బాధితులే బ్రాండ్ అంబాసిడర్లు...
పీపుల్స్ ఫ్రెండ్లీ పోలిసింగ్ సదస్సులో కమిషనర్ మహేందర్‌రెడ్డి
సిటీబ్యూరో: ‘‘మీరేమి అన్నారో ప్రజలు మరిచిపోతారు... మీరేమి చేశారో కూడా మరిచిపోతారు... కానీ.. మీరు వారికి ఎటువంటి భావన కలిగించారో మాత్రం బాధితులు మరిచిపోరు...’’ అని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. పీపుల్స్ ఫ్రెండ్లీ పోలిసింగ్‌పై కమిషనరేట్ కాన్ఫరెన్స్‌హాల్‌లో నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో ఆయన పోలీసు సిబ్బందినుద్దేశించి ప్రసంగించారు. బాధితులే పోలీసులకు బా్రండ్ అంబాసిడర్లుగా ఉండేలా మన విధులుండాలన్నారు. ప్రజలకు స్నేహ పూర్వకమైన పోలీసు వ్యవస్థను అందించేందుకు నగరంలో ఉన్న 12 వేల మంది పోలీసులను పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌వైపు తీర్చి దిద్దే శిక్షణ కార్యక్రమానికి మహేందర్‌రెడ్డి తొమ్మిది రోజుల క్రితం శ్రీకారం చుట్టారు. వారి రోజువారీ విధులకు ఆటంకం కలుగుకుండానే నిత్యం వంద మందికి ‘పీపుల్స్ ఫ్రెండ్లీ పోలిసింగ్’పై శిక్షణ ఇప్పిస్తున్నారు.
ఈ కార్యక్రమం మరో రెండు నెలల వరకు కొనసాగనుంది. ఠాణాకు వచ్చే బాధితులను ఎలా పలకరించాలి? వారు చెప్పే ఫిర్యాదును ఎలా వినాలి, ఆ తర్వాత సమస్యను ఎలా పరిష్కారించాలి తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ఒక్కసారి ఠాణాకు వచ్చిన బాధితుడు పోలీసులందించే సేవలపై సంతృప్తి వ్యక్తం చేసేలా మన నడవడిక ఉండాలని కమిషనర్ మహేందర్‌రెడ్డి సూచించారు. ప్రజల కోసం పని చేస్తున్నామని మనకు మనం చెప్పుకునే కంటే బాధితులే మన సేవలపై ప్రచార కర్తలుగా మెలిగే విధంగా మనం నడుచుకోవాలన్నారు. ముఖ్యంగా స్టేషన్‌కు వచ్చే మహిళా ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలన్నారు.
స్నేహపూర్వక సేవలందిస్తాం...
ఉన్నతాధికారులు ఈ విధంగా తమను తీర్చి దిద్దడం సమాజానికి, పోలీసు వ్యవస్థకు మెరుగైన ఫలితాలు వస్తాయని శిక్షణకు హాజరైన కొందరు పోలీసులు ‘సాక్షి’కి తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకు అధికారులు తమ వెన్ను తట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. పేదలు, ధనవంతులు ఎవరు ఠాణాకు వచ్చినా స్నేహ పూర్వకమైన సేవలందిస్తామన్నారు.