
ఆ నంబర్ కోసం భారీగా చెల్లించిన బాలకృష్ణ
హైదరాబాద్ : ఎంత డబ్బు చెల్లించైనా సరే ఫ్యాన్సీ నంబర్ కోసం క్రేజీ కొనసాగుతూనే ఉంది. తాజాగా పలు ఫ్యాన్సీ నంబర్లపై రవాణా శాఖకు భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది. బుధవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన వేలం పాటల్లో పలు ప్రత్యేక నంబర్‌లపై రవాణాశాఖకు రూ.30.34 లక్షల ఆదాయం లభించింది.
గవి కన్‌స్ట్రక్షన్స్ అనే సంస్థ తమ బెంజ్ కారు కోసం 10.05 లక్షల రూపాయలు చెల్లించి వేలంలో ‘టీఎస్ 09 ఈటీ 9999’ నంబర్ సొంతం చేసుకుంది. ‘టీఎస్ 09 ఈయూ 0001’ నంబర్ కోసం సినీనటుడు నందమూరి బాలకృష్ణ రూ.7.77 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు. తమ బెంట్లీ కారు కోసం ఆయన ఈ నంబర్‌ను వేలంలో గెలుచుకున్నారు.
అలాగే ‘టీఎస్ 09 ఈయూ 0099’ నంబర్ కోసం ఆర్‌ఎస్ బ్రదర్స్ వస్త్రవ్యాపార సంస్థ రూ.2.70 లక్షలు చెల్లించింది. తమ ల్యాండ్‌రోవర్ కారు కోసం ఈ నెంబర్‌ను సొంతం చేసుకున్నారు. కాగా గతంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ కోసం ఏకంగా రూ.11లక్షలు చెల్లించి ‘9999’ నంబర్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.