కాప్) మధ్య ఒప్పందంపై హైదరాబాద్‌లో సంతకాలు జరిగాయి. అయితే ఆ తర్వాత అసలు నాటకం ప్రారంభమైంది. నిదానంగా ఈ ఒప్పందాలన్నీ వెనక్కుపోయాయి.

సింగపూర్ ప్రయివేటు కంపెనీలు తెరపైకి వచ్చాయి. స్విస్ ఛాలెంజ్ విధానమూ ప్రాణంపోసుకుంది. దానికి మంత్రిమండలి చేత చంద్రబాబు ఆమోద ముద్ర వేయించారు. కేంద్రం అనుమతించిందేమిటి ? చంద్రబాబు చేస్తున్నదేమిటి? సింగపూర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య మాత్రమే ఒప్పందం.. కానీ ప్రయివేటు కంపెనీలు వచ్చి చేరిపోయాయి. దీనికి అసలు కేంద్రం అనుమతి లేదు. అసలు స్విస్ ఛాలెంజ్ విధానంలో కూడా ప్రయివేట్ సంస్థలతో ఒప్పందం విరుద్ధం. కానీ చంద్రబాబు అవేవీ పట్టించుకునే స్థితిలో లేరు. ఇటు కేంద్రప్రభుత్వం అనుమతి లేకుండానే ప్రయివేట్ సంస్థలతో ముందుకు వెళ్తున్న చంద్రబాబు అవి పెట్టే షరతులకు మాత్రం జీ హుజూర్ అంటూ తలూపుతున్నారు. తమ మధ్య తలెత్తే ఎలాంటి న్యాయ వివాదాలనైనా లండన్ న్యాయస్థానాల్లో మాత్రమే పరిష్కరించుకోవాలని సింగపూర్ ప్రైవేట్ సంస్థలు షరతు విధించాయి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

 సుప్రీం తీర్పునూ పట్టించుకోలేదు..
 స్విస్ చాలెంజ్ విధానంలో పారదర్శకత లేదని, అవినీతి అక్రమాలకు, పక్షపాతానికి ఆస్కారం ఉందని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టమైన తీర్పు ఇచ్చింది. కేల్కర్ కమిటీ సైతం స్విస్ చాలెంజ్ విధానంలో పారదర్శకత లేదని, అవినీతికి ఆస్కారముందని స్పష్టం చేసింది. ఈ విధానంలో ఏమైనా ప్రాజెక్టులు చేపట్టాలనుకుంటే ముందుగానే వాటిని బహిరంగంగా నోటిఫై చేయడంతోపాటు విస్తృత ప్రచారం కల్పించాలని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఇందుకు నిబంధనలు రూపొందించి, వాటిప్రకారమే ముందుకు సాగాలని ఆదేశించింది. ప్రాజెక్టుల్ని ముందుగానే నోటిఫై చేస్తే దేశ, విదేశాల్లోని అందరికీ తెలుస్తుందని, అప్పుడు స్విస్ చాలెంజ్ విధానంలో తమంతట తాముగా ఎవరైనా ప్రతిపాదనలు సమర్పించవచ్చునని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ ప్రతిపాదనలపై సంబంధిత శాఖ అధ్యయనం తరువాతనే ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల అభివృద్ధి అథారిటీ ముందుకు రావాలి. అథారిటీ మాత్రమే ఆ ప్రతిపాదనలు ప్రభుత్వ ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా? పరిశీలించి ఆమోదించాల్సి ఉంది.

