
బాబుగారి ‘అదనపు’ దుబారా 133 కోట్లు
♦ సీఎం జిల్లాల పర్యటనలు, ప్రచారార్భాటాలకు చేసిన వ్యయమిది
♦ 2015-16కు అదనపు నిధులకోసం అనుబంధ పద్దును అసెంబ్లీకి సమర్పించిన ఆర్థికమంత్రి యనమల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.. డబ్బులు లేవు. అందువల్ల దుబారా వ్యయం చేయరాదు.. ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయరాదు.. అందరూ పొదుపు చేయాలి.. ఈ సుభాషితాలన్నీ సీఎం చంద్రబాబు నోటినుంచి పలు సందర్భాల్లో వెలువడినవే.. అయితే ఇతరులకే ఈ మాటలు వర్తిస్తాయి తప్ప బాబుకు కాదని స్వయానా ఆర్థికశాఖ వెలువరించిన లెక్కలే సూచిస్తున్నాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో సీఎం దుబారా, ప్రచార ఆర్భాటాలకు, స్వదేశీ, విదేశీ పర్యటనలకు అయిన అదనపు వ్యయం ఏకంగా రూ. 133.05 కోట్లుగా ఆర్థికశాఖ లెక్కలు తేల్చింది.
ఈ మొత్తం కేవలం సీఎం జిల్లాల పర్యటనకు, పుష్కరాల్లో ప్రచారానికి, రాష్ట్ర ఉత్సవాల కోసం చేసింది.. ఇవిగాక సీఎంగారి ప్రత్యేక విమానాలు, కార్యాలయాల సోకులు అదనం. 2015-16 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులకన్నా అదనంగా ఏకంగా రూ.21,016.20 కోట్లను వ్యయం చేశామని, ఈ అదనపు వ్యయానికి ఆమోదం తెలపాలంటూ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం అసెంబ్లీలో అనుబంధ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో సీఎం జిల్లా పర్యటనలు, పుష్కరాల్లో ప్రచారం, స్వదేశీ, విదేశీ పర్యటనలకు అయిన అదనపు వ్యయమే రూ.133.05 కోట్లుగా తేలడం గమనార్హం.
నిర్వహంచని ఉత్సవాలకూ అదనపు వ్యయం
స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్‌డే, రాష్ట్ర అవతరణ దినోత్సవాల నిర్వహణకు ఏకంగా రూ.19.33 కోట్లను అదనంగా వ్యయం చేసినట్లు సప్లిమెంటరీ బడ్జెట్‌లో పేర్కొన్నారు. అయితే రాష్ట్ర అవతరణ ఉత్సవాలను రాష్ట్రప్రభుత్వం అసలు నిర్వహించనే లేదన్న అంశం గమనించాల్సిన విషయం.