హైదరాబాద్‌కు విజయవాడ పోటీ కాదు
బెజవాడలో భయపెడుతున్న అద్దెల మోత.. నైట్ ఫ్రాంక్ నివేదిక
సాక్షి, అమరావతి: మౌలిక వసతుల లేమి.. నిపుణుల లభ్యత లేకపోవడం.. విపరీతమైన అద్దెల మోత విజయవాడలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రధాన అవరోధాలుగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ పరిశోధన సంస్థ ‘నైట్ ఫ్రాంక్’ తెలిపింది. ఈ నేపథ్యంలో మౌలిక వసతులు, మానవ వనరులు పుష్కలంగా ఉన్న హైదరాబాద్‌కు విజయవాడ ఏ విధంగానూ పోటీ ఇవ్వలేదని స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో రాజకీయంగా కొద్దిపాటి అనిశ్చితి ఉన్నప్పటికీ వృద్ధికి ఎటువంటి ఢోకా లేదంది.
హైదరాబాద్‌తో పోటీపడాలంటే విజయవాడలో మౌలిక వసతులు పెరగడంతోపాటు అద్దెలు దిగి రావాల్సిన అవసరముందని తేల్చిచెప్పింది. ఈ సంస్థ రాష్ట్ర రాజధాని అమరావతిపై తొలిసారిగా ప్రత్యేక నివేదికను విడుదల చేసింది. రాజధాని నిర్మాణం పూర్తయి.. మౌలిక వసతులు ఏర్పడిన తర్వాతనే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకునే వీలుంటుందని అందులో అభిప్రాయపడింది. విజయవాడలో అద్దెలు భారీగా ఉండడాన్ని నివేదిక ప్రస్తావించింది.
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌లో ఉండటానికి పదేళ్లు అవకాశమున్నప్పటికీ ముందుగానే సచివాలయాన్ని తరలించడంతో వాణిజ్య, నివాస స్థలాలకు బాగా డిమాండ్ ఏర్పడి అద్దెలు విపరీతంగా పెరిగాయని నైట్ ఫ్రాంక్ హైదరాబాద్ డెరైక్టర్ శ్రీవాసుదేవన్ అయ్యర్ తెలిపారు. హైదరాబాద్‌లోని అబిడ్స్, కోఠి వంటి ప్రధానమైన వాణిజ్య, వ్యాపార ప్రాంతాల్లో చదరపు అడుగు రూ.30 నుంచి రూ.40 ఉంటే విజయవాడ బెంజ్ సర్కిల్ ప్రాంతంలో రూ.60 నుంచి రూ.70 వరకు పలుకుతోందన్నారు.