కుటుంబ పాలనకు స్వస్తి పలుకుదాం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కేటీఆర్ ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు ఇస్తామని ఇప్పుడు చెబుతున్నాడు. కానీ అతను పుట్టక ముందు నుంచే హైదరాబాద్ ప్రజలు నల్లా నీళ్లు తాగుతున్నారు.
దిల్‌సుఖ్‌నగర్: సీఎం కేసీఆర్ హైదరాబాద్‌ను తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. నగరాన్ని రెండు కుటుంబాల (కేసీఆర్, ఓవైసీ) పాలన నుంచి కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆర్‌కేపురం డివిజన్‌లో సీనియర్ సిటిజన్స్ కాలనీ అసోసియేషన్ సమావేశం గురువారం స్థానిక పద్మావతి కళ్యాణ మండపంలో నిర్వహించారు.
దీనికి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్, ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కుటుంబాలే బాగుపడ్డాయని విమర్శించారు. ఈ కుటుంబాల పాలనకు స్వస్తి పలకాలని ప్రజలను కోరారు. బంగారు తెలంగాణ రాలేదు కానీ, కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారమైందన్నారు. బీజేపీని గెలిపిస్తే ఈ రెండు కుటుంబాల పాలన నుంచి ప్రజలకు, హైదరాబాద్‌కు రక్షణ కల్పిస్తామన్నారు.
‘కేటీఆర్ ప్రతి ఇంటికీ నల్లా నీరు ఇస్తామని ఇప్పుడు చెబుతుండు.
అతను పుట్టక ముందు నుంచే హైదరాబాద్ ప్రజలు నల్లా నీరు తాగుతున్నార’ని కిషన్‌రెడ్డి కేటీఆర్‌కు కౌంటర్ వేశారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామంటూ, ఒక ఇల్లు కట్టించి గ్రాఫిక్స్‌తో ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా రాష్ట్రంలో ఏ పథకాలు అమలు కావని గుర్తుంచుకోవాలన్నారు. దేశంలో 90 శాతం కార్పొరేషన్‌లను బీజేపీ పాలిస్తోందని, నగరంలో కూడా మిత్రపక్షాలను గెలిపిస్తే ఉగ్రవాదం, వినాశక శక్తుల నుంచి హైదరాబాద్‌ను కాపాడుకుంటామన్నారు.
మంచికి మారుపేరుగా నిలిచిన ఆర్‌కేపురం డివిజన్ అభ్యర్థి రాధా ధీరజ్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కిషన్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ నాయకులు పలువురు బీజేపీలో చేరారు. కార్యక్రమంలో బొక్క నర్సింహారెడ్డి, పిట్ట ఉపేందర్ రెడ్డి, ధీరజ్ రెడ్డి, జంగయ్య యాదవ్, ప్రభాకర్‌జీ, కార్నాటి ధనుంజయతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.