శ్రీకాకుళంలో 2జీ స్కాం కన్నా పెద్ద కుంభకోణం!
- పసుపు రంగు చొక్కా కూడా వేసుకొచ్చా
- ముఖ్యమంత్రి సభలో లేకపోవడం దురదృష్టకరం
- 1300 కోట్ల ఎగుమతులు అక్రమంగా జరుగుతున్నాయి
- అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు
హైదరాబాద్
శ్రీకాకుళం జిల్లాలో బీచ్‌శాండ్ పేరుతో జరుగుతున్న అతిపెద్ద కుంభకోణం గురించి బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రత్యేకంగా తాను 'పసుపు' రంగు చొక్కా వేసుకుని వచ్చానని ఆయన ప్రస్తావించారు. ఈ కుంభకోణం గురించి తెలుసుకుంటుంటే తనకు మైండ్ బ్లోయింగ్... బుర్ర తిరిగిపోయింది అని ఆయన చెప్పారు. ఇది 2జీ స్పెక్ట్రమ్ స్కాం కంటే కూడా చాలా పెద్దస్థాయిలో జరుగుతోందని అన్నారు. బడాబాబులకు ఇందులో ప్రమేయం ఉందని, రూ. 1300 కోట్ల ఖనిజ ఎగుమతులు అక్రమంగా జరుగుతున్నా ఇంతవరకు ప్రభుత్వం దృష్టికి రాకపోవడం దారుణమని చెప్పారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశంపై ఆయన అధికార పక్షాన్ని దుమ్ము దులిపారు.
ఎక్కడైనా ఒక ఇంటి నిర్మాణం కోసం ఇసుక తీసుకెళ్తుంటే మాత్రం లారీ ఆపి.. జరిమానాలు విధించే అధికారులు, వేరే రాష్ట్రానికి ఇంత పెద్ద మొత్తంలో ఖనిజం తరలిపోతుంటే రహదారి పర్మిట్లు సైతం ఇచ్చి పంపేస్తున్నారని విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. టైమెక్స్ మినరల్స్ అని చెప్పి ఈస్ట్ వెస్ట్ మినరల్స్‌కు అనుమతి ఇచ్చారని అన్నారు. దీనిమీద అడిగితే, ఇది ఎప్పుడో 2006 నుంచి జరుగుతోందన్నారని, ఇంత పెద్ద కంపెనీ, పెద్ద పెద్ద నేతలతో సంబంధమున్న వ్యక్తికి ఎలా ఆపుతామని చెప్పారని ఆయన అన్నారు. తర్వాత కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి వెళ్తే మొత్తం విషయాలు తెలిశాయని, వీళ్లు చేసిన దుర్మార్గపు పనులు అన్నీ ఇన్నీ కావని తెలిపారు. మొత్తం 93 కంపెనీల ద్వారా 40 దేశాలకు రూ. 1300 కోట్ల రూపాయల విలువైన ఖనిజాన్ని ఎగుమతి చేశారన్నారు. అసలు ఎన్‌ఓసీ లేని చోట కూడా విచ్చలవిడిగా బీచ్‌శాండ్ తవ్వేశారని ఆయన చెప్పారు.
వేల కోట్ల రూపాయల ఖనిజం ఎగుమతి అవుతున్నా, ప్రభుత్వానికి వచ్చేది మాత్రం కేవలం ముష్టి 2 శాతం మాత్రమేనని, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్టర్ చేసినా, అంతకంటే ఎక్కువ వస్తుందని ఆయన అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుని కేంద్రాన్ని కోరితే, వారి అనుమతితో ఇక్కడే దీన్ని ప్రాసెస్ చేసి ఉపయోగించుకోవచ్చని సూచించారు. విజిలెన్స్ డిపార్టుమెంటులో జరిగిన అక్రమాలు అన్నీఇన్నీ కావని చెప్పారు. దురదృష్టం కొద్దీ ఇంత ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతుంటే ముఖ్యమంత్రి సభలో లేరని, ఖనిజాల విషయంలో సంస్కరణలు తీసుకురాకపోతే చాలా కష్టం అవుతుందని ఆయన చెప్పారు.
అయితే.. ఇదే అంశంపై మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు మాత్రం, ఈ పరిశ్రమ మీద ఆధారపడి అనేక మంది పేదలు ఉపాధి పొందుతున్నారని, అందువల్ల దీనిపై చర్యలు తీసుకునే ముందు ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.