
రాత్రి 12 వరకూ బార్లలో మద్యం విక్రయాలు!
* అదనంగా గంట సమయం పెంచేందుకు సీఎం గ్రీన్‌సిగ్నల్
* కొత్త సంవత్సరం నుంచి అమలుకు నిర్ణయం
* ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆగిన ఉత్తర్వులు
* మద్యం దుకాణాలకు సమయం పొడిగింపునకు నో
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బార్లలో మద్యం అమ్మకాల సమయాన్ని మరో గంట పెంచేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. కొత్త సంవత్సరం నుంచే జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బార్లలో ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే రిటైల్ మద్యం దుకాణాలకు మాత్రం అమ్మకాల సమయాన్ని పొడిగించలేదు. పోలీస్ శాఖ అభ్యంతరం తెలపడంతో మద్యం దుకాణాల సమయాన్ని పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. ప్రస్తుతం బార్లలో మద్యం అమ్మకాలు రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుండగా... జనవరి ఒకటి నుంచి రాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు సాగుతాయి. మద్యం మినహా ఆహార పదార్థాల (రెస్టారెంట్) విక్రయాలు అర్ధరాత్రి ఒంటి గంట వరకు కొనసాగుతాయి.
దేశంలో పారిశ్రామికంగా, పర్యాటకపరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అర్ధరాత్రి వరకు మద్యాన్ని అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు గత ఫిబ్రవరిలోనే ఎక్సైజ్ శాఖ నుంచి నివేదిక కోరింది. ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, ఆబ్కారీ మంత్రి పద్మారావు గౌడ్ కూడా మద్యం విక్రయాల సమయాన్ని పెంచాలని సీఎంకు సూచించారు. ఇతర మెట్రో నగరాల్లో అర్ధరాత్రి వరకు బార్లలో మద్యం అందుబాటులో ఉంటుండగా.. హైదరాబాద్‌లో స్టార్ హోటళ్లు మినహా ఇతర బార్లలో రాత్రి 11 గంటల వరకే మద్యం లభిస్తోంది. హైదరాబాద్, జిల్లా కేంద్రాలు మినహా మిగతా ప్రాంతాల్లో రాత్రి 10.30 గంటలకే బార్లను మూసేస్తున్నారు.
రిటైల్ మద్యం దుకాణాలను రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచాలన్న ఉత్తర్వులు కూడా హైదరాబాద్ మినహా రాష్ట్రంలో ఎక్కడా అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలో అధికారికంగా మద్యం దుకాణాలు, బార్లు తెరిచి ఉంచే సమయాన్ని మరో గంట పెంచాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు రెండు నెలల క్రితమే ఫైలును రూపొందించి ఆర్థిక శాఖతో పాటు ఎక్సైజ్ మంత్రి సంతకాలు చేసి సీఎం కేసీఆర్ ఆమోదానికి పంపించారు. దీనిపై రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులతో చర్చించిన సీఎం... బార్ల నిర్వహణ సమయాన్ని మరో గంట పెంచేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి.
రిటైల్ దుకాణాలకు పెంచితే సమస్యలు
రాష్ట్రంలో మద్యం రిటైల్ దుకాణాలను రాత్రి 10 గంటల దాకా తెరిచి ఉంచవచ్చు. కానీ జిల్లాల్లో 9.30కే మూత పడుతున్నాయి. దీంతో మద్యం దుకాణాల సమయాన్ని రాత్రి 11 గంటల వరకు పెంచాలన్న అంశంపై చర్చ జరిగింది. కానీ దీనిపై పోలీస్ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాత్రి 10 గంటల వరకు దుకాణాలు ఉంటేనే రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో తాగి గొడవలకు పాల్పడుతున్నారని... 11 గంటల వరకు పెంచితే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని ఆ శాఖ పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బార్లకు మాత్రమే సమయం పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికలు ముగిశాక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.