
ఆ కుటుంబాన్ని విధి వెంటాడింది..!
హైదరాబాద్: బంజారాహిల్స్‌లో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. అన్యోన్యంగా ఉండే ముగ్గురన్నదమ్ముల్లో ఒకరు మృతి చెందగా ఇంకొకరి వెన్నెముక విరిగింది. మరొకరి భార్యకు కాలు విరిగి చికిత్సపొందుతున్నారు. ఒకరి కూతురు మృత్యువుతో పోరాడుతోంది. ఇంటి పెద్ద దిక్కు తండ్రి వెన్నుపూస విరగడంతో కోలుకోవడం కష్టంగా మారింది. ఇలా ఆ కుటుంబంలోని వారందరికీ ఒక్కో విషాదాన్ని మిగిల్చింది. బంధుమిత్రులను దిగ్భ్రాంతికి గురి చేయగా స్వగ్రామం శోకసంద్రంలో మునిగింది. శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్ రోడ్ నంబర్-3లోని పంజగుట్ట హిందూశ్మశాన వాటికముందు కారు నడుపుకుంటూ వస్తున్న పమ్మి రాజేష్(34) అవతలి వైపు నుంచి పీకలదాకా మద్యం సేవించి అదుపు తప్పిన వేగంతో వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొని రాజేష్ కారుపై పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.
పక్కనే కూర్చున్న తండ్రి మధుసూదనాచారి(65) వెన్నుపూస విరగడంతో ఆయనను యశోద ఆస్పత్రిలో చేర్చారు. కారులో ఉన్న చిన్నారి రమ్య(8)కి తీవ్ర గాయాలు కావడంతో కేర్ ఆస్పత్రిలో చేర్చగా బ్రెయిన్ డెడ్ అయింది. ఆమె ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోంది. పాప పక్కనే కూర్చొని మొదటి రోజు స్కూల్ కబుర్లు వింటున్న తల్లి రాధిక(32) ఈ ప్రమాదంలో కుడి కాలు విరిగి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. డ్రైవర్ సీటు పక్కన కూర్చున్న మరో సోదరుడు రమేష్(40) ఈ ప్రమాదంలో వెన్నెముక విరిగి యశోదలో చికిత్స పొందుతున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోరకమైన బాధతో క్షోభను అనుభవిస్తున్నారు.
మధుసూదనాచారికి ముగ్గురు కొడుకులు కాగా పెద్ద కొడుకు వెంకటరమణ కూతురు రమ్య సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్ స్కూల్‌లో సీటు రావడంతో శుక్రవారం మొదటి రోజు హాజరైంది. ఉదయం స్కూల్‌లో కూతురిని దించి అక్కడే ఒక ఇల్లు చూసి వచ్చిన తండ్రి వెంకటరమణ పాపను తీసుకొని వచ్చే క్రమంలో ఆ ఇల్లును చూసిరావాలంటూ తమ్ముడు రాజేష్, భార్య రాధిక, తండ్రి మధుసూదనాచారికి చెప్పారు. మారేడ్‌పల్లిలో ఇల్లు చూసి దారిలో రమ్యను ఎక్కించుకొని వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కుటుంబంలో రాజేష్ మృతి చెందగా వెంకటరమణ భార్య రాధిక కాలు విరిగింది. రెండో కొడుకు రమేష్ వెన్నెముక విరగడంతో చికిత్స పొందుతున్నాడు.
నేడు అమెరికాకు....
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రాజేష్ ఆదివారం రాత్రి అమెరికాకు వెళ్లాల్సి ఉంది. అక్కడ ఆయనకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం రావడంతో వెళ్లడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
నిందితుడి అరెస్ట్...
ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి కారకుడైన ఇంజనీరింగ్ విద్యార్థి షవెల్‌పై బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 304(పార్ట్-2) కింద కేసు నమోదు చేశారు. శనివారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం షవెల్‌తోపాటు స్నేహితులు ఎన్.సూర్య, విష్ణు, అశ్విన్, సాయి రమేష్, అలెన్ జోసెఫ్ తదితరులు సినీ మ్యాక్స్‌లో ఉన్న టీజీఐ ఫ్రై డేస్‌లో మద్యం తాగి ఒకే కారులో అతివేగంతో దూసుకుపోతుండగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనకు కారకులైన ఆరుగురు విద్యార్థుల రక్తనమూనాలను సేకరించినట్లు బంజారాహిల్స్ సీఐ కె.శ్రీనివాస్ తెలిపారు.