
బాబు తక్షణమే రాజీనామా చేయాలి
పీఏసీ చైర్మన్ బుగ్గన డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ‘స్విస్ చాలెంజ్’ విధానంపై హైకోర్టులో ఎదురుదెబ్బ తిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఏపీ అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇంకా పదవిలో కొనసాగడం అనైతికమన్నారు. బుగ్గన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అమరావతిలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ కంపెనీలకు అప్పగించేందుకు ప్రయత్నించడాన్ని హైకోర్టు న్యాయమూర్తి తీవ్రంగా తప్పుపట్టారని గుర్తుచేశారు.
కోర్టు తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించి, ఆ తరువాత పిటిషన్‌ను ఉపసంహరించుకుని, చట్టానికి సవరణలు చేసిందన్నారు. తాజా నోటిఫికేషన్ జారీ చేస్తామని మున్సిపల్ మం త్రి పి.నారాయణ చెప్పడం దారుణమన్నారు. ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పులు వెలువడినపుడు వారు తమ పదవులకు రాజీనామా చేసిన సత్సాంప్రదాయం మన రాష్ట్రంలో ఉందన్నారు. గతంలో ప్రైవేట్ బస్సు రూట్ల జాతీయీకరణను హైకోర్టు తప్పుపడితే అప్పటి సీఎం నీలం సంజీవరెడ్డి రాజీనామా చేశారని చెప్పారు. అలాగే 9 మెడికల్ కళాశాలలకు అనుమతి ఇచ్చినప్పుడు హైకోర్టు తప్పుపడితే నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి పదవి నుంచి వైదొలిగారని గుర్తుచేశారు. స్విస్ చాలెంజ్‌పై ఎదురుదెబ్బ తిన్న బాబు కూడా ఇదే సంప్రదాయం పాటించి గద్దె దిగాలని రాజేంద్రనాథ్‌రెడ్డి హితవు చెప్పారు.
డబ్బులివ్వడం తప్పు కాదట!
ఓటుకు కోట్లు కేసులో ఓటును డబ్బు పెట్టి కొనుగోలు చేయడం తప్పు కాదని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదించడం విడ్డూరంగా ఉందన్నారు. మరి, ఈ నేరాన్ని ఏ చట్టం కింద నమోదు చేయవచ్చో ఆ న్యాయవాదే సెలవిస్తే బాగుంటుందని బుగ్గన అన్నారు.