 స్విస్‌ఛాలెంజ్‌నూ అతిక్రమిస్తున్న బాబు...
 ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల అథారిటీ ప్రమేయమేమీ లేకుండానే స్వయంగా సీఎం చంద్రబాబునాయుడే సింగపూర్ ప్రయివేట్ సంస్థల ప్రతినిధులతో మంతనాలు జరపడం.. వారి ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం జరిగిపోయాయి. అనంతరం అథారిటీ ముందుకు ప్రతిపాదనలు వచ్చాయి. రాజధానిలో ఈ ప్రాజెక్టులను స్విస్ చాలెంజ్ విధానంలో చేపడతామని చంద్రబాబు సర్కారు ఇప్పటివరకు నోటిఫై చేయలేదు. సింగపూర్ సంస్థలతో నేరుగా చంద్రబాబే మంతనాలు జరిపారు. ఆ సంస్థల ప్రతిపాదనలకు అవసరమైన సమాచారాన్ని కూడా సీఆర్‌డీఏ ఇచ్చింది. ఇది స్విస్ చాలెంజ్ విధానానికి పూర్తి విరుద్ధమని, ఇక్కడే పక్షపాతం, అవినీతి అక్రమాలకు బీజం పడిందని ఉన్నతాధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ముందుగానే ప్రాజెక్టులను నోటిఫై చేయాల్సివుంటే.. బాబు సర్కారు మాత్రం సింగపూర్ ప్రైవేట్ కంపెనీల్ని ఒరిజినల్ ప్రాజెక్టు ప్రొపెనెంట్‌గా ఎంపిక చేసేసి, ఇప్పుడు నోటిఫై చేసి కౌంటర్ ప్రతిపాదనలు ఆహ్వానిస్తోందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

 ఇప్పుడు ఎక్కడా స్విస్ చాలెంజ్ లేదు...
 ఆర్థికంగా వెనుకబడిన దేశాలు పెట్టుబడులకోసం 1999-2000లో స్విస్ చాలెంజ్ విధానాన్ని అనుసరించాలనుకున్నాయని, అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఏ దేశంగానీ, మన దేశంలో ఏ రాష్ట్రంగానీ స్విస్ చాలెంజ్ విధానాన్ని అనుసరించట్లేదని మరో ఉన్నతాధికారి పేర్కొన్నారు. చైనాలో ప్రస్తుతం జీ టు జీలో స్విస్ చాలెంజ్ ఉంది తప్ప ప్రైవేట్ కంపెనీలతో స్విస్ చాలెంజ్ లేదని ఆ అధికారి తెలిపారు. దేశ, విదేశాల్లో ఎవ్వరి దగ్గరా లేని టెక్నాలజీ ఒకే సంస్థ దగ్గర ఉంటేనే స్విస్ చాలెంజ్ విధానాన్ని అనుసరించాలి తప్ప.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఆ విధానాన్ని అనుసరించకూడదని మరో అధికారి అన్నారు. ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం స్విస్ చాలెంజ్ విధానానికి ఎంచుకున్న ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల అభివృద్ధి చట్టానికి సంబంధించి అసలు రూల్సే లేవని, ఇప్పటివరకు ప్రభుత్వం రూల్స్‌ను రూపొందించలేదని సంబంధిత ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం గమనార్హం.
 
