
టికెట్ రాలేదని బాధతో.. బిల్డింగ్‌పైకి ఎక్కి..!
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ నుంచి టికెట్ ఆశించిన ఓ నాయకుడు.. చివరినిమిషంలో తనకు అవకాశం లభించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
ఆల్విన్‌కాలనీ: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ నుంచి టికెట్ ఆశించిన ఓ నాయకుడు.. చివరినిమిషంలో తనకు అవకాశం లభించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఏకంగా ఓ భారీ భవంతిపైకి ఎక్కి.. దూకేందుకు ప్రయత్నించారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు జయన్న శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్‌కాలనీ డివిజన్ స్థానంలో పార్టీ టికెట్ తనకే వస్తుందని భావించారు. అయితే ఆదివారం ఆయనకు అవకాశం రాకపోవడంతో కలత చెందారు.
వెంటనే కూకట్‌పల్లి వివేకానందానగర్‌లోని వడ్డేపల్లి ఎన్‌క్లేవ్‌లోని బిల్డింగ్‌పైకి ఎక్కి దూకేందుకు యత్నించారు. కిందినుంచి చూస్తున్న స్థానికులు ఆయన ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. పలువురు కింద నుంచి బ్రతిమిలాడారు. మరికొందరు భవనంపైకి ఎక్కి జయన్నను సముదాయించి కిందకు తీసుకువచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కృషిచేసిన వారికి సీట్లు ఇవ్వకుండా పొత్తుల పేరుతో డబ్బున్న వ్యక్తులకు, టీడీపీ వారికి సీట్లు కట్టబెట్టడంపై ఆవేదన వ్యక్తం చేశారు.