సీఎం.. సూపర్‌మాన్ అనుకుంటున్నారు
జిల్లాల ఏర్పాటుపై టీఆర్‌ఎస్ సర్కార్‌కు ప్రశ్నలు సంధించిన బీజేపీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తనను తాను తెలంగాణ సూపర్‌మాన్‌గా భావించి.. అన్నీ తానే చేయాలని అనుకుంటున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది. ఆయన నిర్ణయాల వల్ల రాష్ట్రం ఏమై పోతుందోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొంది. కొత్త జిల్లాల ఏర్పాటులో దుందుడుకుగా, తొందరపాటుతో తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎలాంటి ప్రజాహితం కనిపించడం లేదని ధ్వజమెత్తింది.
బుధవారం బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు విలేకరులతో మాట్లాడుతూ, ఏ ప్రాతిపదికన జిల్లాల విభజన చేస్తున్నారో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్లు, అధికారుల సాధికార కమిటీ ఎన్ని జిల్లాల ఏర్పాటుపై నివేదికను ఇచ్చిందో తెలపాలన్నారు. తాజాగా ఆ పార్టీ నేత కేశవరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీకున్న చట్టబద్ధత ఏమిటని ప్రశ్నించారు.