 ఇది అతిపెద్ద కుంభకోణం

► జీటూజీ ఒప్పందాన్ని తుంగలో తొక్కి... స్విస్ ఛాలెంజ్ తెరపైకి తెచ్చి.. ప్రయివేటు కంపెనీలకు భాగస్వామ్యం కల్పించడం ఎందుకు? ఎందుకంటే ఇదో భారీ కుంభకోణం. దాని వెనక బడా ‘బాబు’లున్నారు. ఈ కుంభకోణం స్వరూపం ఇదీ...
► సింగపూర్ ప్రైవేట్ కంపెనీలైన అసెండాస్, సెమ్బ్‌కార్ప్, సెమ్‌బ్రిడ్జిలతో కూడిన కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కేపిటల్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (సీసీడీఎంసీఎల్) కలిసి ఉమ్మడిగా అమరావతి డెవలప్‌మెంట్ పార్ట్‌నర్(ఏడీపీ)ని ఏర్పాటు చేస్తాయి.
► ఏడీపీలో సీసీడీఎంసీఎల్ పెట్టుబడి రూ.221.9 కోట్లు. సింగపూర్ కంపెనీల కన్సార్టియం పెట్టుబడి రూ.306.4 కోట్లు.
► ఇది గాక మౌలిక సదుపాయాల కోసం రాష్ర్టప్రభుత్వం చేయాల్సిన ఖర్చు రూ. 5,500 కోట్లు.
► ఏడీపీలో సింగపూర్ సంస్థల కన్సార్టియం వాటా 58 శాతం, సీసీడీఎంసీఎల్ వాటా 42 శాతం.
► అంటే 306.4 కోట్లు ఖర్చు చేసే సింగపూర్ కంపెనీలకు 58శాతం వాటా, 5,721.9 కోట్లు ఖర్చు చేసే రాష్ర్టప్రభుత్వానికి కేవలం 42శాతం వాటా అన్నమాట.
► సింగపూర్ కంపెనీలకు రైతుల నుంచి సేకరించి ఇస్తున్న భూమి 1691 ఎకరాలు.
► ఈ 1,691 ఎకరాలను అభివృద్ధి చేసిన తర్వాత అక్కడ గజం రూ. లక్ష  పలుకుతుందని స్వయంగా ముఖ్యమంత్రే చెబుతున్నారు.
► ఎకరా స్థలంలో రహదారులు, పార్కులకు కొంత పోయినా మిగిలే 2,800 గజాల స్థలం రూ. 28 కోట్లు పలుకుతుంది. అంటే 1,691 ఎకరాల విలువ రూ. 47,348 కోట్లు అన్నమాట.
► అందులో సింగపూర్ కంపెనీలకు 58శాతం వాటా ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకున్నారు కాబట్టి వాటికి దక్కేది రూ. 27,461.84 కోట్లు. రాష్ర్టప్రభుత్వానికి  42శాతం వాటా కాబట్టి దక్కేది రూ. 19,886.16కోట్లు.
► అంతేకాదు ఈ భూమిని పాతికేళ్లలో ఎప్పుడైనా అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. అంటే పదేళ్ల తర్వాత గజం నాలుగు లక్షలుంటే సింగపూర్ కంపెనీలకు వచ్చే లాభం లక్ష కోట్లను దాటిపోతుంది.
 ఇదంతా చూస్తుంటే ఏం అర్ధమౌతుంది? మన భూమి ఇచ్చి మనం ఎక్కువ ఖర్చు పెట్టి సింగపూర్ కంపెనీలకు లాభాలిస్తున్నామన్నమాట. ఆ కంపెనీల కోసం మన ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారన్నమాట. అందుకే వాటి వెనక సాక్షాత్తూ ప్రభుత్వ ప్రముఖుడే ఉన్నారని లోకం కోడైకూస్తోంది.
 
 సింగపూర్ కంపెనీలతో బాబు ఎప్పుడు ఏం మాట్లాడారంటే...
► 12-11-2014న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సింగపూర్ పర్యటనలో మంతనాలు
► 08-12-2014న రాష్ట్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం
► 22-04-2015న కేబినెట్‌లో మాస్టర్ డెవలపర్ ఎంపిక విధానానికి ఆమోదం
► 22-04-2015న మాస్టర్ డెవలపర్‌ను నామినేట్ చేయాలని సింగపూర్ సర్కారుకు రాష్ట్ర సర్కారు లేఖ
► 30-04-2015 ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్ మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్ ప్రభుత్వం రాష్ట్రానికి లేఖ
► 07-05-2015న అసెండాస్, సెమ్బ్‌కార్ప్, సెమ్‌బ్రిడ్జి మాస్టర్ డెవలపర్‌గా నామినేటైనట్లు సింగపూర్ లేఖ
► 26-05-2015న ఒరిజినల్ ప్రాజెక్టు ప్రొపెనెంట్ ప్రతిపాదనలు పంపాలని వాటికి రాష్ట్ర సర్కారు లేఖ
►30-10-2015న సింగపూర్ సంస్థలు స్విస్ చాలెంజ్‌లో ప్రతిపాదనలను రాష్ట్రప్రభుత్వానికి సమర్పణ
► 24-01-2016న ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటనకు వెళ్లి ఆ సంస్థలతో మంతనాలు
► 21-03-2016న సీఎం సూచనల మేరకు సింగపూర్ సంస్థలు సవరించిన ప్రతిపాదనలను రాష్ట్ర సర్కారుకు సమర్పణ
►17-05-2016న మంత్రి యనమల నేతృత్వంలోని మంత్రులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ స్విస్ చాలెంజ్ ప్రతిపాదనలపై సింగపూర్ ప్రభుత్వంతో చర్చలు.
► 21-05-2016న, అలాగే 24-05-2016న, 25-05-2016న ఉన్నతస్థాయి కమిటీ సింగపూర్ ప్రభుత్వంతోపాటు సింగపూర్ ప్రైవేట్ కంపెనీలతో చర్చలు
► 07-06-2016న ముఖ్యమంత్రి, సింగపూర్ మంత్రి ఈశ్వరన్, సింగపూర్ కంపెనీల మధ్య ఫోన్‌లో చర్చలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement