నాకు ఏమైనా జరిగితే కమిషనర్‌దే బాధ్యత
దేశంలో ఎక్కడ ఏం జరిగినా ఓల్డ్ సిటీ కేంద్రంగా మారుతోంది..
యూనివర్శిటీల్లో విద్యార్థులను తీవ్రవాదం వైపు మళ్లింపు
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
దోమలగూడ : తీవ్రవాదుల నుంచి తనకు ప్రాణ హాని ఉందని.. ఈ విషయంలో ఎటువంటి అపాయం చోటుచేసుకున్నా.. అందుకు నగర పోలీసు కమిషనర్ భాద్యత వహించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు రక్షణ పెంచాలని, దేశద్రోహ ఉగ్రవాది యాకూబ్ మెమన్‌ను సమర్థించే వారి మీద దేశద్రోహులను శిక్షించాలని కోరుతూ జాతీయ హిందూ ఉద్యమం ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాది మెమన్ ఉరితీతపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మరికొందరు ముస్లిం నేతలు, కుహనా సెక్యులరిస్టులు అత్యున్నత న్యాయ వ్యవస్థ తీర్పును, రాష్ట్రపతి విచక్షణను ప్రజల్లో తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మెమన్‌ను సమర్థించడం దేశద్రోహం కిందకే వస్తుందని, భవిష్యత్తులో ఇది ప్రమాదకరంగా మారకుండా ఉండాలంటే యాకూబ్‌ను సమర్థించే వారిని, న్యాయ వ్యవస్థను వ్యతిరేకించే వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ఎన్నో ఏళ్లుగా చంపుతామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, దీనిపై డీజీపీ, కమిషనర్, ఇంటిలిజెన్స్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా దర్యాప్తు చేయడంలేదు, పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
పాత నగరం టైస్ట్‌ల అడ్డాగా మారిందని, తాజాగా నలుగురైదుగురు ఐఎస్‌ఐ తీవ్రవాదులు పోలీసుల గాలింపులో పట్టుపడ్డారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో శివసేన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు మురారి, భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ పి నరేందర్, హిందూ ఏక్తా మంచ్ అధ్యక్షులు బద్రి తోష్నివాల్, హిందూ ధర్మ రక్షా సమితి కార్యదర్శి రామాంజనేయులు, హిందూ జనజాగృతి సమితి రాష్ట్ర కన్వీనర్ చంద్రమొగెర్, జైన్ సేవా సంఘ్ అధ్యక్షులు నోరతన్‌మాల్, బీజేపీ లీగల సెల్ కన్వీనర్ అరుణాసాగర్, అదర్శ మహిళా సంఘం అధ్యక్షులు రూబీమిశ్రా తదితరులు పాల్గొన్నారు.