బీసీలకు కొత్తగా 50 గురుకులాలు
* ఈ విద్యా సంవత్సరంలో ఏర్పాటుకు సీఎం నిర్ణయం
* అవసరమైన ప్రతిపాదనలను సమర్పించాలని అధికారులకు ఆదేశం
* బీసీ సంక్షేమ శాఖపై కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల(బీసీ)కు చెందినవారి కోసం కొత్తగా 50 గురుకుల పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి. ఈ విద్యాసంవత్సరంలోనే వీటిని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వీటి ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను వెంటనే సమర్పించాల్సిం దిగా బీసీ సంక్షేమశాఖ అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుఆదేశించారు.
గురువారం బీసీ సంక్షేమ శాఖ సమీక్ష అనంతరం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(ఎఫ్‌ఏసీ) సోమేశ్‌కుమార్‌ను, ఆ తర్వాత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను క్యాంప్ కార్యాలయానికి పిలిపించి ఆయా అంశాలపై చర్చించారు. జూలైలోనే కొత్త గురుకులాలను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొత్తగా ప్రారంభించే ఈ 50 గురుకుల పాఠశాలలను బీసీల జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే 103 ఎస్సీ గురుకులాలు, 30 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు, 71 మైనారిటీ గురుకులాలు, 50 ఎస్టీ గురుకులాల ఏర్పాటు, వాటికి అవసరమైన సిబ్బంది, అద్దె భవనాలు, ఇతర అంశాలపై ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సమన్వయం చేస్తున్న విషయం తెలిసిందే. కొత్తగా 50 బీసీ గురుకులాల ఏర్పాటులో కూడా ప్రవీణ్‌కుమార్‌ను సంప్రదించి, ఆయన సలహాలకు అనుగుణంగా ముందుకు సాగాలని బీసీ సంక్షేమశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేయనున్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలతో పాటు బీసీ గురుకులాల్లో ఒకే విధమైన విద్యావిధా నం, బోధన, సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయా శాఖల అధికారులు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం 23 గురుకుల పాఠశాలలుండగా, వీటిలో 16 పాఠశాలలను కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని సీఎం నిర్ణయించారు.
ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి
అంతకుముందు క్యాంప్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, సీఎస్ రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు తదితరులతో సీఎం కేసీఆర్ బీసీ సంక్షేమ శాఖపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెనుకబడిన తరగతులకు చెందిన కులాల ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు, వారి అభ్యున్నతికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బీసీ కులాల్లోని జీవన పరిస్థితులను అధ్యయనం చేసి, వారి అభ్యున్నతికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ప్రత్యేకప్రణాళికను రూపొందించాలన్నారు.
బీసీలకూ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ స్కీమ్..
విదేశాల్లో ఉన్నతవిద్య అభ్యసించే బీసీ విద్యార్థులకు ఆర్థిక చేయూతను అందించడానికి ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఈ పథకం కింద ఆర్థిక సహాయాన్ని ఇస్తున్నారు. ఇదే తరహాలో బీసీలకు ఆర్థిక సహాయం అందించాలన్నారు. నిరుపేద బీసీ విద్యార్థులు లబ్ధిపొందేలా ఈ పథకం మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించారు.