'సింగపూర్ మీద ఉన్న అసక్తి రుణమాఫీపై లేదే'
హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తనదైన శైలిలో విమర్శలు సంధించారు. ఆదివారం హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణమాఫీ, విద్యుత్ సంక్షోభంపై దృష్టి పెట్టకుండా హైదరాబాద్ నగరాన్ని సింగపూర్, కరీంనగర్ను లండన్లాగా మారుస్తామని చెప్పుకుంటుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఈ సందర్బంగా కిషన్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి సింగపూర్ పై ఉన్న అసక్తి రుణమాఫీపై లేదని ఆయన ఆరోపించారు.
తమకు ఉద్యోగాలు కావాలని విద్యార్థులు ఆందోళనలకు దిగుతుంటే... తిన్నది అరకగ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని సాక్షాత్తూ కేసీఆర్ సీఎం స్థానంలో ఉండి వ్యాఖ్యానించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ గుప్పించిన హామీలను అమలు చేయాలని ప్రతిపక్షాలు నిలదీస్తుంటే ... అవి తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్ర వేసి... విపక్షాలపై దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. మెదక్ లోక్సభ ఉప ఎన్నికలో తమ పార్టీకి బీజేపీ మద్దతు ఉంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మెదక్ లోక్సభ స్థానానికి గతంలో బీజేపీ పోటీ చేసిన సంగతిని ఈ సందర్బంగా కిషన్ రెడ్డి గుర్తు చేశారు.