
స్విస్ చాలెంజ్ కాదు.. మ్యాచ్ ఫిక్సింగ్
పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజం
సాక్షి,హైదరాబాద్: రాజధాని నిర్మాణంలో స్విస్ చాలెంజ్ విధానం వెనుక పెద్ద మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. స్విస్ చాలెంజ్ విధానంలో పారదర్శకత లేదని, అందుకే కోర్టు కూడా దీన్ని వ్యతిరేకించిందని చెప్పారు. సీఆర్‌డీఏ, మున్సిపల్ అభివృద్ధి శాఖ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని కోర్టు అక్షింతలు వేసిందన్నారు. అర్హత నిబంధనలు సరిగ్గా లేవని కోర్టు చెప్పిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి సింగపూర్ వాళ్లే ముందుకొచ్చి అన్నీ ఉచితంగా చేశారని ప్రచారం చేశారన్నారు. నిజం చెప్పాలంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనందు వల్లే ఇక్కడకు వస్తున్నారని వివరించారు.
రాజధాని విషయంలో తరతరాలు నష్టపోయేలా చంద్రబాబు చేస్తున్నారని బుగ్గన ధ్వజమెత్తారు. సింగపూర్ తరఫున తొలుత సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ సంస్థ వచ్చిందని, వారు అమరావతి రాజధాని ప్రణాళిక రూపొందించమని టెమాసిక్ హోల్డింగ్స్‌కు సబ్బిడరీ కంపెనీ అయిన సుర్బానా అండ్ జురాంగ్‌కు అప్పగించారని చెప్పారు. సుర్బానా జురాంగ్ ప్లాన్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం పథకం ప్రకారం కథ నడిపించిందన్నారు. స్విస్ చాలెంజ్ విధానంలో రాజధాని ఏర్పాటుపై ఏప్రిల్ 22న ప్రకటన వచ్చిందన్నారు.
రాజధాని నిర్మిస్తామని ఏప్రిల్ 30న సింగపూర్ ఎంటర్‌ప్రైజెస్‌కు అసెండాస్ సెమ్‌బ్రిడ్జ్ కంపెనీలు లేఖ రాశాయన్నారు.పేరెంట్‌కంపెనీ టెమాసిక్ హోల్డింగ్స్ ప్రతిపాదనలు పంపకుండా వేరొకరు ఎలా రంగప్రవేశం చేస్తారని ప్రశ్నించారు. స్విస్ చాలెంజ్ ప్రతిపాదనల్ని ఎక్కడ పాటించారో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. 2014 డిసెంబర్ నుంచి 2015 ఏప్రిల్ వరకు టెమాసిక్ హోల్డింగ్స్ చెందిన సుర్బానా జురాంగ్ ప్లాన్స్ ఇచ్చాయని, ఏప్రిల్ 30 నుంచి అసెండాస్ సెమ్‌బ్రిడ్జ్ కూడా అదే కంపెనీకి సబ్బిడరీ అని తెలిపారు. రాష్ట్రం బాగుకోరే ప్రతి ఒక్కరూ స్విస్ చాలెంజ్ విధానాన్ని వ్యతిరేకించాలన్నారు. ప్రత్యేక హోదా గల రాష్ట్రాలు ఉండవని అబద్ధాలు చెప్పడం దారుణమన్నారు.